భారత ఎగుమతులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం
మోడీ సర్కారుకు దౌత్య, ఆర్థిక సవాలు
న్యూఢిల్లీ, వాషింగ్టన్ : రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా ముందడుగు వేసింది. రష్యా, ఇరాన్‌పై ఆంక్షలను కఠినతరం చేసే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో కీలక అడుగు పడింది. ఈ చట్టం అమలులోకి వస్తే భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌నకు లభించే అవకాశం ఉంది. దీనితో ఇప్పటికే వాణిజ్య, దౌత్యపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వానికి మరో సవాలు ఎదుకానుంది.
బిల్లుకు సభలో కీలక ముందడుగు
‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ పేరుతో రూపొందించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ మంగళవారం 214–211 ఓట్ల తేడాతో తదుపరి దశకు పంపింది. ఇది బిల్లుకు తుది ఆమోదం కాదు. బుధవారం తుది ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగస్టులో అమెరికా సెనెట్ ఈ బిల్లును 86–11 ఓట్లతో ఆమోదించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వం, ఆ దేశ ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపై ఆంక్షలను కఠినతరం చేయడం బిల్లు ప్రధాన లక్ష్యం.
భారత్‌పై 100 శాతం సుంకాల ముప్పు!
బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడిచమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి దక్కుతుంది. సెనెట్ ఆమోదించిన ముసాయిదాలో రష్యా చమురు, గ్యాస్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకునే ఐదు దేశాలను ప్రస్తావించారు. ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ సభ్యుడు స్టెనీ హోయర్ ప్రవేశపెట్టిన సవరణలో భారత్ సహా పది దేశాలను స్పష్టంగా పేర్కొనే ప్రతిపాదన ఉంది. చైనా, టర్కీ, అజర్‌బైజాన్, హంగేరీ, స్లోవేకియా, యూఏఈ, సింగపూర్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ట్రంప్‌నకు విస్తృత అధికారాలపై అభ్యంతరాలు
బిల్లులో అధ్యక్షుడికి విస్తృత సుంకాధికారాలు ఇవ్వడంపై కొందరు అమెరికా చట్టసభ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన గ్రెగరీ మీక్స్ అధ్యక్షుడికి ఇస్తున్న విస్తృత అధికారాలను ప్రశ్నించారు. సుంకాల విధింపుపై స్పష్టమైన పరిమితులు, నియంత్రణలు ఉండాలని ఆయన కోరుతున్నారు.
ఎగుమతులపై ప్రభావం
అమెరికా భారత్‌పై 100 శాతం సుంకాలను అమలు చేస్తే, అమెరికా మార్కెట్‌కు భారత ఉత్పత్తులను ఎగుమతి చేసే సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడవచ్చు. భారతీయ వస్తువుల దిగుమతి వ్యయం పెరగడం వల్ల వాటి పోటీతత్వం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఎగుమతులపై ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది సుంకాల తుది రేటు, వర్తించే ఉత్పత్తులు, మినహాయింపులు, అమలు విధానంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారత్‌పై ఈ బిల్లు కింద 100 శాతం సుంకాలు విధించలేదు.



