– ఖమ్మం జిల్లాలో మూడు చోట్ల రాస్తారోకోలు
– మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్
– రోడ్డుపై మక్కలు పోసి నిరసన
– కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారుల హామీ
నవతెలంగాణ-చింతకాని/బోనకల్/ వైరాటౌన్
పంట చేతికొచ్చి 20 రోజులు దాటుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం.. రోజుల తరబడి రాసులు పోసి ఉంచడంతో తీవ్రమైన ఎండలకు పంట మరింత తూకం తగ్గుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి పంట కాంటాలు వేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో మంగళవారం రైతులు మూడు చోట్ల రాస్తారోకోలు చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పెద్ద బీరవల్లి సొసైటీ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై మొక్కజొన్నలను రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. దీంతో రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బోనకల్ ఎస్‌ఐ పొదిలి వెంకన్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద బీరవల్లి సర్పంచ్ చింతలచెరువు కోటేశ్వరరావు, సీతానగరం రైతులు చిలక నాగరాజు, చిలక దాసు తదితరులతో చర్చలు జరిపారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు యత్నించగా ప్రతిఘటించారు. గంట తర్వాత మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినరుకుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద బీరవల్లి సొసైటీకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపించామని, త్వరలో మంజూరు అవుతుందని తెలిపారు. అయితే, జిల్లా కలెక్టర్‌గానీ మార్క్‌ఫెడ్ డిఎంగాని కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్టు ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకూర్చున్నారు. చివరకు మార్క్‌ఫెడ్ డిఎం శ్యాంకుమార్ స్పందించి పెద్ద బీరవల్లి సొసైటీకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. అదేవిధంగా రైతులు పండించిన మొక్కజొన్న పంటను ఎలాంటి షరతులూ పెట్టకుండా కొనుగోలు చేయాలని, కాంటాలు వేసిన పంటను వెంటనే తరలించాలని, బస్తాల కొరత లేకుండా అందించాలని కోరుతూ ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని నాగులవంచ దగ్గర ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారిపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
వైరా మార్కెట్ ముందు రైతుల బైటాయింపు
వైరా మార్కెట్‌కు రైతులు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 15 రోజులు అయినా కొనుగోలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహించిన రైతులు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాదిగా వైరా మార్కెట్ ముందు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. వారికి సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైరా మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కాంటాలు వేయాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, పట్టణ కార్యదర్శి కొంగర సుధాకర్ డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ రామారావు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సమాధానపరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సంబంధిత అధికారులు రావాలని రైతులు పట్టుబట్టారు. తహసీల్దార్ సురేష్ రైతుల వద్దకొచ్చి రెండ్రోజుల్లో వైరా మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పంట కొనుగోళ్ల ఆలస్యంపై రైతుల ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



