Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయంఏచూరి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి

ఏచూరి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి

- Advertisement -

ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా విస్తృత లౌకిక ఐక్యత అవసరం
ఆ బాధ్యతను పార్టీ కార్యకర్తలందరూ తీసుకోవాలి : సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.ఎ. బేబీ
పిలుపు

​నవతెలంగాణ–న్యూఢిల్లీ బ్యూరో
ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సాగించిన సైద్ధాంతిక, రాజకీయ పోరాటాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త‌ను పార్టీ కార్యకర్తలందరూ తీసుకోవాల‌ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ పిలుపునిచ్చారు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడటమే ఏచూరికి మనమిచ్చే ఘ‌న‌మైన‌ నివాళి అని పేర్కొన్నారు. సీతారాం ఏచూరి ద్వితీయ‌ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని ఎకెజి భవన్‌లో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎ బేబీ మాట్లాడుతూ ఏచూరి మరణానంతరం దేశంలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. పశ్చిమబెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ నాయకత్వంలోని మతతత్వ శక్తులు అధికారంలోకి వచ్చాయని తెలిపారు. కేరళంలో పదేండ్లపాటు అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినా మిత‌వాద‌ శక్తులు ఏకమై పథకం ప్రకారం వామపక్షాలను ఓడించాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఇటీవల విద్యార్థులు, యువత కూడా ఉద్యమ బాట పట్టారని, జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థి, యువజన ఉద్యమం విజయవంతమైందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రజా ఉద్యమాలతో వెనక్కి తగ్గించగలమని విద్యార్థులు నిరూపించారని అన్నారు. ఈ ఉద్యమంలో వామపక్ష విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు.

విప్లవ కార్మికవర్గ పార్టీగా సీపీఐ(ఎం) సంస్థాగత బలాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఎం.ఎ. బేబీ అన్నారు. అదే సమయంలో వామపక్షాలను బలోపేతం చేయడంతో పాటు సంఘపరివార్‌ శక్తులను ఎదుర్కొనేందుకు విస్తృతమైన లౌకిక ఐక్యవేదికను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాలతో ముందుకు సాగుతామని ఏచూరి వర్థంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ఏచూరి చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు తపన్‌ సేన్‌, నీలోత్పల్‌ బసు, ఆర్‌. అరుణ్‌కుమార్‌, కేంద్ర కమిటీ సభ్యులు ఎ.ఆర్‌. సింధు, మురళీధరన్‌, విక్రమ్‌ సింగ్‌, కేంద్ర కమిటీ ఆహ్వానితులు హన్నన్‌ మొల్లా, కిసాన్‌సభ ఫైనాన్స్‌ కార్యదర్శి పి. కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కేరళంలోని తిరువనంతపురం ఎకెజి సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ స్టడీస్‌లో సీతారాం ఏచూరి ద్వితీయ వ‌ర్థంతి సందర్భంగా స్మారక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌ ప్రారంభించారు. సీనియర్‌ నాయకులు ఎస్‌. రామచంద్రన్‌ పిళ్లై సీతారాం ఏచూరి జీవితం, రాజకీయ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.

‘ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణాత్మక సంక్షోభం’ అనే అంశంపై ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ ఉపన్యసించారు. ‘భారత ప్రజాస్వామ్యం, లౌకికవాదం సంక్షోభంలో’ అనే అంశంపై సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు బృందా కరత్‌ ప్రసంగించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కెకె. శైలజ, జిల్లా కార్యదర్శి వి. జాయ్‌ ఆయా సమావేశాలకు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కామ్రేడ్‌ సీతారాం ఏచూరి జీవితం, వారసత్వంపై రూపొందించిన డిజిటల్‌ ఫ్లిప్‌బుక్‌ను కూడా విడుదల చేశారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు ఎస్‌. రామచంద్రన్‌ పిళ్లై పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ​ పశ్చిమబెంగాల్ లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో సీతారాం ఏచూరి రెండో వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బిమన్‌ బసు, శ్రీదీప్‌ భట్టాచార్య, రామ్‌చంద్ర డోమ్‌, సుఖేందు పనిగ్రాహి, సర్వాణి ప్రసాద్‌ సంతరా తదితరులు పాల్గొన్నారు.

​ డెహ్రాడూన్‌లో ఏచూరి వర్థంతి.. పాల్గొన్న సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు బృందాకరత్‌
​సీతారాం ఏచూరి ద్వితీయ వర్థంతి సందర్భంగా డెహ్రాడూన్‌లోని టౌన్‌హాల్‌లో శనివారం ‘భారత్‌ @ 80.. జనవాదం ఎక్కడ?’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు బృందా కరత్‌ పాల్గొని మాట్లాడారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రాజేంద్ర నేగి ఈ సభకు అధ్యక్షత వహించగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర పురోహిత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. టౌన్‌హాల్‌ లో నిర్వహించిన ఈ కార్యక్రమం సభికులతో కిక్కిరిసిపోయింది. హాల్‌ సరిపోక గ్యాలరీలోనూ ప్రజలు గంటల తరబడి నిల్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ సీనియర్‌ నాయకులు సమర్‌ భండారీ, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ ఎస్‌.ఎన్‌. సచన్‌, మాజీ విద్యాశాఖ డైరెక్టర్‌ ఎస్‌.పి. సెమ్వాల్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సురేంద్ర అగర్వాల్‌ హాజరై ఏచూరికి నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -