– రూ.2.50 కోట్ల ఆయిల్ స్వాధీనం
– వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా భారీస్థాయిలో హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె) సరఫరా చేస్తున్న ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2.50 కోట్ల హాష్ ఆయిల్తోపాటు రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండలోని పోలీసు కమిషనరేట్‌లో మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు.
అరెస్టు అయిన వారిలో ఒడిషా మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లికి చెందిన హంటల్ సన్ను, హంటల్ సన్యాసి, రేకపల్లికి చెందిన కృష్ణా హంటల్, ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా గూడెం మండలం దారకొండ గ్రామానికి చెందిన కండెల చిన్నబాబు ఉన్నారు. మరో నిందితుడు కిలో పాండి పరారీలో వున్నాడు. నిందితులందరూ పరిచయస్తులు కాగా, ప్రధాన నిందితుడు హంటల్ సన్ను స్వగ్రామంలో గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని మిగతా నిందితుల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకొని జల్సాలు చేసేవాడు. ఆ తర్వాత పరారీలో ఉన్న కిలో పాండు సూచనల మేరకు ముఠా సభ్యులంతా గంజాయి మొక్కలు పెంచి.. 40 కిలోల హాష్ ఆయిల్‌ను సేకరించారు. 20 కిలోల ఆయిల్‌ను కిలో చొప్పున ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. ముంబయిలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్ తుని రైల్వే స్టేషన్ నుంచి ఈనెల 19వ తేదీ అర్ధరాత్రి కోణార్క్ రైలులో బయలుదేరారు. వరంగల్ రైల్వే స్టేషన్లో సోమవారం దిగిన నిందితులు మంగళవారం ఉదయం ముంబయి వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద వున్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. వారిని అరెస్టు చేసి.. 20 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీమ్ ఇన్స్పెక్టర్ వై.సతీష్, ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షూకూర్, ఎస్ఐలు సందీప్, తేజ, ఆర్ఎస్ఐలు ఎ.పూర్ణచందర్ రెడ్డి, కె.మనోజ్‌రెడ్డి, ఎల్.లింగారావు, క్యాట్ పార్టీ ఎఆర్ఎస్ఐలు వి.సుబ్బరామిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాలరాజు, కె.శ్రీరాములు, ఎండి రబ్బాని, ఆర్.రాజ్‌కుమార్‌తోపాటు ఇంతేజార్గంజ్ ఇబ్బందిని కమిషనర్ అభినందించారు.
హాష్ ఆయిల్ స్మగ్లింగ్ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



