కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన సేవలు చిరస్మరణీయం
నవతెలంగాణ – హైదరాబాద్:
సీపీఐ(ఎం) తమ్మడపల్లి (జి) గ్రామ సీనియర్ నాయకులు, పార్టీ నిర్మాణంలో అంకితభావంతో పనిచేసిన కామ్రేడ్ చినూరు వెంకటయ్య అనారోగ్య కారణాలతో సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి సీపీఐ(ఎం)కు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు అన్నారు. కామ్రేడ్ చినూరు వెంకటయ్యకు పార్టీ జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
1967లో సీపీఐ(ఎం) సభ్యత్వం స్వీకరించిన కామ్రేడ్ చినూరు వెంకటయ్య, తన జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల అచంచలమైన నిబద్ధతతో పనిచేశారు. తమ్మడపల్లి (జి) గ్రామంలో పార్టీ నిర్మాణానికి పునాదులు వేయడంలో, పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ గ్రామ కార్యదర్శిగా, మండల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించారు.
పార్టీపై ఎన్ని దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు జరిగినా ఆయన ఎర్రజెండాను వీడలేదు. 1987లో కాంగ్రెస్ గుండాలు ఆయన ఇంటిని తగలబెట్టినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పార్టీ కార్యకలాపాల్లో కొనసాగారు. 1997లో సీపీఐ(ఎం) పార్టీకి రాజీనామా చేయాలని, లేదంటే చంపేస్తామని, ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని నక్సలైట్లు బెదిరించినప్పటికీ ఆయన భయపడలేదు.
“చంపితే చంపండి… ఇల్లు బాంబులతో లేపేస్తే లేపేయండి… నేను మాత్రం సీపీఐ(ఎం) పార్టీకి రాజీనామా చేయను” అని తెగేసి చెప్పిన ధైర్యశాలి కామ్రేడ్ చినూరు వెంకటయ్య. వ్యక్తిగత ప్రాణభయాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడిన ఆయన నిబద్ధత కమ్యూనిస్టు ఉద్యమంలో ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
కామ్రేడ్ చినూరు వెంకటయ్య కేవలం పార్టీ సభ్యుడిగా మాత్రమే కాకుండా పార్టీ నిర్మాణానికి, వర్గపోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు అంకితమైన కార్యకర్తగా పనిచేశారు. గ్రామీణ పేదలు, కార్మికులు, కూలీలు, రైతుల సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాల్లో భాగస్వాములను చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
కష్టకాలంలో పార్టీని కాపాడుకోవడం, నిర్బంధాలకు–దాడులకు వెరవకుండా ప్రజల పక్షాన నిలబడటం, ఎర్రజెండా పట్ల చివరి వరకు విశ్వాసంగా ఉండటం ఆయన జీవితంలోని ప్రధాన లక్షణాలు. ఆయన జీవితం నేటి తరానికి కమ్యూనిస్టు నిబద్ధతకు ఒక గొప్ప ఉదాహరణ. కామ్రేడ్ చినూరు వెంకటయ్య మరణం తమ్మడపల్లి (జి)లో సీపీఐ(ఎం) పార్టీకి మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమాలకు కూడా తీరని లోటు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఆయన చూపిన మార్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.
కామ్రేడ్ చినూరు వెంకటయ్య అంత్యక్రియలు ఈరోజు తమ్మడపల్లి (జి) గ్రామంలో నిర్వహించారు. సీపీఐ(ఎం) పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కామ్రేడ్‌కు తుది నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య, పార్టీ మండల కార్యదర్శి గుండెబోయిన రాజు, జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి షబానా, పార్టీ గ్రామ కార్యదర్శి వేల్పుల రవి, పార్టీ మండల నాయకులు, ఉపసర్పంచ్ ముక్కెర గంగరాజు, రాపర్తి రజిత, నాయకులు ఎండి శంశోద్దిన్, వడ్లకొండ రాజు, రఘుపతి, పులిగిళ్ల నాగరాజు, రాపర్తి మల్లేశం, కన్నబోయిన నాగయ్య, చిన్న రాములు, ఉప్పునూతల సోమయ్య, గౌరయ్య, సోన్నాయిల ప్రభాకర్, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామ్రేడ్ చినూరు వెంకటయ్యకు విప్లవ జోహార్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


