Wednesday, April 22, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేట మున్సిపాలిటీకి కోట్లలో అప్పు లు

అశ్వారావుపేట మున్సిపాలిటీకి కోట్లలో అప్పు లు

- Advertisement -

– అభివృద్ధికి అప్పుల ముప్పు
– జీతాలు కూడా నిలిచిపోయిన దుస్థితి
నవతెలంగాణ – అశ్వారావుపేట 

సమాజం, సంస్థ, కుటుంబం ఏదైనా ఆదాయం ఉంటేనే అభివృద్ధి సాధ్యం. ఆదాయం లేకపోతే అప్పులు పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఇదే పరిస్థితి ప్రస్తుతం అశ్వారావుపేట మున్సిపాలిటీలో కనిపిస్తోంది. కొత్తగా మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన అశ్వారావుపేటలో ఆదాయ వనరులు బలపడక ముందే అప్పుల భారంతో వ్యవస్థ ఒత్తిడికి లోనవుతోంది. ముఖ్యంగా విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.4 కోట్ల 5 లక్షల వరకు చేరినట్లు సమాచారం. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని విద్యుత్ శాఖ నుంచి నోటీసులు అందినట్లు తెలిసింది.

ఇక సిబ్బంది పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. మున్సిపాలిటీలో పనిచేస్తున్న సుమారు 75 మంది ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించలేకపోవడం గమనార్హం. వీరికి ఇవ్వాల్సిన జీత బకాయిలు సుమారు రూ.50 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, మరోవైపు పనులు సాగించాల్సిన బాధ్యతల మధ్య చిక్కుకుపోయారు.

ఆదాయం లేకపోవడం, పన్నుల వసూళ్లు సరిగా జరగకపోవడం, కొత్తగా ఏర్పడిన వ్యవస్థలో పరిపాలనలో లోపాలు—ఇవి అన్నీ కలిసివచ్చి మున్సిపాలిటీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. అభివృద్ధి పనులు చేపట్టాల్సిన సమయంలోనే అప్పుల భారంతో ముందుకు ఎలా వెళ్లాలో తెలియక పాలకవర్గం తలలు పట్టుకుంటోంది.

ఆదాయం ఏది? అభివృద్ధి ఎలా?
ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపాలిటీకి అత్యవసరంగా చేయాల్సింది సొంత ఆదాయ వనరులను పెంపొందించడం. ఆస్తి పన్నులు, వ్యాపార అనుమతులు, నీటి పన్నులు వంటి వసూళ్లను కట్టుదిట్టం చేయకపోతే ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

అప్పులు – బకాయిలు – జీతాలు నిలిచిపోవడం…
ఈ మూడు సమస్యలు కలిసి అశ్వారావుపేట మున్సిపాలిటీ ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టాయి. తక్షణ చర్యలు తీసుకోకపోతే అభివృద్ధి మాటల్లోనే మిగిలిపోయే ప్రమాదం ఉందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -