నవతెలంగాణ -ఉప్పల్: డా. ఏఎస్ రావు నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇకపై చెల్లుబాటు కాదని, దానిపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్న హైకోర్టు నిర్ణయం సత్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఈ తీర్పుతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలో పూర్తి చేసి తెలంగాణకి నీటి సమస్యల పరిష్కారానికి దోహదపడిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో మళ్లీ తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్‌లోని సెక్షన్ 8(బి) ప్రకారం ఎవరిపై ఆరోపణలు చేసే ముందు వారి వాదనలు వినాల్సి ఉంటుందని, కానీ ఆ ప్రక్రియ పాటించలేదని ఆరోపించారు. నివేదిక పూర్తికాకముందే అసెంబ్లీలో చర్చించడం, మీడియాకు లీకులు ఇవ్వడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని అన్నారు. విచారణలో సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శిస్తూ, “విచారణకు మేము వ్యతిరేకం కాదు, కానీ అది పారదర్శకంగా జరగాలి. కమిషన్ల పేరుతో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం సరికాదు” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



