నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ల పోస్టులను ఒక సంవత్సరం ఒప్పంద కాలపరిమితికి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ లకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలను జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజు మర్మాట్, డేవిడ్ లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల అవసరాల దృష్ట్యా ప్రస్తుతానికి మెడికల్ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించడమే లక్ష్యంగా సాగుతున్నట్లూ వివరించారు.
ప్రిన్సిపల్ వెంకట్ లకావత్ మాట్లాడుతూ..నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎవరు రాలేదని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల 34 ఖాళీలకు గాను 8 మంది వచ్చారని, సీనియర్ రెసిడెంట్ల 24 ఖాళీలకు గాను 3మంది వచ్చారని పేర్కొన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తిగా జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉంటుందని వివరించారు. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని దీనిలో భాగంగా రానున్న రోజుల్లో ప్రతి పోస్ట్ భర్తీ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.



