Sunday, September 20, 2026
E-PAPER
Homeసోపతిఆచరణే గీటురాయి

ఆచరణే గీటురాయి

- Advertisement -

కేతిగాడు : నేను జన చైనా నేతను. నా పేరే విజన్‌ ‌వింగ్‌. న్యూఢిల్లీ బ్రిక్స్‌ ‌సమావేశంలో పంచ సూత్రావళిని ప్రవేశపెట్టాను. 1. ఎఐ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ‌(కృత్రిమ మేధ), 2. వాణిజ్యం, 3. డిజిటల్‌ ఆర్థికం, 4. స్మార్ట్‌ ‌ఫ్యాక్టరీలు, 5. సైంటిస్టులతో కలిసిన అతిపెద్ద మార్కెట్‌. ఈ ఐదింటిలో బ్రిక్స్‌ ‌దేశాలు ముందుండాలి. పరికరాలు సృష్టించుకోవాలి. సమన్వయం సాధించాలి. అమెరికా డాలర్‌ ‌పెత్తనాన్ని దెబ్బతీయాలంటే ఈ అత్యవసర కృషి అనివార్యం. దక్షిణ భూగోళ దేశాలు.. ఆ అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్‌‌లు అనుసంధానం కావాలి. పెనవేసుకుపోవాలి. పైపై మాటలతో పనికాదు. కార్యాచరణతోనే మైత్రీ రవాణా గొలుసులు పటిష్టమవుతాయి. భవిష్యత్‌ ‌ప్రపంచ మార్కెట్‌‌కు ఇదే అతి పెద్ద రహదారి. ముందుగా ఎఐ ఓపెన్‌ ‌సోర్స్‌ ‌కమ్యూనిటీ ఏర్పాటుకు చైనా అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. ఎఐ సెమినార్లు, శిక్షణా కోర్సులతో ఓపెన్‌ ఎఐ ఎకోసిస్టమ్‌‌ అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడులు సులభతరం కాకుండా వాణిజ్యం అభివృద్ధి కాదు. దీనికోసం బ్రిక్స్‌ ‌స్పెషల్‌ ఎకనామిక్‌ ‌జోన్‌‌ను ఏర్పాటు చేసుకుందాం. ఏమంటారు? ఇక డిజిటల్‌ ‌పరిశ్రమను బలోపేతం చేయడం కొత్త సాంకేతికతల మార్పిడి, స్మార్ట్‌‌కర్మాగారాల ఏర్పాటు, రోబోటిక్స్‌, ఆటోమిషన్‌ ‌వగైరా అన్నీ ఒకదానివెంట ఒకటి ఆధునీకరణతో పరుగులు పెడ్తాయి. కానీ ప్రమాణాలు ముఖ్యం. వాటి రూపకల్పనలోనూ చైనా ముందుంటుంది.

జుట్టుపోలుగాడు: ఎహె.. అంతా నీవే మాట్లాడితే ఎలా? ఆతిద్యం ఇస్తున్న నేను, మా భారత్‌ ‌మాట్లాడొద్దా? ప్రధాని మోడిని మాట్లాడుతున్నా. ఈ భూగోళం ప్రశాంతంగా లేదు. దినదినం రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడ్తున్నారు. మనందరం కలిసికట్టుగా ఉంటేనే వీటిని ఎదుర్కోగలం. కొందరు తమ వద్ద వున్న సాంకేతికతను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చుకుంటూ ప్రపంచాన్ని భయపెడ్తున్నారు. ఇది సరికాదు. ఏ ఒక్క దేశం మరో దేశంపై పెత్తనం చేయడం మంచిది కాదు.

అల్లాటప్పాగాడు: చాల్లే చెప్పొచ్చావ్‌. నాకు మాట్లాడటం చేతకాదా ఏంటి? నేను రష్యా పుతిన్‌‌ని. అరకొర మాటలతో ఎప్పుడూ పని కాదు. సమగ్ర వ్యూహం ఉండాలి. ఆకలి నిత్యం, ఆకలి సత్యం. ప్రపంచ మానవాళి ఆకలి తీర్చాలంటే బ్రిక్స్‌ ‌కూటమి దేశాల మధ్య ఓ ధాన్య మార్కెట్‌, ఓ భీమా యంత్రాంగం, పటిష్ట సహకారం ఆవశ్యమని నా ప్రతిపాదన. శ్రామిక శక్తి, సాంకేతికత విషయాలకు సంబంధించి తమ రష్యాకు సొంత విధానాలు వున్నాయి. బయటి ఒత్తిళ్లకు లొంగకుండా కార్యకలాపాలు సాగించే సత్తా తమకుంది.
కేతిగాడు : అవునవును. ప్రపంచం అంతా ఓ కుగ్రామం అవుతున్న దశలో మనం ఉన్నాం. ‘బలవంతుడు చెప్పిందే న్యాయం, చేసేదే ధర్మం’ అనే ధోరణికి కాలం చెల్లింది. ఐక్య రాజ్య సమితితో సహా అంతర్జాతీయ సంస్థలను మనం పునర్వవస్థీకరించుకోవాలి. వస్తు పరిమాణం సంపదతో సంబంధం లేకుండా అన్ని దేశాలకు మనం సమాన గౌరవం ఇవ్వాలి. బహుళ దృవ ప్రపంచ వ్యవస్థను నిర్మించడంలో మన బ్రిక్స్‌‌దేశాల కూటమి ఛోదక శక్తిగా నిలవాలి.

బంగారక్క : (చప్పట్లు కొడుతూ) సారాంశాన్ని బాగా తెలిపారు. అభినందనలు. ఎవరికైనా ఆచరణే గీటురాయి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అస్సలుండకూడదు. గాంధి మహాత్ముడి నుండి మనం ఇదే నేర్చుకోవాలి. దేశాధినేతలు తత్‌‌విరుద్దంగా ప్రవర్తిస్తే, ఆదేశాలకు కాదు, యావత్‌ ‌ప్రపంచానికే విపత్తులు సంభవిస్తాయి. నేడు విశ్వ మానవాళి ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. అలాగే పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేయాలని భావిస్తుంది. బ్రిక్స్‌‌ కూటమిలో సభ్య దేశమైన ఇరాన్‌ అద్యక్షుడు పెజిష్కియాన్‌ ‌కూడా ఈ సమావేశాలకు హాజరైన విషయం తెలుసు కదా. అమెరికా – ఇజ్రాయిల్‌ ‌దేశాల ఎడతెరిపి లేని జమిలి యుద్ధదాడులను ఈ ఇరాన్‌ ఎదుర్కొంటున్నది. జననష్టాన్ని, సంపద నష్టాన్ని భరిస్తున్నది. అందుకే అమెరికా వంటి కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలు ప్రపంచ ఆహార భద్రత, ప్రజల జీవనం, సంక్షేమంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆక్రోశం వెలిబుచ్చారు. ప్రపంచంలో ఏ ఒక్కరికి ఇతరుల భవిష్యత్తు నిర్ణయించే హక్కు లేదని ఆలోచించాలి. ముందుకు సాగాలి. శాంతి సుస్థిరతకు అందరం నడుం కట్టాలి. నిజాయితీగా పని చేయాలి.
కె.శాంతారావు, 99597 45723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -