కరెంటు కోతలు.. ఎల్‌నినో ప్రభావంతో పంటకు తీవ్ర నష్టం
రెండు ఎకరాల్లో సాగు చేసిన వరి ఎండిపోవడంతో రైతు
ఆవేదన.. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
నవతెలంగాణ – మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మద్వార్ గ్రామంలో చెందిన యువ రైతు బోరు నీటితో రెండు ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. అయితే సాగు ప్రారంభం నుంచే తీవ్ర విద్యుత్ కోతలు ఎదురుకావడంతో పంటకు అవసరమైన సమయంలో నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండిపోవడంతో భూమిలో తేమ పూర్తిగా తగ్గిపోయి వరి పంట ఎండిపోయింది.
బోరు కింద సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు రైతు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కరెంటు కోతలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫలితం లేకుండా పోయింది. చివరకు చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎండిపోయిన వరి పంటను గొర్రెలకు వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేక రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైతులకు నష్టపరిహారం అందించాలి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల్లో పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.



