నిధులు విడుదల చేసినా నిర్లక్ష్యమెందుకు?
రైతుల ఖాతాల్లో జమ చేసే బాధ్యత కలెక్టర్లదే : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూసేకరణ,పునరావాసం–పునర్వ్యవస్థీకరణకు విడుదల చేసిన రూ.813 కోట్లను జాప్యం లేకుండా సంబంధిత రైతులకు అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నిధులు విడుదలైనప్పటికీ అవి ప్రభుత్వ ఖాతాల్లోనే ఉండిపోవడం, మరోవైపు భూసేకరణ పూర్తికాక సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపో వడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రాజెక్టుల పురోగతిపై సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి హైదరాబాద్‌లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటివరకు భూసేకరణ, పునరావాసం–పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రూ.3,101 కోట్ల విలువైన టోకెన్లు సమర్పించగా, ప్రభుత్వం రూ.2,504 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో చెల్లింపులకు పెండింగ్‌లో ఉన్న రూ.813 కోట్లలో రూ.502 కోట్లు భూసేకరణ అధికారుల వద్ద, మరో రూ.311 కోట్లు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్నట్లు తెలిపారు. అధికారుల వివరణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డుల ప్రక్రియను పూర్తి చేసి పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అవార్డు ప్రకటించిన తర్వాత కూడా పరిహారం చెల్లింపులు ఆలస్యమైన కేసుల్లో నిబంధనల ప్రకారం రైతులకు వడ్డీ చెల్లించాలని ఆదేశించారు. కోర్టు కేసులు, యాజమాన్య వివాదాల కారణంగా నిలిచిపోయిన భూసేకరణ కేసులన్నింటినీ ప్రత్యేకంగా నమోదు చేసి, న్యాయనిపుణులతో చర్చించి వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్లగొండ జిల్లాలోని చింతపల్లి రిజర్వాయర్, పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం, నెల్లికల్లు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో జాప్యంపై ఆరా తీశారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, భూసేకరణ కమిషనర్ శివకుమార్‌నాయుడు, జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల భూ సేకరణకు రూ.813 కోట్ల పరిహారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



