యువత నిరసనల హింసపై కమిటీకి ఆ అధికారం లేదు : సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ : యువత, విద్యార్థుల నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస ఆరోపణలపై విచారణ జరుపుతున్న హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ (హెచ్‌పీఈసీ) ఎఫఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేర దర్యాప్తు చేపట్టాలనీ, ఎఫఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించే అధికారం న్యాయస్థానాలకే ఉంటుందని తేల్చిచెప్పింది. అయితే కమిటీ విచారణలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనా సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ ముందు జరుగనున్న విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అంగీకరించింది. కమిటీ పనితీరులో ఏవైనా ఇబ్బందులు, సందేహాలు తలెత్తితే వాటిని తాము పరిష్కరిస్తామని ధర్మాసనం తెలిపింది. హైపవర్డ్ కమిటీ నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ముందు జరిగే వ్యవహారాల్లో తనకు సహకరించేందుకు కమిటీ స్వయంగా అమికస్ క్యూరీని లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చని కూడా అనుమతించింది. కమిటీ కార్యకలాపాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు, ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. కమిటీని నేరుగా సంప్రదించలేని పరిస్థితుల్లో ఉన్న బలహీన, సున్నితమైన సాక్షుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడానికి కూడా అనుమతించింది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ హైపవర్డ్ కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 15న జరగనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు.
నేర దర్యాప్తునకు ఆదేశించే అధికారం కోర్టులకే
- Advertisement -
- Advertisement -



