Monday, September 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజితెలంగాణలో భూసమస్యకు పరిష్కారమెప్పుడు?

తెలంగాణలో భూసమస్యకు పరిష్కారమెప్పుడు?

- Advertisement -

తెలంగాణ చరిత్రలో “భూమి, భుక్తి, విముక్తి” కోసం జరిగిన రైతాంగ పోరాటానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దొరలు, భూస్వాముల పెత్తనం, వెట్టి చాకిరీ, భూమిపై హక్కుల కోసం సాగిన ఆ పోరాటం కేవలం ఒక కాలానికి సంబంధించినది కాదు. రైతు తన భూమిపై హక్కును కోల్పోతే అతని జీవనాధారమే దెబ్బతింటుందనే వాస్తవాన్ని అది చాటిచెప్పింది. చాకలి ఐలమ్మ వంటి ధైర్యవంతుల పోరాటం ప్రజలకు ఆత్మగౌరవాన్ని, తమ భూమి కోసం నిలబడే స్ఫూర్తిని ఇచ్చింది. “దున్నేవాడిదే భూమి” అనే నినాదం కూడా సాగు చేస్తున్న రైతుకు భూమిపై హక్కు ఉండాలనే ప్రాథమిక న్యాయాన్ని ప్రతిబింబించింది. అయితే రైతాంగ పోరాటం జరిగి దశాబ్దాలు గడిచినా తెలంగాణలో రైతు తన సొంత భూమి కోసం రికార్డుల వెంట, కార్యాలయాల వెంట, అధికారుల వెంట తిరగాల్సిన పరిస్థితి ఎందుకు కొనసాగుతోంది? భూమి ఎవరిదో స్పష్టంగా చెప్పలేని రికార్డులు ఎందుకు ఉన్నాయి? వాస్తవంగా సాగు చేస్తున్న రైతు పేరు భూ రికార్డుల్లో లేకపోవడానికి కారణం ఏమిటి? ఒకసారి ప్రభుత్వం తప్పుగా నమోదు చేసిన భూమిని తిరిగి సరిచేయడానికి రైతు సంవత్సరాల తరబడి ఎందుకు ఎదురుచూడాలి?

ఇవి కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించిన సాంకేతిక సమస్యలు కావు. ఒక రైతు భూమి రికార్డులో తప్పు జరిగితే దాని ప్రభావం అతని కుటుంబ జీవితం మొత్తం మీద పడుతుంది. రుణం తీసుకోవడం, పంట సాగు చేయడం, వారసత్వ హక్కులు నమోదు చేయడం, భూమిని బదలాయించడం-ప్రతి విషయంలో సమస్య ఎదురవుతుంది. అన్నదమ్ముల మధ్య జరిగిన భూ పంపకాలు రికార్డుల్లో నమోదు కాకపోవడం, వారసత్వ భూములు సరైన వ్యక్తుల పేర్లకు బదలాయింపు కాకపోవడం, సర్వే నంబర్లు మరియు సరిహద్దుల్లో తేడాలు ఉండటం వంటి సమస్యలు అనేక కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. భూమి రికార్డులను సులభతరం చేసి సమస్యలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థపై కూడా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. వాస్తవ భూ యజమాని పేరు బదులుగా మరొకరి పేరు నమోదవడం, భూములు నిషేధిత జాబితాల్లోకి వెళ్లడం, రికార్డుల్లో ఉన్న వివరాలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఒక రైతు తన భూమి తనదేనని నిరూపించుకోవడానికి మళ్లీ రెవెన్యూ కార్యాల యాల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల భూ సమస్య పరిష్కారం కాకుండా మరింత క్లిష్టమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో భూ రికార్డుల్లోని లోపాలను ఉపయోగించుకుని అక్రమ ఆక్రమణలు, నకిలీ లేదా తప్పుదోవ పట్టించే రికార్డులు, భూ లావాదేవీలలో మోసాలు జరిగాయనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధం లేని భూములకు కూడా రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరితే నిజమైన రైతుకు నష్టం జరుగుతుంది. అదే సమయంలో వాస్తవంగా భూమిని సాగు చేస్తున్న రైతు తన హక్కును నిరూపించుకోవాల్సి వస్తే, అది పాలనా వ్యవస్థలోని లోపాన్ని సూచిస్తుంది.

ప్రస్తుతం భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం కూడా సమస్య ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తోంది. భూమి విషయంలో ఇంత పెద్ద స్థాయిలో వివాదాలు, పెండింగ్ దరఖాస్తులు ఉంటే, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడం మాత్రమే సరిపోతుందా? లేక భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మొత్తం భూ రికార్డు వ్యవస్థనే శాశ్వతంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా? ఇక్కడే అత్యంత ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో భూమికి సంబంధించి సమగ్ర రీ-సర్వే ఎందుకు జరగలేదు? నిజాం కాలం నుంచి వచ్చిన పాత సర్వే రికార్డులు, తరువాతి మార్పులు, వారసత్వ బదలాయింపులు, భూ పంపకాలు, సరిహద్దు మార్పులు-ఇవన్నింటినీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒకసారి సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం లేదా? ఈరోజు ఉపగ్రహ సాంకేతికత, డిజిటల్ మ్యాపింగ్, ఆధునిక సర్వే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణలో ప్రతి అంగుళం భూమిని ఖచ్చితంగా కొలిచి, సరిహద్దులను గుర్తించి, వాస్తవ హక్కుదారులను నిర్ధారించి, భూమికి సంబంధించిన పూర్తి డిజిటల్ రికార్డును రూపొందించడం ఎందుకు సాధ్యం కాకూడదు? ఒక రైతుకు చెందిన మొత్తం భూమికి స్పష్టమైన సర్వే వివరాలు, ఖచ్చితమైన మ్యాప్, సరిహద్దులు, హక్కుదారుడి వివరాలతో కూడిన సమగ్ర భూ రికార్డు అందిస్తే భవిష్యత్తులో అనేక వివాదాలకు శాశ్వతంగా తెరపడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో భూ రికార్డుల్లో తప్పు జరిగితే దాన్ని సరిచేసే విధానం కూడా రైతుకు అందుబాటులో ఉండాలి. రైతు ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరగాల్సిన అవసరం లేకుండా, దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉండాలి. ఏ అధికారి వద్ద ఫైలు ఉందో, ఎందుకు పెండింగ్‌లో ఉందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో స్పష్టంగా తెలియాలి. తప్పు నమోదు చేసినప్పుడు దాన్ని సరిచేసే బాధ్యత కూడా వ్యవస్థపైనే ఉండాలి, రైతుపై కాదు.

ప్రజల సమస్యలపై చర్చించి వాటికి పరిష్కార మార్గాలను రూపొందించాల్సిన వేదికల్లో అసెంబ్లీ ఒకటి. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కూడా వివిధ అంశాలపై చర్చ జరిగింది. కానీ తెలంగాణలో లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటి? అనే ప్రశ్నకు స్పష్టమైన, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? భూ సమస్యలపై ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి? వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు? రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే ఎప్పుడు ప్రారంభిస్తారు? డిజిటల్ భూ మ్యాపింగ్‌ను ఎప్పుడు పూర్తిచేస్తారు? తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన రైతుల భూములను ఎలా గుర్తించి సరిచేస్తారు? వారసత్వం, భూ పంపకాలు, సర్వే సరిహద్దులు, అసైన్‌డ్ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు వంటి వివాదాలను పరిష్కరించడానికి ఏకీకృత విధానం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు అసెంబ్లీలో స్పష్టమైన సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు ఎప్పుడైనా చర్చలో భాగం కావచ్చు. కానీ ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకున్న ప్రధాన కారణం ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడం. రైతు తన భూమి కోసం సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎలా ఇవ్వాలన్నదే అసెంబ్లీలో ప్రధాన చర్చ కావాలి.

భూమి సమస్యను ఒక ప్రభుత్వం మీద, ఒక పార్టీ మీద నెట్టివేసి ముందుకు వెళ్లడం వల్ల రైతు సమస్య పరిష్కారం కాదు. గతంలో జరిగిన తప్పులు ఏవైనా ఉంటే వాటిని గుర్తించి సరిచేయడం, ప్రస్తుత సమస్యలను పరిష్కరించడం, భవిష్యత్తులో మళ్లీ అవే సమస్యలు రాకుండా వ్యవస్థను మార్చడం-ఈ మూడు పనులు ఒకేసారి జరగాలి. భూమి రైతుకు కేవలం ఆస్తి కాదు. అది అతని జీవనాధారం, కుటుంబ భద్రత, భవిష్యత్తు, ఆత్మగౌరవం. అందుకే భూమి రికార్డులలో చిన్న తప్పు కూడా రైతు జీవితంలో పెద్ద సంక్షోభంగా మారుతుంది. తెలంగాణ రైతాంగ పోరాటం భూమి హక్కు కోసం ప్రజలు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారనే చరిత్రను మనకు అందించింది. నేటి తరంలో ఆ పోరాటం మళ్లీ సంఘర్షణ రూపంలో కొనసాగాల్సిన అవసరం లేదు. రైతు తన భూమిని కాపాడుకోవడానికి ప్రభుత్వంతో పోరాడాల్సిన పరిస్థితి కాకుండా, ప్రభుత్వ వ్యవస్థే రైతు భూమిని కాపాడే స్థాయికి చేరాలి. అందుకు మార్గం స్పష్టమే-సమగ్ర భూ రీ-సర్వే,కచ్చితమైన డిజిటల్ మ్యాపింగ్, పారదర్శక భూ రికార్డులు, వేగవంతమైన వివాద పరిష్కారం, అధికారుల జవాబుదారీతనం, రైతుకు సులభమైన న్యాయం. ఇది మరో ఎన్నికల హామీగా కాకుండా, తెలంగాణలో ప్రతి రైతు భూమికి శాశ్వత భద్రత కల్పించే సమగ్ర భూ సంస్కరణగా అమలు చేయాల్సిన సమయం వచ్చింది.

డా.మండ్ల రవి, 9177706626

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -