Friday, April 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ నౌకలను కాల్చిపారేయండి

ఇరాన్‌ నౌకలను కాల్చిపారేయండి

- Advertisement -

– హార్ముజ్‌పై ట్రంప్‌ కీలక ఆదేశాలు
– నిర్బంధించినంత వరకూ తెరిచేది లేదు : ఇరాన్‌
– యుద్ధంతో పతనం దిశగా ఆర్థికవ్యవస్థ : ఎస్‌పీ గ్లోబల్‌ పర్చేజింగ్‌ సంస్థ వెల్లడి

వాషింగ్టన్‌ : అమెరికా, ఇరన్‌ల మధ్య కాల్పుల విరమణ అమల్లోనే ఉన్నా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ నౌకలు మందుపాతరలు (సిమైన్స్‌) అమర్చుతున్నాయని, వాటిని గుర్తించి దాడి చేయాలని అమెరికా నౌకాదళాన్ని ఆయన ఆదేశించారు. ఈ మేరకు సోషల్‌ ట్రూత్‌లో పోస్ట్‌చేశారు. ‘హర్ముజ్‌ జలసంధిలో మైన్లను పెడుతున్న ఏ చిన్న పడవైనా సరే కాల్చి ధ్వంసం చేయాలని నావికా దళాన్ని ఆదేశించాను. ఈ విషయంలో ఏమాత్రం సంకోచించొద్దని చెప్పా. అమెరికా మైన్‌ స్వీపర్లు ప్రస్తుతం జలసంధిని క్లియర్‌ చేస్తున్నాయి. ఈ కార్యాచరణను మూడు రెట్లు అధిక వేగంతో కొనసాగించాలని ఆదేశిస్తున్నాను” అని పేర్కొన్నారు. అంతేకాకుండా హార్మూజ్‌ జలసంధి తమ ఆధీనంలోనే ఉందని ప్రకటించారు.
నౌకల రాకపోకలు అమెరికా నేవీ అనుమతితోనే జరుగుతాయని ట్రంప్‌ రాసుకొచ్చారు. ఇరాన్‌ ప్రస్తుతం తమ నాయకుడు ఎవరో తేల్చుకొనేందుకు తీవ్ర ఇబ్బంది పడుతోంద న్నారు. అమెరికా నేవీ అనుమతి లేకుండా నౌకల రాకపోకలు జరగవన్నారు. ఇరాన్‌ తమతో ఒప్పందానికి వచ్చేంతవరకు నిర్భందం కోనసాగుతుందని తెలిపారు

అయితే కొద్దిరోజుల క్రితం ఆయనే స్వయంగా కాల్పుల విరమణను పొడిగిస్తూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాని ట్రంప్‌ నుంచే దాడి చేయలంటూ ఆదేశాలు రావడం గమనార్హం. మరోవైపు అమెరికా నిర్భందం కొనసాగుతున్నంత కాలం హార్మూజ్‌ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ యుద్ధంతో హార్ముజ్‌ జలసంధి ఉద్రిక్త ప్రాంతంగా మారిపోయింది. అలాగే ఇరాన్‌ సముద్రంలో అమర్చిన సిమైన్స్‌ తీయడం అంత సులభం కాదని, వాటిని తీసేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే 35 కి.మీ వెడల్పు ఉండే హార్ముజ్‌ జలసంధి కోసం అగ్రరాజ్యం అల్లాడిపోవడం, అనేక దేశాల్లో చమురు ధరలుపై ప్రభావం పడటం ఈ జలసంధి ప్రాముఖ్యతను తెలుపుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు..
హార్ముజ్‌లో మందుపాతరల తొలగింపునకు

ఆరు నెలలు : పెంటగాన్‌
హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ సైన్యం అమర్చిన మందు పాతరలను పూర్తిగా తొలగించడానికి ఆరు నెలల సమయం పడుతుందని అమెరికా ప్రతినిధి సభకు పెంటగాన్‌ తెలిపింది. పెంటగాన్‌ అంచనాలపై రిపబ్లిక్‌, డెమొక్రాట్‌ సభ్యులు అసహనం వ్యక్తం చేశారని, ఒకవేళ శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఈ జాప్యం కారణంగా గ్యాసోలైన్‌, చమురు ధరలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారని కొందరు అధికారులు తెలిపారు. హార్ముజ్‌ జలసంధి లోపల, దాని చుట్టుపక్కల ఇరాన్‌ సైన్యం 20కి పైగా మందుపాతరలు అమర్చి ఉండవచ్చునని ప్రతినిధి సభ సభ్యులకు పెంటగాన్‌ తెలియజేసింది. వీటిలో కొన్నింటిని జీపీఎస్‌ టెక్నాలజీ సాయంతో మారుమూల ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. వాటిని కనిపెట్టడం అమెరికా దళాలకు అంత సులభమైన పనేమీ కాదని ఓ సీనియర్‌ రక్షణ అధికారి చెప్పారు. కొన్ని మందుపాతరలను భౌతికంగా అమర్చడం జరిగింది. అమెరికా, ఇజ్రాయిల్‌ దళాలు తనపై దాడి ప్రారంభించడంతో ఇరాన్‌ మార్చి నెలలో హార్ముజ్‌లో మందుపాతరలను అమర్చడం మొదలు పెట్టింది.

ఇరాన్‌పై యుద్ధం వద్దు : ఇజ్రాయిల్‌ ప్రతిపాదనను తోసిపుచ్చిన ముగ్గురు అమెరికా అధ్యక్షులు
ఇరాన్‌పై యుద్ధం చేద్దామంటూ ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ చేసిన ప్రతిపాదనను ముగ్గురు అమెరికా అధ్యక్షులు తోసిపుచ్చారు. చివరికి డొనాల్డ్‌ ట్రంప్‌ అందుకు అంగీకరించారని మాజీ విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ తెలిపారు. ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన కెర్రీ మాట్లాడుతూ ఒబామా, బుష్‌, బైడెన్‌లు ఇరాన్‌తో పోరుకు అంగీకరించలేదని చెప్పారు. బారక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కెర్రీ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. శాంతి ప్రక్రియకు అవకాశాలు మిగిలి ఉన్నందునే ముగ్గురు అధ్యక్షులు యుద్ధాన్ని కోరుకోలేదని కెర్రీ అన్నారు. సైనిక చర్య చేపడితే ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాటు తలెత్తుతుందని నెతన్యాహూ అంచనా వేశారని చెప్పారు. ఇరాన్‌లో నాయకత్వ మార్పు జరుగుతుందన్న నెతన్యాహూ అంచనా ఫలించలేదని అన్నారు. వియత్నాం, ఇరాక్‌ యుద్ధాలు నేర్పిన పాఠాలను కెర్రీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

నాటోలో అస్మదీయులెవరు ? తస్మదీయులెవరు ?
జాబితా తయారు చేసిన ట్రంప్‌ ప్రభుత్వం

నాటో భాగస్వాములలో అస్మదీయులు, తస్మదీయులతో కూడిన జాబితాను డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రభుత్వం రూపొందించిందని తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా సాగించిన యుద్ధాన్ని అనేక నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. యుద్ధాన్ని సమర్ధించిన దేశాలకు నజరానాలు, వ్యతిరేకించిన దేశాలకు జరిమానాలు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రట్‌ ఈ నెల ప్రారంభంలో వాషింగ్టన్‌లో పర్యటించారు. దానికి ముందే ఈ జాబితా సిద్ధమైందని సమాచారం. గత సంవత్సరం డిసెంబరులో అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ తెర పైకి తెచ్చిన ఆలోచనకు దీనికి కొనసాగింపుగా భావిస్తున్నారు. రక్షణ వేదికపై హెగ్‌సేథ్‌ మాట్లాడుతూ ఆదర్శ భాగస్వాములను ప్రత్యేకంగా చూడడం జరుగుతుందని, ఇతర దేశాలు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఇలాంటి చర్యలు అమెరికాకు మరింత నష్టాన్ని కలిగిస్తాయని పరిశీలకులు హెచ్చరించారు. కాగా జాబితాను రూపొందించిన విషయాన్ని శ్వేతసౌధం ధృవీకరించలేదు.
పోలండ్‌, రొమేనియా దేశాలు యుద్ధాన్ని వెనకేసుకొచ్చాయి. నాటో సభ్య దేశాలలో పోలండ్‌ గణనీయమైన రక్షణ సహకా రాన్ని అందిస్తోంది. ఇరాన్‌ యుద్ధానికి సంబంధించి అమెరికా దళాలు తన వైమానిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు రొమేనియా అనుమతించింది. గల్ఫ్‌ యుద్ధంలో భాగస్వాము లయ్యేందుకు మెజారిటీ నాటో దేశాలు నిరాకరించాయి. వాటి వైఖరిపై ట్రంప్‌ మండిపడిన విషయం తెలిసిందే.

అమెరికా నేవీ సెక్రెటరీకి ఉద్వాసన
డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో నౌకాదళ కార్యదర్శిగా పనిచేస్తున్న జాన్‌ ఫెలాన్‌కు ఉద్వాసన పలికారు. గత సంవత్సరం మార్చిలో ఆయన నేవీ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఆయన తక్షణమే వైదొలిగారని పెంటగాన్‌ ధ్రువీకరించింది. అయితే ఆయన ఉద్వాసనకు కారణాలేమిటో వివరించలేదు. ఫెలాన్‌ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారా అనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ఫెలాన్‌ నిష్క్రమణతో…ఇరాన్‌ యుద్ధం కొనసాగుతున్న సమయంలో పెంటగాన్‌లో మరో నాయకత్వ కుదుపు ఏర్పడినట్లయింది. ఈ నెల ప్రారంభంలో సైనిక దళాల ప్రధానాధికారి రాండీ జార్జ్‌ని ఎలాంటి కారణం చూపకుండానే రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ పదవి నుంచి తొలగించారు. హెగ్‌సేథ్‌తో నెలకొన్న విభేదాల కారణంగానే ఫెలాన్‌కు ఉద్వాసన పలికారని తెలుస్తోంది. యుద్ధం జరుగుతున్నప్పుడే సైనిక జనరల్స్‌ డేవిడ్‌ హడ్నే, విలియం గ్రీన్‌ జూనియర్‌ను కూడా తప్పించారు.

అమెరికా నౌకాదళాన్ని విస్తరించేందుకు చేపట్టిన సంస్కరణలను అమలు చేసే విషయంలో ఫెలాన్‌ చురుకుగా వ్యవహరించడం లేదని, అందుకే ఆయనను తప్పించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి హెగ్‌సేథ్‌, రక్షణ శాఖ సహాయ మంత్రి స్టీవ్‌ ఫెయిన్‌బర్గ్‌ సహా కీలక పెంటగాన్‌ నాయకత్వంతో ఆయనకు ఉన్న విభేదాలు కూడా ఇందుకు కారణమేనని అంటున్నారు. హెగ్‌సేథ్‌, ఫెలాన్‌ మధ్య అనేక నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయని సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ తెలిపింది. కాగా ఫెలాన్‌ కార్యాలయంలో చేపట్టిన ఎథిక్స్‌ విచారణ సైతం ఆయన తొలగింపునకు కారణమని చెబుతున్నారు. హార్ముజ్‌లో నౌకల దిగ్బంధనం కొనసాగుతున్న సమయంలో ఫెలాన్‌ను తొలగించడం గమనార్హం.

తరిగిపోతున్న అమెరికా ఆయుధ సంపద
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు యుద్ధం మొదలు పెట్టి యాభై రోజులు దాటింది. ఈ పోరులో ఇరాన్‌ సైనిక సామర్ధ్యం దెబ్బతిన్న మాట నిజమే. అయితే అదే సమయంలో అమెరికా ఆయుధ నిల్వలు కూడా గణనీయంగానే తరిగిపోయాయి. ప్రభుత్వ డేటా ఆధారంగా అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (సీఎస్‌ఐఎస్‌) అందించిన సమాచారం ప్రకారం…ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటి వరకూ తన క్షిపణులలో నలభై ఐదు శాతం, థాడ్‌ వ్యవస్థలలో అరవై శాతం, పాట్రియట్‌ గగనతల రక్షణ వ్యవస్థలలో సుమారు యాభై శాతాన్ని వినియోగించింది. ఈ నేపథ్యంలో అమెరికా తన ఆయుధ సంపదను యుద్ధానికి పూర్వమున్న స్థాయికి చేర్చేందుకు ఎంత సమయం పడుతుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రస్తుత యుద్ధాన్ని కొనసాగించేందుకు సరిపడినన్ని క్షిపణులు అమెరికా వద్ద ఉన్నాయని, అయితే భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తితే మాత్రం ఇబ్బందేనని సీఎస్‌ఐఎస్‌ నిపుణులు హెచ్చరించారు.
ఇరాన్‌ యుద్ధంలో ఇప్పటి వరకూ అమెరికా కేవలం ఏడు కీలక ఆయుధాలను మాత్రమే ఉపయోగించింది. వీటిలో తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులు, గగనతలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణులు, థాడ్‌ వ్యవస్థలు, పాట్రియట్‌ గగనతల రక్షణ వ్యవస్థలు, స్టాండర్డ్‌ క్షిపణి-3, స్టాండర్డ్‌ క్షిపణి-6 ఉన్నాయి. యుద్ధానికి ముందు 3,100 తోమహాక్‌ క్షిపణులు ఉండగా వాటిలో 850కి పైగా వినియోగించారు. వీటి తయారీకి చాలా కాలం పడుతుంది. అమెరికా వద్ద 360 థాడ్‌ వ్యవస్థలు ఉండగా క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు వాటిలో 190-200 వ్యవస్థలను వాడారు. ఇక పాట్రియాట్‌ వ్యవస్థలను చాలా ఎక్కువగా ఉపయోగించారు. 2,330 క్షిపణులలో 1,060 నుంచి 1,430 క్షిపణులను ప్రయోగించారు. ఈ విధంగా ఇరాన్‌పై జరిపిన పోరులో అమెరికా ఆయుధ నిల్వలు ఇప్పటికే గణనీయంగానే తరిగిపోయాయి.

మళ్లీ పెరిగిన ముడి చమురు ధరలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై భారం తప్పదా?
అంతర్జాతీయ ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్యారల్‌ ముడి చమురు ధర గురువారం వంద డాలర్లు దాటింది. దీంతో మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరగవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతానికి వీటి ధరలలో మార్పు లేనప్పటికీ ముడి చమురు ధర పెరిగితే వినియోగదారులకు ఊరట కలిగించడం కష్టమవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే భారత ముడి చమురు అవసరాలను చాలా వరకూ దిగుమతులే తీరుస్తున్నాయి. కాబట్టి అంతర్జాతీయ చమురు ధరలు పెరిగితే అదనపు భారాన్ని కంపెనీలు, ప్రభుత్వం లేదా వినియోగదారులు భరించాల్సి వస్తుంది. అయితే ఒక రోజు ముడి చమురు ధరలు పెరిగినంత మాత్రాన ఆ మర్నాడే పెట్రోల్‌ ధరలు పెరగవు. స్వల్ప కాలిక ఒడిదుడుకులను తట్టుకునే సామర్ధ్యం చమురు కంపెనీలకు ఉంటుంది. ముడి చమురు ధరలు వారాల తరబడి వంద డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ కొనసాగితే మాత్రం ఒత్తిడి పెరుగుతుంది. లీటరుకు మూడు నాలుగు రూపాయల నష్టం వస్తే భరించడం కష్టమవుతుందని, అప్పుడు ఇంధన ధరల పెంపు తప్పదని, అలా జరగని పక్షంలో ప్రభుత్వ మద్దతు అవసరమవుతుందని నిపుణులు తెలిపారు. ప్రస్తుతానికి ఎక్కువ భారం చమురు మార్కెటింగ్‌ కంపెనీల పైనే పడుతోంది. బ్యారల్‌ ముడి చమురు ధర 95 డాలర్లు ఉంటే దేశీయ చమురు మార్కెటింగ్‌ కమిటీలు రోజుకు రూ.1,600 కోట్ల మేర నష్టపోతాయని పరిశోధనా విశ్లేషకుడు అరుణ్‌ కైలాసన్‌ చెప్పారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత పతనం..
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత పతనం అవుతుందని ఎస్‌పీ గ్లోబల్‌ పర్చేజింగ్‌ సంస్థ గురువారం నివేధించింది. ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయని, సేవా రంగంలో కూడా కార్యకలాపాలు మందగించాయని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఇంధన సరఫరాలకు ఎదురైన అత్యంత తీవ్రమైన ఆటంకాలను అధిక భాగం తట్టుకున్నప్పటికీ, దాదాపు రెండు నెలల నుంచి కొనసాగుతున్న యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ఆహార సరఫరాలపై ప్రభావం, ఆర్థిక వృద్ధి మందగించడానికి కారణాలు నివేదిక విశ్లేషించింది. అలాగే యూరో జోన్‌లోని 21 దేశాలు అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న వాటిలో ఉన్నాయని, దీనికి సంబంధించిన అబివృద్ధి సూచిక మార్చిలో 50.7 శాతం నుంచి ఏప్రిల్‌లో 48.6 శాతానికి పడిపోయిందని తెలిపింది.

ఇజ్రాయిల్‌ దాడిలో లెబనాన్‌ మహిళా జర్నలిస్ట్‌ మృతి

దక్షిణ లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయిల్‌ సేనలు జరిపిన దాడిలో మహిళా పాత్రికేయురాలు అమల్‌ ఖలిల్‌ మరణించారు. ఇజ్రాయిల్‌-హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన వార్తలను తాను పనిచేస్తున్న అల్‌-అక్బర్‌ దినపత్రికకు పంపేందుకు ఆమె ఆ ఇంటిలో ఉన్నారు. లెబనాన్‌ దక్షిణ ప్రాంతంలోని అల్‌-తిరి గ్రామంలో అమల్‌ వార్తలు సేకరిస్తుండగా దాడి జరిగిందని అల్‌-అక్బర్‌ పత్రిక తెలియజేసింది. అంతకుముందు సహచర ఉద్యోగితో కలిసి ఆమె కారులో ప్రయాణిస్తుండగా దాని సమీపంలోనే ఇజ్రాయిల్‌ వైమానిక దాడి జరిగింది. దీంతో అమల్‌ ఖలీల్‌ ఆ ఇంటిలో రక్షణ పొంది యుద్ధ వార్తలు పంపే ప్రయత్నం చేశారు. మొదటి దాడిలో ఇద్దరు చనిపోయారని, రెండోసారి జరిగిన దాడిలో అమల్‌ ఖలీల్‌ చనిపోగా సహచర ఉద్యోగి జైనబ్‌ ఫరజ్‌ తీవ్రంగా గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి జరిగిన ఆరు గంటల తర్వాత కానీ అమల్‌ ఖలీల్‌ మృతదేహం లభించలేదు. ఈ ఏడాది లెబనాన్‌లో ఇప్పటి వరకూ ఇజ్రాయిల్‌ దాడులలో తొమ్మిది మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంమీద 2,300 మంది చనిపోగా పది లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -