Friday, September 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీఆర్ఎస్ పై జనాగ్రహం

బీఆర్ఎస్ పై జనాగ్రహం

- Advertisement -

ఫ్లాష్ సర్వేలో అదే వెల్లడి.. మూడ్రోజుల ఆ పార్టీ తీరుపై ప్రజల్లో అసహ్యం
శాసనసభను అడ్డుకొనేందుకు ఫాంహౌజ్‌‌లోనే కుట్ర
ఈ పరిణామాలు మనకే అనుకూలం
కుట్రలను సభ్యులంతా ఐక్యంగా తిప్పికొట్టారు
పోలీసుల్లో కేటీఆర్‌కు రేవంత్‌‌రెడ్డే కనిపించాడు… అందుకే ఆక్రోశంతో దాడులు
వచ్చే రెండేండ్ల మీ పనితీరు అత్యంత కీలకం
గెలుపోటములకు అదే గీటురాయి : సీఎల్పీ భేటీలో సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున శాస‌న‌స‌భ ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద‌, లోప‌ల, బ‌య‌టా కొన‌సాగిన ప‌రిణామాల‌పై బీఆర్‌ఎస్‌ ‌నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి అన్నారు. దీనిపై ప్రభుత్వ ఆధ్వ‌ర్యంలో ఫ్లాష్ స‌ర్వే నిర్వ‌హించామ‌ని చెప్పారు. గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు. త‌మ ప్ర‌భుత్వ వెయ్యి రోజుల పాల‌న‌లో సాధించిన విజ‌యాలు, అమ‌లు చేసిన సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌ను ఏక‌రువు పెట్టారు. వాటిని ప్రజలకు వివరించేందుకు వీలుగా పెద్ద ఎత్తున స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మూడ్రోజులపాటు జరిగిన బీఆర్‌ఎస్‌ ‌నేతల హైడ్రామాపై చేపట్టిన ఫ్లాష్‌ ‌సర్వేలో అనేక అంశాలు వెల్లడయ్యాయని చెప్పారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ తీరు, ఆ పార్టీకి చెందిన స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌ను ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌నే విష‌యం స‌ర్వేలో తేలింద‌న్నారు. మూడ్రోజుల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స‌స్పెన్ష‌న్‌, లైంగిక వేధింపుల కేసు న‌మోదు త‌దిత‌రాంశాల‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని సూచించారు.

ప‌రిస్థితి ప్ర‌భుత్వానికి, కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉంద‌ని సీఎం వ్యాఖ్యానించారు. శాస‌న‌స‌భ‌, మండ‌లిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ స‌భ్యులు అనుస‌రిస్తున్న తీరుపై ఆయ‌న ఈ సంద‌ర్భంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా ఉండేందుకు, స‌భ‌ను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాం హౌజ్ లోనే కుట్రలు ప‌న్నార‌ని ఆరోపించారు. అధికారం పోయినా అహంకారం వీడ‌ని బీఆర్ఎస్ నాయకులు పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించి మూడు రోజులపాటు స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించార‌ని గుర్తుచేశారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది క‌లిగించ‌టం లాంటి చ‌ర్య‌ల‌తో బీఆర్ఎస్ దుందుడుకు చ‌ర్య‌లు ప‌రాకాష్ట‌కు చేరాయ‌న్నారు. శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించటం చ‌రిత్ర‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోలీస్‌ సిబ్బందిలో రేవంత్ రెడ్డి కనిపించినట్టు కేటీఆర్ అక్రోశంతో ఊగిపోయి… వారిపై దాడులు చేయించారని ఎద్దేవా చేశారు. జరిగిన దాడులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే స‌మ‌యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రల‌ను శాస‌న‌స‌భ‌లోప‌ల‌, బ‌య‌టా బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు విడ‌మ‌రిచి చెప్పారంటూ ఆయ‌న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను అభినందించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు వీలుగా మూడు రోజుల‌పాటు జ‌రిగిన అన్ని సంఘటనలపై విచారణ చేపట్టామ‌ని తెలిపారు.

చర్చల్లో పాల్గొనండి
శాస‌నస‌భ‌, మండ‌లిలో జ‌రిగే చర్చల్లో తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స‌భ్యుల‌ను ఆదేశించారు. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని, అన్ని రోజులూ సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్ లో రాజకీయంగా రాణించలేరంటూ యువ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను అప్రమత్తం చేశారు. అందరికీ వెసులుబాటుగా ఉండాల‌నే ఉద్దేశంతో అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నామనీ, అసెంబ్లీలో సెంట్రల్ హాల్ ను ప్రారంభించుకుని మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్నామని ఆయన గుర్తుచేశారు. సభల్లో నియోజకవర్గాల‌కు సంబంధించిన సమస్యలను ప్రస్తావించాలని సీఎం సూచించారు. కాంగ్రెస్ నుంచి ఎదిగిన మాజీ మంత్రులు సునీతా లక్ష్మా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్ కే నష్టం చేయాలని చూస్తున్నారంటూ తప్పుపట్టారు. త‌మ పార్టీ అవకాశం ఇవ్వకపోతే వారు రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? అని ఆయన ప్రశ్నించారు.

​దేశానికే పొంచి ఉన్న ప్రమాదం
స‌ర్ పేరుతో దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయనీ, ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 103 కోట్ల మంది వయోజన జనాభా ఉంటే, ఓటర్ల జాబితాలో 88 కోట్ల మందినే చూపిస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలోనూ సర్ పేరుతో ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేగా మళ్లీ గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ సర్ అంశాన్ని, ఓటు హక్కును కాపాడే విషయాన్ని సీరియస్ గా పరిగణించాలని సూచించారు. ఎమ్మెల్యేల ప్రవర్తన, వ్యక్తిగత పనితీరే గెలుపోట‌ముల‌ను ప్రభావితం చేస్తుందని హెచ్చ‌రించారు. దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన జనగణనలో కుల‌గ‌ణ‌న‌ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేన‌ని పేర్కొన్నారు. వెయ్యి రోజుల్లో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు తీసుకొచ్చేలా సహకరించిన అందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

​కుట్ర‌ల‌ను ఎలా ఛేదించ‌గ‌ల‌మో చూపించాం : డిప్యూటీ సీఎం భ‌ట్టి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయ‌టం ద్వారా బీఆర్ఎస్ కుట్రలను ఎలా ఛేదించగలమ‌నే విష‌యాన్ని చేత‌ల్లో చూపించామ‌ని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఆ పార్టీ నాయకుల తీరు, వారి భాష, శుద్ధీకరణను సభ్యులందరూ మూకుమ్మ‌డిగా ఎండ‌గ‌ట్టారని తెలిపారు. మనమంతా ఒకటే మాట.. ఒకటే బాటగా ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, అయితే పార్టీగా, ప్ర‌భుత్వంగా చేసుకోవాల్సిన ప్రచారం చేసుకోకపోవడం వల్ల ప్రతిపక్షాలకు ఆయుధం ఇస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. చేసిన ప‌నుల గురించి సరైన విధంగా ప్రచారం చేసుకుంటే ఆ ప్రవాహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వప‌రంగా ఇప్పుడు అమ‌లు చేసే ప‌థ‌కాలే భ‌విష్య‌త్తులోనూ పార్టీని గెలిపిస్తాయ‌ని వివ‌రించారు. మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిడి నర్సింహ రెడ్డి, వంగా సుబ్బారావు, జి.సిద్దయ్య మరణంప‌ట్ల సీఎల్పీ సమావేశం సంతాపం తెలిపింది. రాష్ట్రంలో ఎల్‌‌నినో ప్రభావం, నీళ్ల సమస్యల‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనగణనలో బీసీ కాలమ్ పెట్టాలన్న డిమాండ్ గురించి మంత్రి పొన్నం ప్రభాకర్, 22 ఏ, నిషేధిత భూముల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

​సర్ ప్రక్రియపై దృష్టి పెట్టండి : 
మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్యేలు సర్ ప్రక్రియపై దృష్టి సారించాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. రానున్న రెండున్నరేండ్లు కీలకమని, అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీకి ప‌డ‌వనుకున్న ఓట్లను పకడ్బందీగా తీసేస్తున్నారనీ, పెద్ద సంఖ్యలో ఓట్లు పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన వాటిలో ఎక్కువగా దళితులు, గిరిజనుల ఓట్లు ఉన్నాయని తెలిపారు. దీనిపై సీఎం ఇప్పటికే చాలాసార్లు సమీక్షించారని చెప్పారు. సర్ ప్రక్రియను దుర్మార్గంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం రాష్ట్రంలో అమ‌ల‌వుతున్నాయ‌ని చెప్పారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్ల కోసం నిలబడితే కేంద్రం సహకరించలేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -