మానవ నాగరికతతో పాటు ఆవిర్భవించి, మనిషి అంతరంగాన్ని, అనుభూతిని, సామాజిక స్పృహను అత్యంత ప్రభావవంతంగా వ్యక్తీకరిస్తూ వచ్చిన సాహిత్య ప్రక్రియ కవిత్వం. ఆదిమ మానవుడి ఉద్వేగాల నుంచి ఆధునిక మానవుడి అస్తిత్వ సంక్షోభం వరకు కవిత్వం మనిషి జీవన పరిణామాలకు అద్దంగా నిలిచింది. కాలంతో పాటు దాని రూపం, వస్తువు, అభివ్యక్తి మారాయి. అయితే రూపాలు ఎన్ని మారినా వర్తమాన కవిత్వం ముందున్న మౌలిక ప్రశ్న ఒక్కటే.. అది మనిషికి ఏ వర్తమానాన్ని చేరుస్తోంది? తెలుగు కవిత సుదీర్ఘ ప్రయాణంలో ఒక దశలో ఛందస్సు, యతి, ప్రాస, వృత్త, జాతి, ఉపజాతి వంటి నిర్మాణ నియమాలు ప్రధానంగా నిలిచాయి. ఈ శాస్త్రీయ కట్టుబాట్లు తెలుగు కవిత్వానికి అపూర్వమైన లయ, శబ్దసౌందర్యం, నిర్మాణ క్రమం, భాషా వైభవాన్ని అందించాయి కానీ అదే సమయంలో కవితా వ్యక్తీకరణకు ఒక ప్రత్యేకమైన పాండిత్య అర్హతను కూడా ఏర్పరిచాయి. ఛందోనియమాలపై పట్టు, భాషా వ్యుత్పత్తి, అలంకార పరిజ్ఞానం వంటి అంశాలు ప్రధాన ప్రమాణాలుగా మారడంతో, సహజమైన అనుభూతి, కొత్త ఆలోచన ఉన్నప్పటికీ వాటిని ఆ కట్టుబాట్లలోకి మలచలేని అనేకమంది సృజనకారులకు అవకాశాలు పరిమితమయ్యాయి. కాలానుగుణంగా ఈ కట్టుబాట్లపై ప్రశ్నలు మొదలయ్యాయి.
కవిత్వం అనేది ముందుగా భావవ్యక్తీకరణ, ఛందస్సు దానికి ఒక సాధనం మాత్రమే తప్ప అంతిమ ప్రమాణం కాదనే ఆధునిక దృక్పథం బలపడింది. ఈ పరిణామమే వచన కవితకు విస్తృతమైన ప్రస్థానాన్ని కల్పించింది. ఛందోబద్ధత నుంచి విముక్తి పొందిన వచన కవిత కవి అంతరంగానికి, సమకాలీన జీవితానికి, స్వేచ్ఛాయుత ఆలోచనకు విస్తృతమైన స్థలాన్ని కల్పించింది. దీంతో వస్తు పరిధి కూడా విస్తరించింది. ప్రకృతి, ప్రణయం, వీరత్వం వంటి సంప్రదాయ వస్తువులతో పాటు సామాన్యుడి జీవితం, శ్రమ, ఆకలి, పేదరికం, అణచివేత, వ్యక్తిగత సంఘర్షణ, అస్తిత్వ వేదన, సామాజిక అసమానత వంటి అనేక జీవన పార్శ్వాలు కవితా వస్తువులయ్యాయి. ఈ క్రమంలో భావ కవిత్వం, అనుభూతి కవిత్వం, జాతీయ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం వంటి ధోరణులు రూపుదిద్దుకున్నాయి. అనంతరం స్త్రీవాద, దళిత, ప్రాంతీయ అస్తిత్వ కవిత్వాలు అణచివేయబడిన అనుభవాలకు స్వరాన్నిచ్చాయి. ఇది తెలుగు కవిత్వానికే పరిమితమైన పరిణామం కాదు. హిందీలో ఛాయావాదం, ప్రగతిశీల సాహిత్యం, నయీ కవిత వంటి ఉద్యమాలు అంతరంగాన్నీ, సామాజిక వాస్తవికతనూ ప్రతిబింబించాయి. భారతీయ భాషలన్నింటిలోనూ ఆధునికత, సామాజిక చైతన్యం, అణగారిన వర్గాల అనుభవం కవిత్వానికి కొత్త సౌందర్య దృష్టిని ప్రసాదించాయి. ఇవన్నీ తెలుగు కవితనూ ప్రభావితం చేశాయి. ఇంకా ప్రపంచ సాహిత్యంలో సర్రియలిజం (Surrealism), ప్రతీకవాదం (Symbolism), ఇమేజిజం (Imagism), అబ్సర్డిజం (Absurdism) వంటి వ్యక్తీకరణ పరిధిని విస్తరించిన ధోరణులు కూడా తెలుగు కవితను స్పృశించాయి.
అంటే కవిత్వ పరిణామం అంతిమంగా రూపం నుంచి అనుభూతికి, వ్యక్తి నుంచి సమాజానికి, స్థానికత నుంచి విశ్వమానవీయతకు జరిగిన నిరంతర మహాప్రస్థానమయింది. అయితే ఈ స్వేచ్ఛ`విస్తృతితో పాటు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఛందస్సు నుంచి విముక్తి పొందడాన్ని కొందరు కవితా నిర్మాణం నుంచే విముక్తిగా భావించడం మొదలైంది. వచన కవిత అంటే గద్య వాక్యాలను కొన్ని చోట్ల విరిచి రాయడం మాత్రమే కాదనే ప్రాథమిక అవగాహన కొన్నిసార్లు మరుగునపడింది. ఛందస్సు లేకపోవచ్చు, కానీ కవిత్వానికి శిల్పం వద్దా? యతిప్రాసలు లేకపోవచ్చు కానీ అంతర్లయ ఉండాల్సిన అవసరం లేదా? అలంకారం తగ్గవచ్చు కానీ భావ సౌందర్యం తగ్గిపోవాలా? చమక్కులు, ప్రతీకలు ఉంటే శిల్పం వెలుగులీనదా? ఇక్కడే ఆధునిక కవిత్వం ముందు అసలు సవాలు నిలబడుతుంది. శిల్పం కంటే వస్తువు ముఖ్యమని కొందరు అనొచ్చేమో కానీ ఆ గొప్ప వస్తువు పాఠకుల్ని చేరాలంటే శిల్పం అనే వాహకం ఉండాలి కదా! ఈ నేపథ్యాన చూస్తే తెలుగులో కవిత్వం విపరీతంగా పెరిగింది. కానీ అందుకు తగినట్లుగా వైవిధ్యం, లోతు, నాణ్యత కూడా పెరిగాయా? అనే ప్రశ్న ఇంతంతై పెరుగుతూనే ఉంది. “తెలుగువారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు కవి” అని శ్రీశ్రీ గారు ఆనాడే చమత్కరించారంటే, కవిత్వం రాయాలనే ఉత్సాహం మన సమాజంలో ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతుంది. ఆ చమత్కారంలోనే కవుల సంఖ్య పెరగడం, కవిత్వపు ప్రమాణం పెరగడం రెండూ ఒకటే కావనే సత్యం కూడా దాగి ఉంది.
కేవలం వచనాన్ని విరిచి రాసేసి దానినే కవిత్వంగా భావించే ధోరణి కూడా కనిపిస్తోంది. అలాగే కేవలం ప్రాస, లయలను కూర్చి అదే కవిత్వమనీ అంటున్నారు. ఇలా రాసి అచ్చేసే కవితా సంపుటాల్లో అమ్ముడయ్యేవి అత్యల్పం, పంచబడేవే ఎక్కువ. ఇది కేవలం పుస్తక విక్రయాల సమస్య కాదు.. కవి-పాఠక సంబంధం బలహీనపడుతున్నదనడానికి కూడా ఒక సంకేతం. మరోవైపు ఏవో అర్థంకాని ప్రతీకలు, పరాశ్రయ భావాలు, కవికే తప్ప పాఠకుడికి అందని సంకేతాలతో కూడిన కవితలు వస్తున్నాయి. కవితలో నిగూఢత, బహుళార్థత, ధ్వని, ప్రతీక ఉండవచ్చు. కానీ అస్పష్టతనే ఆధునికతగా, అర్థరాహిత్యాన్నే గంభీరతగా, అర్థంకాని ప్రతీకలనే సృజనాత్మకతగా భావించడం మాత్రం కవిత్వానికి మేలు చేయదు. కవిత పాఠకుడి ఆలోచనకు తలుపులు తెరవాలి; పూర్తిగా మూసివేయకూడదు. కవిత్వంపై ఏర్పడిన ఈ దూరాన్ని ప్రజాసంస్కృతిలోని వ్యంగ్య స్పందనలు కూడా ప్రతిబింబించాయి. ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారు తన సినిమాల్లో కవిత్వంలోని కృత్రిమతను వ్యంగ్యానికి వస్తువుగా ఉపయోగించిన సందర్భాలు ఇందుకు ఉదాహరణ. గతంలో ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ చేసిన వ్యాఖ్య ప్రాసంగికంగా అనిపిస్తుంది: “ఈ కవిత్వం ఎవరికి అర్థమవుతుంది? ఏమి తలకెక్కుతుంది? ఎవరికి ప్రయోజనం?” ఈ ప్రశ్నను కవిత్వానికి వ్యతిరేకమైనదిగా కాకుండా, కవిత్వం పాఠకుడితో ఏర్పరచుకోవలసిన సంబంధాన్ని గుర్తుచేసేదిగా చూడాలి. “దినపత్రికల్లో రన్నింగ్ కామెంటరీగా వచ్చే క్లుప్త కవితలు కనీసం అర్థమై ప్రజలకు చేరతాయి..” అని కూడా ఆమె చేసిన వ్యాఖ్యానం గమనార్హం. అంటే కవిత్వం పాఠకుడికి అర్థం కావాలి.
ఆలోచింపజేయాలి; అనుభూతి చెందించాలి; ప్రశ్నించాలి; కదిలించాలి. ఏదో ఒక స్థాయిలో అతని అంతరంగంలో ప్రతిధ్వనించాలి. కనీసం ప్రాస, లయ, శబ్దసౌందర్యం వంటి లక్షణాలతో, పాడుకునేలా, వినగానే భావం పట్టేలా ఉంటే కవిత్వం ప్రజలకు చేరుతుంది. అందుకే వచన కవితల కంటే పాడుకునే శైలిలో ఉండే కవిత్వాన్ని కొందరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతంలో ఈ సౌలభ్యం పద్యానికీ ఉండేది. పాటకు లయ ఉంటుంది; శబ్దసౌందర్యం ఉంటుంది; గుర్తుండిపోయే నిర్మాణం ఉంటుంది. ముఖ్యంగా భావం వెంటనే పట్టే అవకాశం ఉంటుంది. భావస్పష్టత, సులభమైన పదప్రయోగం, సామాజిక స్పందన కలిసినప్పుడు కవిత్వం పండిత వర్గాన్ని దాటి సామాన్య పాఠకుడి హృదయంలోకి ఎలా ప్రవేశించగలదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే లయ, ప్రాస, శబ్దసౌందర్యం మాత్రమే కవిత్వానికి ప్రమాణాలు కావు.., అవి భావాన్ని పాఠకుడికి చేరువ చేసే శక్తియుత సాధనాలు. అయితే ప్రజలకు చేరువ కావడం అంటే కవిత్వాన్ని పలుచన చేయడం కాదు. లోతైన భావాన్ని సరళమైన భాషలో వ్యక్తీకరించడమే అసలైన కవితా సామర్థ్యం. ఇక్కడ సరళత (Simplicity), సరళీకరణ (Simplification) మధ్య తేడాను గుర్తించాలి. సరళమైన భాష అంటే సరళమైన ఆలోచన కాదు. సాధారణ పదాలతో అసాధారణమైన అనుభూతిని కలిగించడం గొప్ప కవితా నైపుణ్యం. కఠినమైన పదజాలంతో భావాన్ని భారంగా మార్చడం కవిత్వపు గంభీరతకు ప్రమాణం కాదు. కవి తన అనుభూతిని పాఠకుడి అనుభూతిగా మార్చగలిగినప్పుడే కవితకు జీవం వస్తుంది.
కవిత్వపు గుణాత్మకత (Quality) ప్రశ్న కూడా ఇక్కడే వస్తుంది. కవుల సంఖ్య పెరగడం సాహిత్యానికి మంచిదే. ఎక్కువమంది రాయడం సృజనాత్మక ప్రజాస్వామ్యానికి సంకేతమే. కానీ సృజన విస్తరించడం, సాహిత్య ప్రమాణం పెరగడం రెండూ ఒకటే కావు. పుస్తకంగా ముద్రితమైందంటే అది సాహిత్యంగా నిలిచిపోతుందని కాదు; ప్రచురితమైనంతనే అది కవిత్వంగా స్థిరపడినట్లు కాదు. రచనకు కాలపరీక్ష, పాఠక స్పందన, విమర్శా పరిశీలన అవసరం. పఠన సంస్కృతి క్షీణించడం ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది. ఒకప్పుడు పట్టణాలు, గ్రామాల్లో కనిపించిన పుస్తక దుకాణాలు, పాత పుస్తకాల అంగళ్లూ, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని పుస్తక-పత్రికల విక్రయ కేంద్రాలూ క్రమంగా కనుమరుగవుతున్నాయి. డిజిటల్ మాధ్యమాలు (Digital Media) కొత్త అవకాశాలను తెచ్చినప్పటికీ, ఏకాగ్రతతో కూడిన దీర్ఘ పఠన సంస్కృతి బలహీనపడటం సాహిత్యానికి సవాలుగా మారింది. పాఠకుడు తగ్గినప్పుడు కవి-పాఠక సంభాషణ కూడా బలహీనపడుతుంది.
కవికి భాషా పాండిత్యంతో పాటు జన జీవన సాంగత్యం అవసరం. నేలమీద నడవాలి, చుట్టూ ఉన్న మనుషుల్ని చూడాలి, మనిషి శ్రమ, కన్నీరు, ఆనందం, ఆకాంక్ష, ఆవేదనలను అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని చదివిన కవి తన సమాజాన్ని చూడకపోతే అతని కవిత్వం పరాశ్రయమవుతుంది; తన సమాజాన్నే చూసి ప్రపంచాన్ని చదవకపోతే అతని దృష్టి పరిమితమవుతుంది.
అదే సమయంలో ప్రపంచ కవితా ధోరణులను చదవాలి.. ఇతర భాషల సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. ఈ రెండింటి సమన్వయమే సమకాలీన కవిత్వానికి అవసరం. కవిత్వం సమాజానికి ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ అది సమాజాన్ని చూపించే దృశ్యం అవ్వాలి. ప్రశ్నించే శక్తి దానికి ఉండాలి. పాలకులల్లోని, వ్యవస్థల్లోని వైరుధ్యాలను ఎత్తిచూపాలి.. అణచివేతను ప్రతిఘటించాలి.. మానవీయ విలువలను నిలబెట్టాలి.. ఒక గొప్ప కవిత సమస్యకు పరిష్కారం చెప్పకపోయినా, అస్థిత్వ కవిత్వం లాగా కొత్త ప్రశ్నలనైనా మన ముందుంచగలగాలి. ఆ ప్రశ్న పాఠకుడి మనసులో నిలిచి, అతని ఆలోచనను కదిలిస్తే అదే కవిత్వపు సామాజిక విజయం. అందువల్ల నేటి కవిత్వం ముందున్న కర్తవ్యం కేవలం కొత్త రూపాలను అన్వేషించడం, సృష్టించడమే కాదు సామాజిక పరిస్థితులను ఎత్తి చూపడం. కొత్త భావాలను సృష్టించడం. కేవలం పదాలను కూర్చడం కాదు, పదాలకు ప్రాణం పోయడం. కేవలం అనుభూతిని వ్యక్తం చేయడం కాదు, పాఠకుడి అనుభూతిగా మార్చడం. కేవలం వర్తమానాన్ని చిత్రించడం కాదు; వర్తమానంలోని వైరుధ్యాలను గుర్తించడం, చేతనైతే భవిష్యత్తుకు దారిచూపడం. కొత్త సరికొత్త అలంకారిక పదాలు ఉంటే సరిపోదు. రాసే ప్రతి పదానికీ పరమార్థం ఉండాలి. ప్రతి ఆలోచనకూ తర్కబద్ధత (Rationality) ఉండాలి. ప్రతి కవితకూ మానవీయ కోణం ఉండాలి.
ప్రతి రచనలో ఒక జీవనానుభవం, కొత్త చూపు, ఆశయం ఉండాలి. కవిత్వం మేధను తాకాలి.. ఎదను కదిలించాలి.. స్థితిగతులను బట్టి చైతన్యాన్ని రగిలించాలి. అప్పుడే కవిత్వం కేవలం అక్షరాల కూర్పుగా మిగలదు. జీవితానికి వ్యాఖ్యానం, వర్తమానానికి అద్దం, భవిష్యత్తుకు దారిదీపం అవుతుంది. పాఠకుడి మది తలుపులు తట్టి, ఆలోచనలను మేల్కొలిపి, మార్పు వైపు అడుగులు వేయించే శక్తిగా మారుతుంది. అదే కవితకు సార్థకత. అదే కవి సమర్థత.
టి. కొండబాబు, 94907 92047



