నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారనీ, వారి సమస్యలను పరిష్కరించకపోగా శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్న వారిపై ప్రభుత్వం దమనకాండ కొనసాగించటం దుర్మార్గమని ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ ఝాన్సీ, అందె మంగ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెల్లవారు జామున విజయ వాడలో అంగన్‌వాడీ సంఘాల జేఏసీి నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శిబిరంపై పోలీసులు దాడి చేసి మహిళలపై అత్యంత కిరాతకంగా వ్యవహరించి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అరెస్ట్ సందర్భంగా కరెంట్ తీసేశారనీ, పురుష పోలీసులు దురుసుగా, అనుచితంగా వ్యవహరించారని తెలిపారు. మహిళలను బూట్ల్లతో తొక్కుతూ అమానుష దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గ చర్యల్ని ఖండిస్తున్నామని తెలిపారు. చట్ట విరుద్ధంగా, వ్యవ హరించిన పోలీసులపై కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.