Sunday, September 13, 2026
E-PAPER
Homeసోపతిటి.ఆర్.రాజకుమారి - ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి వెండితెరను వెలిగించిన కళావంతులు

టి.ఆర్.రాజకుమారి – ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి వెండితెరను వెలిగించిన కళావంతులు

- Advertisement -

బాలీవుడ్‌లో హేమామాలిని ‘డ్రీమ్ గర్ల్’గా పేరు పొందడానికి చాలా కాలం ముందే తమిళ సినిమా అభిమానులకు డ్రీమ్ గర్ల్‌గా పేరు పొందిన ఒక మహానటి గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చు. ఆమే టి.ఆర్. రాజకుమారి. 1940, 50లలోనే తమిళ సినీ అభిమానుల కలలరాణిగా, నటనలో హీరోలను మించి ఒక వెలుగు వెలిగిన అద్భుత సౌందర్యరాశి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి ‘డ్రీమ్ గర్ల్’గా గుర్తింపు పొందింది. సంప్రదాయ దేవదాసి, కళావంతుల కుటుంబానికి చెందిన టి.ఆర్.రాజకుమారి దక్షిణ భారత సినీ చరిత్రలో తనదంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని రాసుకున్నది. అయితే ఎంతో వైభవంగా జీవించిన ఆమె తన చివరి రోజులను అత్యంత విషాదంగా ముగించడమే విషాదం.


1922 మే 5న మద్రాస్ ప్రెసిడెన్సీలోని తంజావూరులో, తంజావూరు రంగనాయకి రాజాయిగా జన్మించిన రాజకుమారి జీవితం ఒక అందమైన రాకుమారి కథ లాగే ఉంటుంది. సంగీత, నృత్యాల వారసత్వమున్న కుటుంబం ఆమెది. ఆమె తాత, తల్లి ఇద్దరూ కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు. ఆమె తన అమ్మమ్మ కుచలాంబళ్ వద్దనే కర్ణాటక సంగీతం నేర్చుకుంది. కేవలం నటిగానే కాకుండా అద్భుతమైన కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయనిగా, శిక్షణ పొందిన నర్తకిగా కూడా రాణించింది. గాత్ర సంగీతంలో ప్రావీణ్యం గడించిన రాజకుమారి అలనాటి హీరోయిన్ సి.పి.ఎల్.ధనలక్ష్మి ద్వారా తమిళ సినిమాకి పరిచయమైంది.
అయితే రాజకుమారి తొలుత ఆనాటి హిందీ చలనచిత్ర మహానటుడు కే.ఎల్. సైగల్ హీరోగా నటించిన దేవదాసు (1936)లో చంద్రముఖిగా నటించింది. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు.
దక్షిణ భారత టాప్ హీరోయిన్‌గా
1939లో వచ్చిన తమిళ చిత్రం ‘కుమార కులోత్తుంగన్’తో ఆమె ప్రధాన నటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. 1941లో వచ్చిన కచ దేవయాని అఖండ విజయం ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. ఆ తర్వాత కాలమేఘం, మందారవతి, కె.ఆర్.చలంతో కలిసి నటించిన సూర్యపుత్రి చిత్రాలు 1941లో విడుదలైనవి. అప్పటి తమిళ టాప్ హీరో పి.యు.చిన్నప్పతో కలిసి నటించిన ‘మనోన్మణి’ ఘనవిజయంతో ఆమె టాప్ హీరోయినైంది. వీరిద్దరు జంటగా జూపిటర్ పిక్చర్స్ కుబేర, కుచేల తీసి హిట్ కొట్టారు.
కచదేవయాని తర్వాత అప్పటి దక్షిణభారత ప్రఖ్యాత గాయకనటుడు త్యాగరాజ భాగవతార్ సరసన ‘శివకవి’ చిత్రంలో కీలకమైన రాజనరక్తి పాత్రను పోషించడం ఆమె జీవితంలో గొప్ప మలుపు. ఆ తర్వాత త్యాగరాజ భాగవతార్ సరసన హరిదాసు (44), వాల్మీకి (46) చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. హరిదాస్ మద్రాసులోని ఒక థియేటర్‌లో వరుసగా 110 వారాలు ప్రదర్శితమై రికార్డులకెక్కింది. తర్వాత పి.యు.చిన్నప్ప సరసన ‘వికటయోగి’ (46), పంకజవల్లి (47) చిత్రాలలో నటించిన రాజకుమారి దక్షిణ భారత టాప్ హీరోయిన్‌గా ఎరిగింది..

చంద్రలేఖ సంచలనం
రాజకుమారి సినిమాలలో అత్యంత ప్రజాదరణ పొంది ఆమెనూ, ఆమె నట వైభావాన్ని హిమాలయ శృంగంపై నిలిపింది జెమినీ వారి చంద్రలేఖ (48). ఈ చిత్రం ఆమె కెరీర్‌లో అతిపెద్ద మలుపు. ఇందులో ఆమె ‘చంద్రలేఖ’గా నటించింది. ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లో దేశమంతటా చరిత్రను సృష్టించింది. ‘మై రీ మైన్ తో మధుబన్ మే…’ అనే పాట ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. హీరో విలన్లు ఎమ్మార్ రాధా, రంజన్‌ల కన్నా ఎక్కువ ప్రశంసలు పొందింది రాజకుమారినే. ఈ చిత్రంలో సర్కస్ దృశ్యాలు, డ్రమ్ డాన్స్ ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు సంగీతం అదనపు ఆకర్షణ. విజయవాడలో మారుతి టాకీస్ అధినేత పోతిన శ్రీనివాసరావు ఈ సినీ బృందాన్ని ఆహ్వానించి రజతోత్సవాలను ఘనంగా నిర్వహించాడు. ఒక తమిళ చిత్రం తెలుగునాట విజయోత్సవాలు జరుపుకోవడం ‘చంద్రలేఖ’తోనే మొదలు.

ఐదుగురు సూపర్ స్టార్లతో
చంద్రలేఖ తర్వాత కృష్ణభక్తి, పావలకోడి (49), ఇదయ గీతం (50), విజయకుమారి (ద్విపాత్రాభినయం1950), వనసుందరి, ఇన్ వీడు, అమరకవి (52), కూడు కిల్లి, మనోహర (54), గులేబకావళి (55)‌ తదితర చిత్రాలలో ఎం.జి.ఆర్., శివాజీగణేషన్‌ల సరసన నటించింది. తెలుగులో కూడా నా ఇల్లు, మంచిచెడు వంటి చిత్రాల్లో నటించింది.
మనోహర (54)లో ఆమె ప్రతినాయిక పాత్రలో తన అందమైన, భావయుక్తమైన కళ్లతోనే అద్భుతమైన భావాలు పలికించి హీరో శివాజీ నటన కంటే ఆమె నటనకే ప్రేక్షకులు ఎక్కువగా మంత్రముగ్ధులయ్యారు. తమిళంలో ఐదుగురు సూపర్ స్టార్లతో కలిసి నటించిన ఘనత టి.ఆర్. రాజకుమారిది. త్యాగరాజ భాగవతార్, పి.యు.చిన్నప్ప, టి.ఆర్.మహాలింగంల స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. మహాలింగం నటించిన శ్రీవల్లి, నమ్ ఇరువర్, జ్ఞానసుందరి చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు సూపర్ స్టార్ హోదాను కల్పించాయి. ఆ తర్వాత రాజకుమారి కె.ఆర్.రామస్వామితో విజయకుమారి (50)లోనూ, చిన్నప్పతో వనసుందరి (51) చిత్రంలోనూ నటించింది. త్యాగరాజ భాగవతార్ జైలు నుండి విడుదలైన తర్వాత అమర కవి (52) చిత్రంలో ఆయన సరసన నటించింది. జైలు జీవితం తర్వాత భాగవతార్ నటించిన ఐదు చిత్రాలలో ఈ చిత్రం మాత్రమే ఓ మాదిరిగా ఆడింది.

నిర్మాణ సంస్థను స్థాపించి
రాజకుమారి తన తమ్ముడు టి.ఆర్.రమణతో కలిసి ‘ఆర్.ఆర్. పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. మొదటగా రమణ దర్శకత్వంలో వాళప్పిరందవళ్ నిర్మించి, ఆమెనే నాయికగా నటించింది. 1954లో ఆమె ఎం.జి.ఆర్., శివాజీ గణేశన్‌లను ప్రధాన పాత్రలలో కూండుక్కిలి నిర్మించింది. ఇద్దరు దిగ్గజ నటులు నటించినప్పటికీ ఆ చిత్రం ఘోర పరాజయం పొదింది. ఆ వెంటనే ఎం.జి.ఆర్. హీరోగా గులేబకావళి కథను ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించింది. ఆయన సరసన ముగ్గురు నాయికలలో రాజకుమారి ఒకరు. ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత శివాజీ గణేశన్‌తో కలిసి ‘తంగపదుమై’ చిత్రంలో నటించింది. ఆమె ఆఖరు చిత్రాలు పాశం వానమ్బాడి, పెరియా ఇదత్తు పెన్. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు నిర్మించి, దర్శకత్వం చేసిన టి.ఆర్.రామన్న ఆమె సోదరుడే. తన పేర సొంతంగా థియేటర్‌ను నిర్మించుకున్న ఏకైక తమిళ నటి కూడా ఈమెనే.

తెరవెనుక నుండే…
ఆ కాలపు ప్రముఖ తమిళ రచయిత కల్కి ఆమె కళ్లలోని భావాలకు ఆకర్షితులై ‘కొల్లుమ్ విజియాల్’ (తన కళ్లతోనే మంత్రముగ్థులను చేసే స్ర్తీ) అనే బిరుదునిచ్చారు. తన కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణులలో ఆమె ఒకరు. ఆమె వద్ద అనేక విలాసవంతమైన కార్లు ఉండేవి. తన జీవితాన్ని కళకు, తన సోదరుడు నిర్మాత టి.ఆర్.చక్రపాణి కుటుంబానికి అంకితం చేసింది. కాలక్రమేణా ఆమె తన ‘రాజకుమారి’ థియేటర్‌ను అమ్మి వేసింది. జీవితాంతం అవివాహితగా ఉన్న రాజకుమారి 1999 సెప్టెంబర్ 20న 77 ఏట కన్నుమూసింది. తన చివరి రోజులను టి.నగర్‌లోని తన నివాసంలో ప్రశాంతంగా గడిపిన ఆమె బహిరంగ కార్యక్రమాలకు, పత్రికల వారికి దూరంగా ఉండేది. కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే తెరవెనుక నుండి మాట్లాడేది. దీనికి కారణం ఆమె ఒక సుదీర్ఘమైన అంటువ్యాధికి గురైంది. అది ఆమెను అందవిహీనంగా కూడా మార్చింది. దేశవ్యాప్తంగా అందాల కలల రాణిగా ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న ఒక నటికి ఇంతకన్నా మరొక దుస్థితి ఉండదేమో.

ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి
ధనలక్ష్మి తంజావూర్‌లోని ఇసై వేలలార్ సామాజిక వర్గానికి చెందిన కళావంతుల కుటుంబంలో తంజావూరు కుచలాంబ ఐదవ కుమార్తెగా జన్మించింది. కర్ణాటక సంగీతంలో తల్లి వద్దనే శిక్షణ పొందింది ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి, టి.ఆర్.రాజకుమారికి స్వయానా పిన్ని. ఉమయ్యల్పురం కళ్యాణరామ అయ్యర్ వద్ద గాత్ర సంగీతం నేర్చుకుంది. వీణ వాదన కూడా నేర్చుకుంది. 1935లో నేషనల్ మూవీ థియేటర్ వ్యవస్థాపకుడు మణికం చెట్టియార్ తమ మొదటి సినిమా పార్వతీ కళ్యాణం నాయిక ఎంపిక కోసం తంజావూరుకు వచ్చినప్పుడు పార్వతి పాత్ర పోషించడానికి ధనలక్ష్మి ఎంపికైంది. ఈ చిత్రం 1936లో విడుదలైంది. అదే ఏడాది ఆమె పి. కె.రాజా సంధు దర్శకత్వంలో ‘వసంతసేన’లో నటించింది. ఆ తర్వాత సౌభాగ్యవతి చిత్రంలో కథానాయికగా నటించింది. తర్వాత ఇంగ్లీష్ డైరెక్టర్ డంకన్ దర్శకత్వంలో ప్రఖ్యాత నాదస్వర విద్వాసుడు తిరువడుత్తురై రాజరత్నం పిళ్ళై హీరోగా నటించిన కాలమేఘం చిత్రంలో మోహనంగి పాత్రలో అనితర సాధ్యంగా నటించింది. దేశభక్తి చిత్రంలో కళావతి పాత్రను పోషించింది. అయితే ఈ రెండు చిత్రాలు విజయం సాధించలేదు. ప్రభావతి (44) చిత్రంలో కథానాయికగా నటించిన ఆమె ఈ చిత్రంలో ‘జగధంబిగయే’ పాటను పాడింది. ఆ సమయంలో ఈ పాట ప్రజాదరణ పొందింది. ఆమె చెల్లెలు దమయంతి కూడా కొన్ని చిత్రాలలో నటించింది. దమయంతితో కలిసి వేదికలపై శాస్త్రీయ సంగీత కచేరీలలో పాడింది. అయితే ఆమె చెట్టినాడుకు చెందిన కార్ల వ్యాపారి ఎన్.ఎస్.ఎన్. లక్ష్మణ్ చెట్టి ఆర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన నాటక సంస్థల నిర్వహణ చేసేవాడు. సినిమా నిర్మాణం చేయడానికి కృష్ణా పిక్చర్స్ అన్న సంస్థను నెలకొల్పి ధనలక్ష్మి నిర్మాతగా కొన్ని సినిమాలు తీశాడు. ఆ తర్వాత కాలంలో వారు తీసిన సినిమాలు కొన్ని ఫెయిల్ అయినవి. మరికొన్ని పూర్తి కాలేదు. దీంతో వారికి ఆర్థిక సమస్యలు ఎదురై కష్టాల్లో మునిగిపోయారు. అయితే 1960 నాటికి ఆమె చెల్లెలు కూతుర్లు జ్యోతిలక్ష్మి, జయమాలిని చదువులు ఆపేసి సినిమాల్లోకి రాగా వారు పరిశ్రమలలో నిలదొక్కు కోవడానికి ధనలక్ష్మి ఆలంబనగా నిలబడింది. అలా దక్షిణ భారత దేశ చలనచిత్ర రంగంలో ఒక దేవదాసి కుటుంబం మూడు తరాలు కొనసాగడం ఒక చరిత్ర. చివరి రోజుల్లో పేదరికం అనుభవిస్తూ 95వ ఏట ఎస్.పి.ఎల్ ధనలక్ష్మి కన్ను మూసింది. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశ సినీ చరిత్రలో వారిది ఒక అధ్యాయం. దేవదాసి, కళావంతుల పరంపరలో సినిమాల్లోకి వెళ్లిన తెలుగు వారిలో మూకీల నాయక రాంప్యారీ, కాంచనమాల, టి.లలితాదేవి‌ తదితరులు ఉన్నారు.



హెచ్‌.రమేష్‌‌బాబు,
93916 34727

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -