నవతెలంగాణ-మద్నూర్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, అట్రాసిటీస్ నిరోధక చట్టం సమర్థవంతమైన అమలుపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీఎస్, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
త్వరితగతిన విచారణ: ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వేధింపులు లేదా దాడుల ఫిర్యాదులు వచ్చిన వెంటనే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. కేసుల దర్యాప్తులో అలసత్వాన్ని ఉపేక్షించబోం.
బాధితులకు భరోసా: ప్రభుత్వ పరిహారం, పునరావాసం నిర్ణీత గడువులోగా బాధితులకు చేరేలా పర్యవేక్షించాలి.
ప్రత్యేక కోర్టుల బలోపేతం: విచారణలో జాప్యం జరగకుండా ప్రత్యేక సెషన్స్ కోర్టుల పనితీరును వేగవంతం చేయాలి.
సమగ్ర అభివృద్ధి: చట్టపరమైన రక్షణతో పాటు విద్య, ఉపాధి రంగాల్లో అట్టడుగు వర్గాలకు సంపూర్ణ ప్రాధాన్యత. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో, భద్రతతో జీవించే వాతావరణాన్ని కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.



