రూ.90 కోట్ల భూమికి ఫెన్సింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. దీని విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారుల అంచనా. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఖస్రా పహాణీ(గ్రామ పాత రికార్డుల) ప్రకారం కూడా మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైంది. అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 9.05 ఎకరాలను సీఎస్ 14 (నిజాంకు చెందిన) భూములుగా పేర్కొంటూ కొంతమంది హక్కులు క్లైమ్ చేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం హైకోర్టులో పెండింగ్ ఉంది. తుది తీర్పు వచ్చే వరకూ భూమి స్వరూపాన్ని మార్చొద్దని, అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్‌ను పట్టించుకోకుండా తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి ఆ భూమిని చదును చేసి లే ఔట్‌గా మార్చినట్టు రంగారెడ్డి కలెక్టర్‌తోపాటు, శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదులందాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన రెవెన్యూ అధికారులు భూమిని చదును చేసి ప్రీకాస్ట్ గోడల ద్వారా ఆక్రమించినట్టు గుర్తించారు. భూ ఆక్రమణ చట్టం 1905 ప్రకారం ఆక్రమణలను తొలగించాలని మొయినుద్దీన్‌కు సూచించారు. అయినా పట్టించుకోకుండా అక్కడ కొన్ని ఇంటి స్థలాలను అమ్ముకున్నట్టు కూడా విచారణలో తేలింది. ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు హైడ్రాకు లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.
శంషాబాద్‌లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



