– రాజ్యాంగం పుస్తకాన్ని గిరిజన విద్యా సంస్థల్లో ఉంచాలి : సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు వంద శాతం ఉతీర్ణత సాధించాలని పంచాయితీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గిరిజన గురుకులాల ప్రిన్సిపల్స్, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమాధికారులతో సోమవారం హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షా ఫలితాల కోసమే కాకుండా..వారి సర్వతోముఖాభివృద్ధికి ఆయా సంస్థల అధికారులు కృషి చేయాలని సూచించారు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులతో పాటు జనరల్ నాలెడ్జ్‌ను అభివృద్ధి చేయాలన్నారు. వీటితో పాటు నైపుణ్య శిక్షణ,కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పాఠ్యాంశాల్లో భాగంగా ఉండాలని సూచించారు. అధికారులందరూ గిరిజనుల జీవన నేపథ్యం, వారు ఎదుర్కొంటున్న సమస్యల అర్థం కావాలంటే క్షేత్ర స్థాయిలో పనిచేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ఆశించిన మేరకు అభివృద్ధి జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని ప్రతి గిరిజన విద్యా సంస్థలోనూ ఉంచాలనీ, విద్యార్థులకు దీనిపై పూర్తిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే దానిపై క్విజ్ పోటీలను నిర్వహించి విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా చూడాలన్నారు. వంద శాతం ఫలితాలు సాధిస్తామని అధికారులు, ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ అధికారులు మంత్రి సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులకు పౌష్టిక ఆహారంలో భాగంగా గిరిజన కార్పొరేషన్ తయారు చేసిన తేనెను ప్రతి రోజు 50 గ్రాములు ఉచితంగా ఇచ్చే పథకాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఎ.శరత్, గిరిజన సంక్షేమ డైరెక్టర్ ఇవి నరసింహ్మా రెడ్డి, గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి నవీన్ నికోలస్, ఆడిషనల్ డైరెక్టర్ వి. సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శంకర్, ట్రైకార్ జీఎం శంకర్ రావ్, జాయింట్ డైరెక్టర్‌లు కళ్యాణ్ రెడ్డి, సముజ్వల, డిప్యూటీ డైరెక్టర్‌లు, అధికారులు పాల్గొన్నారు.