మధ్యంతరం వేళ రిపబ్లికన్లపై
సెటైర్లు వేస్తున్న ఓటర్లు
ట్రంప్ వాణిజ్య విధానాలపై శ్రామిక వర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత
ప్రతీకార సుంకాలను ఎండగడుతున్న ప్రజానీకం
వాషింగ్టన్ : అమెరికాలో మధ్యంతర ఎన్నికల కోసం ఇప్పటికే బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికలు అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్లకు అగ్నిపరీక్షగా నిలవబోతున్నాయి. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఘర్షణ పూరితమైన వాణిజ్య విధానం డెమొక్రాట్ల పాలిట వరంగా మారింది. ట్రంప్ విధానాలను సమర్థించడానికి రిపబ్లికన్లు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక ఎజెండాను కార్మిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. శ్రామిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాలలో ఈ వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తోంది. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను డెమొక్రాట్లతో పాటు అధికార రిపబ్లికన్లలో చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎన్ఎన్, ఇతర మీడియా సంస్థలు నిర్వహించిన అనేక సర్వేలలో…ట్రంప్ విధించిన సుంకాలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం మాట అటుంచి కీడు చేశాయని చాలా మంది అమెరికన్లు కుండబద్దలు కొట్టారు. శ్రామిక వర్గ శ్వేతజాతీయుల ఓటర్లు కూడా ఈ సుంకాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.
సడలుతున్న పట్టు
ఇప్పటి వరకూ ట్రంప్ కూటమికి వెన్నుదన్నుగా నిలిచిన శ్రామిక వర్గంపై రిపబ్లికన్ల పట్టు క్రమేపీ సడలిపోతోంది. శ్రామిక వర్గంలోనూ, గ్రామీణ ప్రాంతాలలోనూ డెమొక్రాట్లు పుంజుకుంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్టా)పై ట్రంప్ వ్యక్తం చేసిన సందేహాలు, వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు ఆయన సూచించిన ఇతర చర్యలు శ్రామిక వర్గంపై ప్రభావం చూపి 2016 ఎన్నికలలో ఆయన విజయానికి తోడ్పడ్దాయి. అయితే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు దేశాలపై ఆయన విధించిన ప్రతీకార సుంకాలు శ్రామిక వర్గానికి పట్టున్న పలు ప్రాంతాలలో రిపబ్లికన్లు మద్దతు కోల్పోయేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఓటర్లు ఇక చాలు…థ్యాంక్స్ అంటూ ట్రంప్‌పై ఓటర్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
మెకిన్లీని మించి…
వాణిజ్య భాగస్వాములపై 1890 ప్రాంతంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు మెకిన్లీ సుంకాలు విధించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ట్రంప్ అందుకు పూనుకున్నారు. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలను విధించడంలో ఆయన మెకిన్లీనే మించిపోయారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఆధునిక చరిత్రలో ట్రంప్ మాదిరిగా సుంకాల బెదిరింపును ఇంత ఎక్కువగా ఉపయోగించుకున్న అధ్యక్షుడు మరొకరు లేరని వారు వేలెత్తి చూపారు.
నాడు ఓకే…నేడు నో
వాణిజ్యంపై ట్రంప్ అవలంబించిన కఠిన వైఖరి 2016లో హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించడానికి తోడ్పడింది. ఆ సమయంలో శ్రామిక వర్గం ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చింది. శ్రామికులకు తానే ఆశాదీపం అని ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తన పూర్వ అధ్యక్షులైన జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ల స్వేచ్ఛా వాణిజ్య దృక్పథం నుంచి వైదొలిగారు. నాఫ్టాను సమీక్షించారు. పాన్-ఏషియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేశారు. వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియంతో పాటు చైనా నుంచి వచ్చే అనేక ఉత్పత్తులపై సుంకాలు విధించారు.
అయితే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఆ విధానాలను మరింత తీవ్రతరం చేశారు. సుంకాలు విధించడం, వాటిని ఉపసంహరించడం, తిరిగి విధించడం, బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. మిత్రదేశాలైన కెనడా, యూరోపియన్ యూనియన్ను కూడా ఆయన వదలలేదు. దీంతో నాడు ఆయనకు మద్దతు తెలిపిన వర్గాలే ఇప్పుడు దూరమవుతున్నాయి.
మేలు కంటే కీడే ఎక్కువ
ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఓ పోల్‌లో ట్రంప్ విధించిన సుంకాలను 60 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకించారు. ట్రంప్ సుంకాలు తమకు మేలు కంటే కీడే ఎక్కువగా చేశాయని ఏప్రిల్‌లో జరిపిన మరో సర్వే తెలిపింది. కార్మిక వర్గంతో పాటు తయారీ రంగంపై ఆధారపడిన విస్కాన్, ఒహాయో రాష్ట్రాలలో ఇటీవల నిర్వహించిన పోల్‌లో సుమారు 60 శాతం మంది ప్రతీకార సుంకాలను వ్యతిరేకించారు. కెనడాపై ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య పోరుపై సరిహద్దు రాష్ట్రాలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కళాశాల విద్య కూడా చదవని శ్వేతజాతీయులలో ఈ వ్యతిరేకత చాలా స్పష్టంగా కన్పిస్తోంది. నల్లజాతీయులు, హిస్పాక్లు (అమెరికాలో నివసిస్తున్న స్పెయిన్ దేశస్థులు. వీరు స్పాక్ భాష మాట్లాడతారు) కూడా సుంకాలను వ్యతిరేకించడం గమనార్హం. కళాశాల విద్యను అభ్యసించిన శ్వేతజాతీయులలో 70 శాతం వ్యతిరేకత కన్పించింది. ట్రంప్ మద్దతుదారులు సైతం సుంకాలను తీవ్రంగా తప్పుపట్టడం విశేషం.
ఇక చాలు..థ్యాంక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



