వినాయక ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో విగ్రహాలను ప్రతిష్టించి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా కొనసాగు తోంది. అయితే ప్రతి ఏడాది నిమజ్జనం తర్వాత చెరువులు, సరస్సులు, నదులు, ఇతర నీటి వనరుల్లో పేరుకు పోతున్న వ్యర్థాలు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలు, కృత్రిమ రంగులు, ప్లాస్టిక్, థర్మాకోల్, పూజా సామగ్రి, ఇతర అలంకరణ వస్తువులు నీటిలో కలవడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోంది. మట్టి విగ్రహాలు సహజంగా క్రమంగా కరిగిపోయే అవకాశం ఉన్నప్పటికీ, పీఓపీ అంత సులభంగా నీటిలో కలిసిపోదు. విగ్రహాలకు ఉపయోగించే కొన్ని కృత్రిమ రంగుల్లో హానికరమైన రసాయనాలు, భారలోహాలు ఉండే అవకాశం ఉంది. ఇవి నీటిలో చేరినప్పుడు నీటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. నిమజ్జనం తర్వాత నీటిలో మిగిలే వ్యర్థాలు కేవలం చెరువు అందాన్ని దెబ్బతీయడమే కాదు, అక్కడి జీవవ్యవస్థకు కూడా సమస్యగా మారవచ్చు.
ఒక చెరువు నీటిలో చేపలు, వివిధ రకాల సూక్ష్మజీవులు, వృక్షజాలం, నీటిపై ఆధారపడే పక్షులు జీవిస్తుంటాయి. నీటి నాణ్యతలో మార్పు వచ్చినప్పుడు ఈ జీవవ్యవస్థ మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నీటిలోని కాలుష్యకారక పదార్థాలు కొన్ని జీవుల శరీరాల్లో పేరుకుపోయి ఆహార శృంఖలిలోకి ప్రవేశించే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల నిమజ్జనం తర్వాత నీటి పైభాగంలో కనిపించే వ్యర్థాల కంటే, నీటి అడుగున మరియు జీవవ్యవస్థలో జరిగే మార్పులు మరింత ఆందోళన కలిగించే అంశం.నీటి కాలుష్యం ప్రభావం అక్కడితో ఆగదు. చెరువులు, సరస్సులు వంటి నీటి వనరులు వ్యవసాయం, పశుపోషణ, భూగర్భజలాల పునరుత్పత్తి, ప్రజల జీవనాధారాలతో సంబంధం కలిగి ఉంటాయి. నీటి వనరుల నాణ్యత దెబ్బతింటే వాటిని శుద్ధి చేయడానికి అదనపు ఖర్చు, వనరులు అవసరమవుతాయి. కలుషిత నీరు వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు ఉపయోగించినప్పుడు దాని ప్రభావం విస్తృతంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యను కేవలం పండుగ ముగిసిన తర్వాత వ్యర్థాలను తొలగించే కార్యక్రమంగా చూడకూడదు. పండుగకు ముందే కాలుష్య నియంత్రణ చర్యలు ప్రారంభించాలి.
పీఓపీ విగ్రహాల తయారీ, విక్రయాలపై ఉన్న నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలి. మట్టి విగ్రహాల తయారీకి ప్రోత్సాహం ఇవ్వాలి. పర్యావరణహిత రంగులను ప్రోత్సహించాలి. నిమజ్జనం కోసం ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేసి, వాటిలోనే విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలి. నిమజ్జనం అనంతరం విగ్రహాల అవశేషాలు, ప్లాస్టిక్, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను నీటిలోనే వదిలేయకుండా ప్రత్యేకంగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి. నీటి వనరుల నాణ్యతను నిమజ్జనానికి ముందు, తర్వాత పర్యవేక్షించడం ద్వారా కాలుష్య స్థాయిని గుర్తించవచ్చు. స్థానిక సంస్థలు, కాలుష్య నియంత్రణ సంస్థలు, ఉత్సవ నిర్వాహకులు కలిసి పనిచేయడం అవసరం.అదే సమయంలో ప్రజల బాధ్యత కూడా కీలకమే. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాలు, అలంకరణ సామగ్రి, ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలి. పూజా సామగ్రిని నీటిలో నేరుగా వేయకుండా ప్రత్యేకంగా సేకరించాలి. నిమజ్జనం అంటే నీటి వనరులో వ్యర్థాలను వదిలేయడం కాదనే అవగాహన పెరగాలి.పండుగలు ప్రతి ఏడాది వస్తాయి. కానీ చెరువులు, నదులు, సరస్సులు మనకు శాశ్వతంగా అవసరం. ఒక నీటి వనరును కాలుష్యానికి గురిచేసిన తర్వాత దాన్ని మునుపటి స్థితికి తీసుకురావడం అంత సులభం కాదు. అందుకే ఉత్సవాల నిర్వహణలో ఆనందంతో పాటు పర్యావరణ బాధ్యతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.వినాయక నిమజ్జనం తర్వాత నీటి వనరులు వ్యర్థాల నిల్వ కేంద్రాలుగా మారకుండా చూడాలి. పండుగ ముగిసినప్పుడు కాలుష్యం మొదలుకాకుండా, పర్యావరణ పరిరక్షణకు కొత్త ఆలోచన మొదలు కావాలి.
ప్రశాంత్ ఆత్మకూరి, 7989421153
నిమజ్జనం తర్వాత మిగిలేది కాలుష్యమేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



