నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రిమ్స్ జనరల్ ఆస్పత్రిలోని చిన్నారుల విభాగంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎన్‌సీయూ (SNCU) వార్డులో సోమవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఏసీలో తలెత్తిన లోపం కారణంగా మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. వార్డులో ఉన్న చిన్నారులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ ఘటనలో మొత్తం 24 మంది చిన్నారులు ఉండగా, 26 వారాల ప్రీ-టర్మ్ శిశువు తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 23 మంది చిన్నారుల్లో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు, మిగతా చిన్నారులకు వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వెంటిలేటర్, సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అవసరమైన చిన్నారులను ఆయా సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ఏసీలో తలెత్తిన సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, ప్రమాదానికి దారితీసిన కారణాలను అధికారులు నిర్ధారించనున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్.రాత్రి అక్కడే ఉండి పర్యవేక్షించారు.



