Wednesday, April 22, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బస్సులు బంద్‌

బస్సులు బంద్‌

- Advertisement -

– ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు విఫలం
– సమ్మెలోకి 39 వేల మంది ఆర్టీసీ కార్మికులు
– హడావిడిగా ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
– జేఏసీని నాలుగు వారాల గడువు కోరిన కమిటీ
– తిరస్కరించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు
– మా డిమాండ్లన్నీ పాతవేనని స్పష్టీకరణ
– నిలిచిపోనున్న 10వేల ఆర్టీసీ సర్వీసులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో సమ్మె సైరన్‌ మోగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 53 రోజుల చారిత్రాత్మక సమ్మె తర్వాత సంస్థలోని కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా మరోసారి సమ్మెలోకి వెళ్లాయి. సమ్మెలోకి వెళ్తామని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు ముందుగానే కార్మిక శాఖ ద్వారా నోటీసు ఇచ్చి, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినా ప్రభుత్వం సమ్మె నివారణకు ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమ్మె అనివార్యమని నిర్థారణ కావడంతో హడావిడిగా మంగళవారం మధ్యాహ్నం నాలుగు శాఖల ఐఏఎస్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 66 విడుదల చేసింది. ఈ కమిటీలో ఐఏఎస్‌ అధికారులు వికాస్‌రాజ్‌, దానకిషోర్‌, సందీప్‌కుమార్‌ సుల్తానీయా, ఎండీ వై నాగిరెడ్డి ఉన్నారు. వీరు ఆర్టీసీ కార్మిక సంఘాలను సచివాలయంలో చర్చలకు రావాలని ఆహ్వానించారు. జేఏసీలోని కార్మిక సంఘాలతో పాటు సమ్మెకు మద్దతు తెలుపుతున్న టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, టీఎమ్‌యూ (అశ్వత్థామరెడ్డి), ఐఎన్‌టీయూసీ సంఘా లు కూడా చర్చలకు వెళ్లాయి. కమిటీ నూతనంగా ఏర్పడినందున సమస్యల్ని అధ్యయనం చేసేందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని ఐఏఎస్‌ల కమిటీ కోరింది. ఈ ప్రతిపాదనను జేఏసీతో పాటు కార్మిక సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ డిమాండ్లు కొత్తవేం కాదని తేల్చిచెప్పాయి. సమ్మెను నిర్వీర్యం చేసే కుట్రగా పేర్కొన్నాయి. మంగళవారం అర్థరాత్రి మొదటి డ్యూటీ నుంచే కార్మికులంతా సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నారనీ, తమ 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరడ తామని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మెన్‌ ఈదురు వెంక న్న, వైస్‌చైర్మెన్‌ ఎమ్‌ థామస్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఉద్దేశపూర్వక జాప్యం
బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్టీసీ కార్మికులు 53 రోజులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపింది. అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా, ఇప్పటికీ ఆర్టీసీ కార్మికుల ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై కార్మిక సంఘాల వివిధ రూపాల్లో అనేక ఆందోళనలు చేపట్టాయి. సంస్థలో ఇప్పటికీ ఆనాటి కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన యూనియన్ల రద్దు ఉత్తర్వులే అమల్లో ఉన్నాయంటూ యాజమాన్యం కార్మికశాఖ వద్ద జరిగే చర్చలకు కూడా హాజరుకాలేదు. అనివార్యంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెబాట పట్టాల్సి వచ్చింది.

ప్రయాణీకులకు ఇబ్బందులు
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలో పల్లెవెలుగు నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బస్సుల వరకు నిలిచి పోనున్నాయి. దాదాపు 10వేల బస్సుల డిపోలకే పరిమితం అవుతున్నాయి. ఆర్టీసీలోని అద్దె బస్సుల సిబ్బంది కూడా సమ్మెకు సంఘీభావంగా విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. సమ్మెతో రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రవాణా కష్టాలు తప్పవు.

97 డిపోల్లో..10 వేల బస్సులు
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోల్లో 10 వేల బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 3,500 అద్దె బస్సులు ఉన్నాయి. సంస్థలో 39 వేల మంది కార్మికు లు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బస్సులు రోజుకు 36 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నాయి.

సమస్యల పరిష్కారానికి సానుకూలం: మంత్రి పొన్నం
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం జరిగిందని అంగీకరించారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించేందుకు నలుగురు ఐఎఎస్‌ అధికారులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ ప్రతినిధులంతా ఆ కమిటీకి సమస్యలు విన్నవిస్తే, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తాను అధికారుల దగ్గర చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు.

కమిటీ ఏర్పాటు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీలో రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా, టీజీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మెన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు.

స్పష్టమైన హామీ ఇవ్వలేదు : ఎస్‌డబ్ల్యూఎఫ్‌
ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ల కమిటీ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వలేక పోయిందని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్లూఎఫ్‌) ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు తెలిపారు. సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని స్పష్టంచేశారు.

విధులకు హాజరుకావాలి: టీజీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వై నాగిరెడ్డి
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని టీజీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై. నాగిరెడ్డి తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్‌ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఈ కమిటీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపిందన్నారు. కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, సంక్లిష్టమైన అంశాలు ఉన్నందున, వాటిని లోతుగా పరిశీలించి పరిష్కరించడానికి ప్రభుత్వానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం గడువు కోరిందని వివరించారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొన్ని కార్మిక సంఘాలు వాస్తవాలను విస్మరించి సమ్మెకు పిలుపునిస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తు న్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, సంస్థ ప్రయోజ నాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరో సకల జనుల సమ్మే.. : ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి మంగళవారం అర్థరాత్రి నుంచి సమ్మె చేపడుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మెన్‌ ఈదురు వెంకన్న, కో చైర్మెన్‌ థామస్‌రెడ్డి తెలిపారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని చెప్పారు. సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు అవుతున్నా, ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఎలాంటి సమ్మె నివారణ చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని అంశాన్నే తాము కోరుతున్నామని స్పష్టంచేశారు. ప్రయివేటు ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ఆర్టీసీలోకి తెస్తూ, హైదరాబాద్‌ డిపోల్లోని ఉద్యోగులను జిల్లాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలోని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేసిన కమిటీతో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. కాలయాపన కోసమే ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వం నాటకాలాడుతున్నదని విమర్శించారు. మహాలక్ష్మీ పథకం నిధుల విడుదలపై ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -