వేతనాల పెంపు, పర్మినెంట్‌ కోసం

వేతనాల పెంపు, పర్మినెంట్‌ కోసం– ఫిబ్రవరి 16న జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె : జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వేతనాల పెంపు, పర్మినెంట్‌ కోసం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న కార్మికులంతా సమ్మెలోకి వెళ్లాలని జీహెచ్‌ఎంసీ కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. సమ్మె సన్నాహకంలో భాగంగా ఈ నెల 26 మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో వాహనాలతో నిరసన ర్యాలీ తీయాలనీ, ఫిబ్రవరి 6 మధ్యాహ్నం రెండు గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు సర్కిల్‌, జోన్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలనీ, ఫిబ్రవరి 16 సమ్మె విజయవంతం చేయాలని తీర్మానించింది. సోమవారం హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బారామారావు అధ్యక్షతన జేఏసీ సమావేశం జరిగింది. అందులో మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, సీఐటీయూ యూనియన్‌ నాయకులు జె. వెంకటేష్‌, పి. సుధాకర్‌, శ్రావణ్‌కుమార్‌, మల్లేష్‌, యాదమ్మ, మంగపతి, అంజయ్య, ఏఐటీయూసీ నాయకులు మద్దిలేటి, హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ నాయకులు అంజాద్‌, భిక్షపతి, బీఆర్‌టీయూ యూనియన్‌ నాయకులు కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు జేఏసీ బృందం సమ్మె నోటీసు అందజేసింది. కార్మిక చట్టాలను అమలు చేయాలనీ, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి కార్మికులను పర్మినెంట్‌ చేయాలనీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐని ఖచ్చితంగా అమలు చేయాలని కోరింది. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, కేటగిరీల వారీగా వేతనాలివ్వాలని డిమాండ్‌ చేసింది. ఆరు గ్యారంటీల్లో మున్సిపల్‌ కార్మికులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వయస్సు మీరిన, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఎలాంటి జాప్యం లేకుండా ఉద్యోగం ఇవ్వాలనీ, బయో మెట్రిక్‌ హాజరు పట్టీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని డిమాండ్‌ చేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలనీ, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం ఇవ్వాలని కోరింది. పారిశుద్ధ్య సేవల్లో ప్రయివేటు చర్యలను ఉపసంహరించాలనీ, రాంకీ తదితర ప్రయివేటు ఇంజినీరింగ్‌ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. గత ఒప్పందాల ప్రకారం జీహెచ్‌ఎంసీ కార్మికులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించాలని కోరింది.

Spread the love