– 26న రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్, వాహనాల ర్యాలీ
– ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్, సమ్మెను జయప్రదం చేయాలి
– ఎస్‌కేఎం, కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరును ఇంటింటికీ తీసుకెళ్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), కార్మిక సంఘాల జేఏసీ, వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రకటించాయి. బీజేపీని గద్దెదించడమే తమ లక్ష్యమని పిలుపునిచ్చాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్, వాహనాల ర్యాలీలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించాయి. వచ్చేనెల 16న గ్రామీణ బంద్, సమ్మెను జయప్రదం చేయాలని కోరాయి. సోమవారం హైదరాబాద్‌లోని నారాయణగూడ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్‌కేఎం, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌కేఎం కన్వీనర్లు టి సాగర్, పశ్యపద్మ, రాయల చంద్రశేఖర్, బిక్షపతి, జక్కుల వెంకటయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ బాలమల్లేష్ మాట్లాడుతూ చారిత్రాత్మక రైతు ఉద్యమ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని చేయలేదన్నారు. రుణమాఫీ చట్టం రూపొందించలేదని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించలేదని చెప్పారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. దేశంలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. బడ్జెట్‌లో నిధులకు కోత పెడుతున్నారనీ, ఎరువుల సబ్సిడీని తగ్గిస్తున్నారని చెప్పారు. 2013 భూసేకరణ చట్టానికి కేంద్రం తూట్లు పొడిచిందన్నారు. విద్యార్థి, యువజన, మహిళా, సామాజిక సంఘాలు, మేధావులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తామని అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించకపోవడం, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. మతోన్మాదానికి అండగా ఉంటారా?, ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా ఉంటారా? రాజకీయ పార్టీల నేతలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 26న హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు వాహనాల ర్యాలీని చేపడతామన్నారు. రైతులు, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను మోడీ ప్రభుత్వం పరిష్కరించకుండా వాటిని దారి మళ్లించటంలో భాగంగానే బాల రాముడి ప్రాణప్రతిష్ట పేరుతో మభ్యపెడుతున్నదని విమర్శించారు. మతం, రాముడు, నమ్మకం, భక్తి వ్యక్తిగతమైనవని అన్నారు. బీజేపీ పాలకులు మతాన్ని రాజకీయాలకు జోడించి హిందూత్వ నినాదాన్ని ముందుకు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు. తద్వారా మెజార్టీగా ఉన్న హిందువుల ఓట్లు పొందటానికి చేస్తున్న కుతంత్రం ఇది అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌ఎల్ పద్మ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, మహిళా విభాగం కన్వీనర్ బొప్పని పద్మ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కె కాంతయ్య, ఎస్‌కేఎం నాయకులు శంకర్, పల్లవి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ప్రభు లింగం తదితరులు పాల్గొన్నారు.