Thursday, April 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ సమ్మెకు బీఆర్‌ఎస్‌ మద్దతు

ఆర్టీసీ సమ్మెకు బీఆర్‌ఎస్‌ మద్దతు

- Advertisement -

– మాకు ప్రతిపక్ష హోదా రాదు… అధికారమే
– కాంగ్రెస్‌, బీజేపీలది ఫెవికాల్‌ బంధం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ నైతిక మద్దతు తెలుపుతున్నదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న ప్రతి డిమాండ్‌ న్యాయమై నదేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే, దాన్ని ఇప్పటిదాకా అమలు చేయకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని ఆరోపించారు. వారికి వెంటనే అపా యింట్‌మెంట్‌ డేట్‌ ప్రకటించాలని కోరారు. పీఆర్సీతోపాటు డీఏలు, ఇతర బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పెట్టిన ఈ అంశాలను పట్టించుకో కుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. క్యాబినెట్‌ సమావేశం పెట్టుకుని కేవలం డబ్బుల పంపిణీపైన కాకుండా, ఆర్టీసీ సమ్మె వంటి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. మ్యానిఫెస్టోలో ఉన్న అర్టిసీ కార్మికులకు ఇచ్చిన హమీల గురించి మంత్రి శ్రీధర్‌బాబును అడిగి తెలుసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హితవు పలికారు. మూడు బడ్జెట్లు అయిపోయిన తర్వాత కూడా మ్యానిఫెస్టోలో ఏం హామీలిచ్చారో మంత్రులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నట్టు తమకు ప్రతి పక్ష హోదా రాదనీ, ముమ్మాటికీ అధికార పక్షహోదానే వస్తుందని కేటీఅర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయనీ, వాటి మధ్య ఉన్నది ‘ఫెవికాల్‌ బంధం’అని విమర్శించారు. కాంగ్రెస్‌ పెద్దలకు మూటలు అందుతు న్నాయంటూ కేంద్రమంత్రి బండి సంజరు ఆరోపిస్తుంటే, ఆ మూటలను పట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిది కాదా?అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బండి సంజరు ఒక కేంద్ర మంత్రిని అనే విషయాన్ని గుర్తించాలనీ, కరీంనగర్‌ గల్లీల్లో కార్పొరేటర్‌లా మాట్లాడటం మానేసి ఆ పదవికి తగ్గట్టుగా వ్యవహరించాలని కోరారు. కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ నుంచి ఏఐసీసీకి వెళ్తున్న ప్రతి పైసాను పట్టుకోవాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న ‘ఆర్‌ఆర్‌ టాక్స్‌’ ఢిల్లీ పెద్దలకు చేరుతుంటే బీజేపీ నేతలు గాడిదలు కాస్తున్నారా?అని నిలదీశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ రేవంత్‌ రెడ్డికి సహాయం చేయడం తప్ప, తెలంగాణ రాష్ట్రానికి బండి సంజరు ఒక్క రూపాయి అయినా తెచ్చారా?అని ప్రశ్నించారు. ఆయన సొంత నియోజకవర్గమైన వేములవాడలోని గుడి ‘దివ్య భారత్‌’ స్కీమ్‌లో చేరలేదన్న విషయం కూడా బండి సంజరుకి తెలియకపోవడం విచారకరమన్నారు. అమృత్‌ పథకం నుంచి సింగరేణి వరకు ప్రతి విషయంలో స్కామ్‌ జరుగుతుంటే, కిషన్‌రెడ్డి మౌనంగా ఉంటూ కాంగ్రెస్‌ మంత్రులతో కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలి : హరీశ్‌రావు
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమ్మెకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీమంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. వారితో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలనీ, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా కాలేదనీ, రైతు భరోసా పడలేదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరెంట్‌ లేక రైతులు రోడ్లెక్కినా ఏ ఒక్క మంత్రీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందు ఆ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజకీయ కాలయాపన చేస్తే ప్రజాక్షేత్రంలో పీఠం కదిలిపోవడం ఖాయమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -