Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు అల్పాహారమందేదెప్పుడో.?

విద్యార్థులకు అల్పాహారమందేదెప్పుడో.?

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అనేక మంది విద్యార్థులు ఉదయం ఇంట్లో సకాలంలో ఆహారం దొరకక, ఖాళీ కడుపుతోనే పాఠశాలకు చేరుతున్నారు. మధ్యాహ్నం వరకు ఆకలితో ఉండడంతో పాఠాలపై దృష్టి సారించలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఈ సమస్యను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన ఒక రకం అల్పాహారం అందిస్తామని తెలిపారు. ముందుగా హైదరాబాద్ చుట్టుపక్కల పాఠశాలల్లో ప్రారంభించి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. మండలంలో మొత్తం 34 పాఠశాలలున్నాయి. ఇందులో రెండు ప్రాథమికోన్నత, 5 హైస్కూల్స్, ఒక మోడల్ స్కూల్, ఒక కేజీబీవీ, 25 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఇందులో మొత్తం 1468 మంది విద్యార్థులు చదువుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ పథకం అమలైతే ఈ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరుతుంది.

హరేకృష్ణ సంస్థకు బాధ్యత..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం హరేకృష్ణ సంస్థకు అప్పగించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జూన్ 15న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో చదువుతున్న విద్యార్థులు, దీని ప్రభావం చదువుపై పడుతోందని వాపోతున్నారు. విద్యార్ధులకు అల్పాహారం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ కోసం ఇటీవల హరేకృష్ణ సంస్థ వారు మంథని వచ్చారు. మార్కెట్ యార్డులోని గోదాం పరిశీలించారు. పనులు ఈ నెలలోనే ప్రారంభిస్తామని తెలిపారు. పనులు పూర్తి కాగానే అల్పాహారం అందించేలా చూస్తామన్నారు.

త్వరగా ప్రారంభించాలి
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉదయం ఇంటి నుంచి వచ్చే సమయంలో టిఫిన్ అందడం లేదు. ఏమీ తిన కుండానే వెళ్తున్నారు. ప్రభుత్వం అల్పాహారం ప్రారంభించి విద్యార్థులు చదువుపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -