– కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలో 2047 నాటికి భారతదేశం అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఎదుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. చెప్పులు ధరించే వ్యక్తి విమానంలో ప్రయాణించడమే మోడీ కల అని చెప్పారు. ఉడాన్ స్కీమ్ ద్వారా సామాన్య ప్రజలకు విమాన సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆ పథకం కింద 517 మార్గాలు ప్రారంభమయ్యాయనీ, 2 వాటర్ ఏరోడ్రోమ్, 9 హెలిపోర్ట్‌లతో సహా 76 విమానాశ్రయాలను కలుపుతూ సేవలను విస్తరించామని వివరించారు. విమనాశ్రయాలను పునరుద్ధరిస్తున్నామన్నారు. దేశంలో 500 కొత్త ఇండిగో విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా ఎయిర్‌క్రాప్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించగలిగేటువంటి ఏవియేషన్ స్కూల్(జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్)ను హైదరాబాద్‌లో ప్రారంభించామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా వర్క్ షాప్ నిర్వహించారు. దాన్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ సయ్యద్ ఇస్లాం ప్రారంభించారు.