నవతెలంగాణ-మల్హర్ రావు
అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు రాగిజావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఏడాది గడుస్తోంది. కానీ ఇప్పటివరకు అది అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పలుమార్లు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సైతం నిర్వహించారు. అయినా మార్గదర్శ కాలు రాకపోవడంతో కేంద్రాల్లో రాగి జావ అందని ద్రాక్షగా మారింది.
మండలంలో 38 అంగన్వాడీ కేంద్రాలు
మండలంలో తాడిచెర్ల, వల్లెంకుంట రెండు సెక్టార్లు ఉన్నాయి. వీటి పరిధిలో 38 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో గర్భిణీలు 178, బాలింతలు 128, చిన్నారులు 1156 ఉన్నారు. చిన్నారులకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. గత రెండేళ్లుగా చిన్నారులకు ఏకరూప దుస్తులు కూడా అందిస్తున్నారు. పౌష్టికాహారంతో పాటు రాగి జావ ఇస్తే వారి ఆరోగ్యం మరింత మెరుగుపడుతోందని చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
నిధుల కొరత కారణంగానే ఇది అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో చిన్నారికి ఎంత మొత్తంలో రాగి జావ అందించాలనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రం ఒక్కొక్కరికి రోజుకు 200 నుంచి 250 మిల్లీ లీటర్ల జావ అందించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
పోషకాలు అధికం..
100 గ్రాముల రాగుల్లో 328 క్యాల రీల శక్తి ఉంటుంది. ఐరన్ 3.9 గ్రాములు, సోడియం 11 మి.గ్రా,కాల్షియం 344 మి.గ్రా,పొటాషియం 408 మి.గ్రా ఉంటాయి. కాల్షియంతో ఎముకలు గట్టిపడుతాయి. ప్రోటీన్, పైబర్ తోపాటు ఐరన్ అందడంతో పిల్లల్లో రక్త హీనత సమస్య దరిచేరదు. సి, విటమిన్ రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. మాంసకృతులు లభిస్తాయి. కండరాల పుష్టికి రక్తం తయారీకి రాగిజావ ఉపయోగపడుతుంది.



