ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
నవతెలంగాణ-సంగారెడ్డి
జిల్లాలోని బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం అందించేందుకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కింద ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి అర్హులైన మహిళలు సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన మహిళలు http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనుటకు ఈ నెల 15 చివరి తేదీ అని తెలిపారు.దరఖాస్తుదారుల వయస్సు 18 నిండి 55 సంవత్సరాల లోపు ఉండాలని, నిరుద్యోగ మహిళలు, నిరుపేదలు, నిరాధారణకు గురైన వితంతు, ఒంటరి, వికలాంగులు, అనాధ మహిళలకు, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
నివాసం, కులం, ఆదాయం, ఆధార్, విద్యార్హత, టైలరింగ్ శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలు, తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని, కనీస అక్షరాస్యత తప్పనిసరి అని, ఎక్కువ దరఖాస్తులు వస్తే కనీస విద్యార్హత ఐదవ తరగతి పాసైన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణులకు 1.50 లక్షలు, పట్టణ వాసులకు రెండు లక్షల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు అర్హులు కాదని స్పష్టం చేశారు.
దరఖాస్తుదారులు దరఖాస్తులను సంబంధిత వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని కుల, ఆదాయ, నివాస, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, విద్యార్హతలు, టైలరింగ్ శిక్షణ, అనుభవం తదితర ధ్రువీకరణ పత్రాలతో గ్రామీణులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, పట్టణ ప్రాంతవాసులు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు ఈ నెల 15లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.



