మహారాష్ట్ర సర్‌లో షాకింగ్ గణాంకాలు
38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘అన్‌కలెక్టబుల్’గా నమోదు
డ్రాఫ్ట్ జాబితాలో రెండు కోట్ల మందికి పైగా పేర్లు లేవు
ముంబయి : మహారాష్ట్రలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఓటర్ల జాబితాలపై తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. రాష్ట్రంలో ముస్లిం జనాభా 20 శాతానికి పైగా ఉన్న 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 30 శాతం మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాల్లో కనిపించలేదు. ఈ విషయాలను సర్ గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 21.1 శాతం మంది ఓటర్లు.. జాబితాల్లో లేకపోవడం, వారి సంఖ్య రెండు కోట్లకు పైగా ఉండటం తీవ్ర చర్చకు దారితీసింది. సర్ పేరుతో నిజమైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించే ప్రమాదం ఉందన్న విమర్శలకు ఈ గణాంకాలు మరింత బలం చేకూర్చుతున్నాయి. మహారాష్ట్రలో జరుగుతున్న సర్ ప్రక్రియలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపు రేటు రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా నమోదైంది. 38 నియోజకవర్గాల్లో గత ఓటర్ల జాబితాలో ఉన్న 37 లక్షలకు పైగా ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలను ‘అన్‌కలెక్టబుల్’గా గుర్తించారు. ఇది ఆయా నియోజకవర్గాల్లో గత ఓటర్ల సంఖ్యలో 29.7 శాతానికి సమానం.రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటున 21.1 శాతం మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించలేకపోయినట్టు గణాంకాలు నమోదయ్యాయి.ఈ సంఖ్య రెండు కోట్ల మందికి పైగా ఉంటుందని గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని అసమానంగా తొలగింపులు జరిగాయన్న ఆందోళనలు, అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ముస్లిం జనాభా అధికంగా ఉన్న అనేక ప్రాంతాల్లో తొలగింపు రేటు అధికంగా ఉండటంతో ఓటర్ల హక్కులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘అన్‌కలెక్టబుల్’ అంటే?
ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు దక్కని వారిని వివిధ కారణాలతో ‘అన్‌కలెక్టబుల్’గా గుర్తించారు. వీరిలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, మరణించినవారు, ఇంటి వద్ద అందుబాటులో లేనివారు, డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నవారు ఉన్నారు. అలాగే ఎన్యుమరేషన్ ఫారం నింపేందుకు నిరాకరించిన వారిని కూడా ‘ఇతరులు’ కేటగిరీలో చేర్చారు.
భివండి ఈస్ట్‌లో దాదాపు సగం మంది ఓటర్లు తొలగింపు
ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతంలోని భివండి ఈస్ట్‌లో గత ఓటర్ల జాబితాలో ఉన్నవారిలో 49.1 శాతం మంది పేర్లు కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాలో కనిపించలేదు. భివండి వెస్ట్‌లో ఈ సంఖ్య 44.7 శాతం కాగా, కల్వా-ముంబ్రాలో 42.9 శాతంగా నమోదైంది. ముస్లిం జనాభా 51 శాతంగా ఉన్న భివండి ఈస్ట్‌లో ఏకంగా 49.1 శాతం మంది ఓటర్లు ‘అన్‌కలెక్టబుల్’గా గుర్తించబడటం ఆందోళన కలిగిస్తోంది. ముస్లిం జనాభా 53 శాతంగా ఉన్న ముంబయిలోని మాన్‌ఖుర్డ్ శివాజీ నగర్లో 42.3 శాతం మంది ఓటర్లు జాబితాలో కనబడలేదు. ముస్లిం జనాభా 27.6 శాతంగా ఉన్న చాందివలిలో 41.4 శాతం మంది ఓటర్లు ‘అన్‌కలెక్టబుల్’గా నమోదయ్యారు. సియోన్-కోలివాడా, పూణే కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో కూడా తొలగింపు రేటు 40 శాతానికి మించిపోయింది. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న మాలేగావ్ సెంట్రల్లో తొలగింపు రేటు 23.4 శాతంగా నమోదైంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా 78.4 శాతంగా ఉంది.
ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పరిస్థితి
షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన 29 నియోజకవర్గాల్లో సగటు తొలగింపు రేటు 19.6 శాతంగా నమోదైంది. షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన 25 నియోజకవర్గాల్లో ఇది 13.2 శాతంగా ఉంది.
ఇక జనసాంద్రత అధికంగా ఉన్న జిల్లాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు తొలగింపులకు గురయ్యారు. పూణే జిల్లాలో అత్యధికంగా 28.6 లక్షల మంది, థానేలో 28.5 లక్షల మంది, ముంబయి సబర్బన్ జిల్లాలో 26.5 లక్షల మంది ఓటర్ల వివరాలు ముసాయిదా జాబితాలో కొనసాగలేదు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ తొలగింపులు నమోదయ్యాయి.
బీజేపీ పాలనలో ఓటు హక్కుపై పెరుగుతున్న అనుమానాలు
బీజేపీ పాలనలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే అనేక ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో సర్‌లో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాల్లో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో నిజమైన ఓటర్లను తొలగిస్తే ప్రజాస్వామ్యానికి వలస్తంభమైన ఓటు హక్కుకే ముప్పు ఏర్పడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.



