పడిపోయిన తలసరి ఆదాయం : ఐఎంఎఫ్ వెల్లడి
ప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నా మంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదిక తేల్చింది.
వాషింగ్టన్/న్యూఢిల్లీ : ప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నామంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదిక తేల్చిపడేసింది. భారత స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతున్నప్పటికీ.. ప్రతి భారతీయుడి సగటు తలసరి ఆదాయంలో మాత్రం పొరుగున ఉన్న చిన్న దేశమైన బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉందని వెల్లడించింది. ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్-2026’ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 2,911 డాలర్ల (రూ.2.73 లక్షలు)కు చేరుతుందని అంచనా వేసింది. ఇదే సమయంలో భారతీయుల తలసరి ఆదాయం 2,812 డాలర్లు (రూ.2.64 లక్షలు)గా ఉండొచ్చని పేర్కొంది. అంటే సగటు బంగ్లాదేశ్ పౌరుడి ఆర్థిక స్థితిగతులు, భారత పౌరుడి కంటే మెరుగ్గా ఉన్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. గతంలో 2023, 2024లలో కూడా భారత్ కంటే బంగ్లాదేశ్ ముందంజలో ఉంది. తిరిగి 2025లో భారత్ స్వల్పంగా పుంజుకున్నట్టు కనిపించినా.. 2026 నాటికి మళ్ళీ వెనుకబడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతోంది. 2025లో భారత తలసరి ఆదాయం 2,675 డాలర్లుగా ఉండగా. బంగ్లాదేశ్‌లో 2,635 డాలర్లుగా నమోదయ్యింది.
ఒక దేశ మొత్తం ఆర్థిక ఉత్పత్తిని ఆ దేశ జనాభాతో భాగించడం ద్వారా లెక్కించే ఈ తలసరి జీడీపీ సగటున ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిస్తుంది. ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు తలసరి జీడీపీ సుమారు 7,500 డాలర్లుగా ఉండగా, ప్రపంచ సగటు 15,600 డాలర్లుగా ఉంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ ఆర్థిక వద్ధికి ప్రతిబంధకంగా మారిందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2026లో 3.1 శాతం, 2027లో 3.2 శాతంగా ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది.
సామాన్యుడికి అందని ఫలాలు..
ప్రభుత్వ వర్గాలు భారత్‌ను విశ్వగురువుగా, ఆర్థిక శక్తిగా అభివర్ణిస్తున్నప్పటికీ ఆ వృద్ధి తాలూకు ఫలాలు సామాన్యుడికి అందడం లేదనే విమర్శలకు ఈ నివేదిక బలాన్నిస్తోంది. మొత్తం జీడీపీ పరంగా భారత్ 4.1 లక్షల కోట్ల డాలర్లను (4100 బిలియన్లు) కలిగి ఉండగా.. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ 510 బిలియన్ డాలర్లుగా ఉంది. బంగ్లాదేశ్ కంటే భారత్ చాలా పెద్ద దేశమే అయినప్పటికీ జనాభా ప్రాతిపదికన చూస్తే భారతీయుల తలసరి ఆదాయం కునారిల్లుతోంది. ఇది దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను, సామాన్య ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయాలు క్రమంగా తగ్గుతున్న తీరుకు అద్దం పడుతోంది.
అవరోధాలు..
ఒకవైపు పశ్చిమాసియా యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతుంటే.. దేశీయంగా తలసరి ఆదాయం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2027 నాటికి భారత్ మళ్ళీ బంగ్లాదేశ్‌ను దాటుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసినప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న ఈ తలసరి వెనుకబాటుతనం మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, ప్రచారాలపై విస్మయాన్ని కలిగిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్భాటపు అంకెలు కాకుండా, సామాన్యుడి జేబు నిండేలా ఆదాయ వనరులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.
బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకంజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



