Monday, September 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘యూపీఐ’పై ప్రతిఘటన!

‘యూపీఐ’పై ప్రతిఘటన!

- Advertisement -

యుపిఐ చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండిఆర్‌) విధించే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయానికి దేశవ్యాప్తంగా ప్రతిఘటన వ్యక్తమవుతోంది. అక్టోబర్‌ 15 నుంచి రూ.2 వేలకు మించిన యుపిఐ వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండిఆర్‌ విధించడాన్ని పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు, చిన్న – మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పెట్రోల్‌ బంకుల్లో యుపిఐ చెల్లింపులను నిలిపివేస్తామని, లేదంటే ఆ భారాన్ని కస్టమర్లపైనే వేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈ రుసుము వినియోగ దారులపై భారం కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తు తం వ్యక్తుల మధ్య (P2P) చెల్లింపులకు ఇది వర్తించదని, వస్తువుల కొనుగోళ్లలో రూ.2 వేలలోపు లావాదేవీలకు కూడా ఎండిఆర్‌ ఉండదని ప్రభుత్వం వివరి స్తోంది. అయితే ఒకసారి రుసుముల విధా నానికి తలుపులు తెరిస్తే భవిష్యత్తులో మరిన్ని చార్జీలకు ఇది దారి తీయవచ్చనే ఆందోళన వినియోగ దారులు, వ్యాపా రుల్లో ఉంది.

గత ఆగస్టులో పార్లమెంటు ‘టాక్సేషన్‌ అండ్‌ అదర్‌ లాస్‌ (అమెండ్‌మెంట్‌) బిల్‌–2026’ను ఆమోదించింది. పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌లో మార్పులు చేసి, భవిష్యత్తులో నిర్దిష్ట ఎలక్ట్రానిక్‌ చెల్లింపులపై రుసుములు విధించేందుకు చట్టపరమైన అవకాశం కల్పించారు. అప్పుడే పార్లమెంటులో దీనిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాజ్యసభలో సిపిఎం సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ యుపిఐని ఉచిత ప్రజా మౌలిక సదుపాయంగా పేర్కొన్న ప్రభుత్వ గత వాదనలను ప్రస్తావిస్తూ, ఎండిఆర్‌ భారం చివరికి వినియోగదారులపై పడదనే హామీ ఏమిటని ప్రశ్నించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అప్పట్లో ఆ చట్టసవరణతో తక్షణం ఎలాంటి యుపిఐ ఛార్జీ విధించడం లేదని, ఎండిఆర్‌ విధానం ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. భవిష్యత్తులో అవసరమైతే రుసుము విధించేందుకు వీలు కల్పించే ‘ఎనేబ్లింగ్‌ ప్రొవిజన్‌’ కోసమే చట్టసవరణ అని వివరించారు. అయితే నెల వ్యవధిలోనే ఎండిఆర్‌ విధింపు నిర్ణయం రావడం ఇప్పుడు విమర్శలకు దారితీ స్తోంది. వ్యాపారులపై పడే అదనపు వ్యయం చివరికి ఏదో ఒక రూపంలో వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

2016 నోట్ల రద్దు సమయంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రభుత్వం విస్తృతంగా ప్రోత్సహించింది. ప్రజలు నగదు కొరతను ఎదుర్కొంటున్న సమయంలో యుపిఐ, డిజిటల్‌ చెల్లింపులను ప్రత్యామ్నాయంగా ముందుకు తెచ్చింది. ఉచిత డేటాతో జియోను విస్తరించిన విధానాన్ని కూడా ఈ సందర్భంలో విమర్శకులు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. మొదట వినియోగదారులను పెద్ద సంఖ్యలో ఆకర్షించిన తరువాత ఛార్జీలను పెంచినట్టే, యుపిఐ వినియోగం విస్తృతంగా పెరిగిన తరువాత ఇప్పుడు రుసుముల విధానాన్ని తీసుకొస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
ఎండిఆర్‌ ప్రభుత్వ పన్ను కాదని, చెల్లింపు వ్యవస్థలోని బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, యాప్‌ల మధ్య పంచుకునే రుసుమని ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 96 శాతం P2M లావాదేవీలు ఈ నిర్ణయం పరిధిలోకి రావని కూడా వివరిస్తోంది. అయితే రూ.2 వేలకు మించిన లావాదేవీలు సంఖ్యాపరంగా సుమారు 4 శాతమే అయినప్పటికీ, P2M లావాదేవీల మొత్తం విలువలో దాదాపు 67 శాతం వాటా కలిగి ఉన్నాయి.

గత నెలలో యుపిఐ ద్వారా 2,450 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ సుమారు రూ.29.82 లక్షల కోట్లు. ఇంత భారీ వ్యవస్థలో పరిమిత లావాదేవీలకే 0.4 శాతం రుసుము వర్తించినా, సంవత్సరానికి సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరవచ్చని అంచనా. మరోవైపు యుపిఐని ఉచితంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.8,730 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇచ్చింది. ఇప్పుడు యుపిఐపై రుసుముల విధానం అమలైతే, డిజిటల్‌ చెల్లింపులకు అలవాటుపడిన కోట్లాది మంది ప్రజలపై పరోక్షంగా ఆర్థిక భారం పడే అవకాశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -