– ఫ్రెషర్స్‌కు అభినందనలు తెలిపిన ఎంపీ డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం అన్ని విభాగాల విద్యార్థుల ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఈ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం నూతన విద్యార్థులను కళాశాల వాతావరణానికి అలవాటు చేయడంలో ఈ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీనియర్లు, జూనియర్ల మధ్య పరిచయాలు పెరిగి, పరస్పరం సహకరించుకోవడానికి ఇవి తోడ్పడతాయని తెలిపారు. ఫ్రెషర్స్ డే జరుపుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, హెటిరో గ్రూప్ సంస్థల చైర్మన్, సాయిస్ఫూర్తి కళాశాల చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డితో పాటు విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్ విధానంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాలల్లో ఇలాంటి సంప్రదాయ వేడుకలు విద్యార్థుల వికాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. కష్టపడి, ఇష్టపడి చదువుతూ, నలుగురు కలిసి స్నేహపూర్వక వాతావరణంలో నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేస్తే ఉన్నతమైన భవిష్యత్తు సొంతమవుతుందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి సమాజంలో, విభిన్న రంగాల్లో అనేక అవకాశాలు వేచి ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ షేక్ మీరాసాహెబ్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.



