Monday, September 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్‘ఉపాధి’ వినాయక.!

‘ఉపాధి’ వినాయక.!

- Advertisement -

యువత, నిరుద్యోగులకు చేతినిండా పనులు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఊరూరా, వాడవాడా, ప్రధాన కూడళ్లు, దేవాలయాలు ఇలా ప్రాంతం ఏదైనా గణపతి విగ్రహాల ప్రతిష్ఠాపన భక్తిశ్రద్ధలతో సాగింది. మండల వ్యాప్తంగా అనేక మండపాల్లో బొజ్జ గణపయ్య కొలువుదీరాడు. పల్లె, పట్నం తేడాలేకుండా భక్తజనం ఆదిదేవుని సేవలో తరిస్తోంది. సోమవారం ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ‘జెబోలో.. గణేశ్ మహరాజ్కో’ అంటూ భక్తిభావంతో వినాయకుడిని పూజించారు. నవరాత్రి ఉత్సవాలు అనేకమందికి ఉపాధి కల్పిస్తోంది. గణపతి విగ్రహాల తయారీ మొదలు..నవరాత్రులు పూజలందుకుని గణేశుడు నిమజ్జనం అయ్యేదాకా విగ్రహ తయారీదారులు, మండపాలు వేసే మేదరులు, పురోహితులు, అన్న దానాలు, వంటల తయారీ, బాజాభజంత్రీలు, విద్యుత్ దీపాలంకరణ, టెంట్ హౌస్లు..ఇలా ఎందరో ఉపాధి పొందుతూ తమ పనుల్లో బిజీ అయ్యారు. పూజలకు వినియోగించే వస్తుసామగ్రితో వ్యాపారాలు కూడా జోరందుకున్నాయి.

విగ్రహాల తయారీతో..
గణేశుడి ప్రతిమలు తయారు చేసే పనులు వినాయక చవితికి ఐదు నెలల ముందే మొదలైంది. రాజస్తాన్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల కళా కారులు భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కాటారంతోపాటు ప్రధాన పట్టణాలకు తరలివచ్చి ఆకర్షణీయమైన విగ్రహాలు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. ఇందులో వందలాది మంది కార్మికులు నిమగ్నమయ్యారు.

మేదరులకూ గిరాకీ..
గణపయ్యల కోసం మండపాలు వేసే పనులతో మేదరులు బిజీ అయ్యారు. ఇందులో సెంట్రింగ్ కార్మికులు, మేదరులు, టెంట్ హౌస్ నిర్వాహకులకు చేతినిండా పనిదొరికింది. విద్యుతీపాల అలంకరణలతో ముస్తాబు చేసే పనుల్లో మరికొందరు కళాకారులు నిమగ్నమయ్యారు.

వాహనాలకు సైతం..
పూజలందుకునే గణపయ్యలను మండపాల్లో కొలువుదీర్చేందుకు తయారీదారుల షెడ్డు నుంచి మండపాలకు తరలించడం..నవరాత్రులు పూజలందుకున్న తర్వాత నిమజ్జనం చేసేందుకు అవసరమైన వాహనాలకు ఊరేగింపుగా తీసుకెళ్లే గిరాకీ దొరుకుతోంది. విగ్రహ సైజ్ను బట్టి ట్రాక్టర్, డీసీఎం వ్యాన్, లారీలను వినియోగిస్తుంటారు. కొందరుదైవ కార్యక్రమం కోసం తమవంతు సాయంగా ఉచితంగాను అందిస్తామని ముందుకు వస్తుంటారని మండప నిర్వాహకులు తెలిపారు.

బ్యాండ్ మేళాలు.. డప్పుచప్పుళ్లు
మండపాల్లో నవరాత్రులు పూజలందుకున్న గణపతి విగ్రహాలను నిమజ్జనాకి తరలించేందుకు బాజా భజంత్రీలు..డప్పుచప్పుళ్లు వినియోగిస్తారు. భక్త జనాన్ని ఆకట్టుకునేలా చూడాలనే తాపత్రయం ఉన్నవారు ఒగ్గు, డోలుదెబ్బ కళాకారులను సైతం రప్పిస్తుంటారు. ఈసారి డీజేలకు అనుమతిలేదని, అయినా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -