Friday, September 11, 2026
E-PAPER
Homeజాతీయంరుతుపవన సంక్షోభం తీవ్రం

రుతుపవన సంక్షోభం తీవ్రం

- Advertisement -

సెప్టెంబర్‌లో 26 శాతం లోటు వర్షపాతం
దేశవ్యాప్తంగా సీజనల్‌ వర్షపాతం 15 శాతం తక్కువ
కీలక దశలో ఖరీఫ్‌ పంటలు.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన
తెలంగాణ, ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ లోటు
నీటి నిల్వలు, వ్యవసాయ ఉత్పత్తి, ఆహార ధరలపై ప్రభావం

న్యూఢిల్లీ : దేశంలో రుతుపవన సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. సెప్టెంబర్‌ తొలి తొమ్మిది రోజుల్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 26 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బలహీనంగా, అసమానంగా కొనసాగిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా సీజనల్‌ వర్షపాతం లోటు 15 శాతానికి చేరుకుంది. ఖరీఫ్‌ పంటలు కీలక ఎదుగుదల దశలో ఉన్న సమయంలో వర్షాలు తగ్గిపోవడం వ్యవసాయం, జలవనరులు, ఆహార ధరలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా గణాంకాల ప్రకారం… సెప్టెంబర్‌ 1 నుంచి 9 వరకు దేశంలో 59.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను కేవలం 44.3 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో ఈ తొమ్మిది రోజుల్లో వర్షపాతం లోటు 26 శాతానికి చేరింది. ఇక నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభమైన జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు దేశవ్యాప్తంగా 760.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. 648 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే మొత్తం సీజనల్‌ వర్షపాతంలో 15 శాతం లోటు నమోదైంది.

రాష్ట్రాల్లో అసమాన వర్షపాతం
దేశవ్యాప్తంగా వర్షాలు అత్యంత అసమానంగా ఉన్నాయని ఐఎండీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజస్తాన్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి ప్రధాన వ్యవసాయ రాష్ట్రాల్లో సీజనల్‌ వర్షపాతంలో గణనీయమైన లోటు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్‌ తొలి తొమ్మిది రోజుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గింది.

తగ్గిన మేఘాల కదలిక
సెప్టెంబర్‌ 10న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భారత ఉపఖండంలోని విస్తార ప్రాంతాలపై మేఘాల కదలిక గణనీయంగా తగ్గినట్టు కనిపించింది. బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో కొన్ని మేఘ వ్యవస్థలు చురుగ్గా ఉన్నప్పటికీ… పశ్చిమ, మధ్య, ఉత్తర భారతదేశంలోని విస్తార ప్రాంతాలు దాదాపు మేఘరహితంగా కనిపిస్తున్నాయి. రుతుపవనాలు చివరి దశలోకి ప్రవేశిస్తున్న సమయంలో మేఘాల చురుకుదనం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. సీజన్‌ ముగియడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వర్షలోటును పూడ్చుకునే అవకాశం ఎంతవరకు ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఖరీఫ్‌ పంటలకు 
పెరుగుతున్న ముప్పు
ఈ ఏడాది వర్షాలు ప్రారంభం నుంచి అనేక ప్రాంతాల్లో అసమానంగా కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, మరికొన్ని ప్రాంతాలు సుదీర్ఘ పొడి వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లోనూ వర్షాలు తగ్గిపోవడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. సెప్టెంబర్‌ నెల ఖరీఫ్‌ పంటలకు అత్యంత కీలకమైనది. ఈ సమయంలో వరి, పత్తి, సోయాబీన్‌, మొక్కజన్న, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు ఎదుగుదలలో కీలక దశలో ఉంటాయి. సరిపడా వర్షాలు, నేలలో తేమ లేకపోతే పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

నీటి వనరులు, ధరలపై ప్రభావం
దేశంలోని దాదాపు సగం జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్టు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో వ్యవసాయ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. అదే సమయంలో నీటి నిల్వలు, భూగర్భ జలాలు, ఇతర జలవనరులపై కూడా ఒత్తిడి పెరగవచ్చు. పంట దిగుబడులు తగ్గితే ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. రైతులు ఇప్పటికే అసమాన వర్షాలతో ఇబ్బందులు పడుతుండగా.. సెప్టెంబర్‌లో వర్షాభావం కొనసాగితే ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -