సుమారు 65 లక్షల టన్నుల సేకరణే లక్ష్యం : ఏర్పాట్లు చేస్తున్న సివిల్ సప్లయ్ శాఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో మొదలయ్యే ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు, అంతరాయాలు రాకుండా స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ (ఎస్‌హెచ్‌టీ) వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. రైతులకు ధాన్యం బోనస్ దక్కాలంటే, కచ్చితంగా అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ ఉండాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీఎస్) ద్వారా సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా ఇప్పటికే గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, రవాణా వాహనాలను సిద్ధం చేసింది.
హమాలీలు… నిల్వ సామర్థ్యంపై దృష్టి
లక్షల టన్నుల ధాన్యం వస్తుండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకునేందుకు హమాలీలు, రవాణాతోపాటు గోదాముల సామర్థ్యంపై దృష్టి సారించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు ఎక్కించేందుకు, దించేందుకు తగినంత మంది హమాలీలు ఉండేలా చర్యలు తీసుకోంటోంది. గోదాముల కొరత రాకుండా ఉండటానికి, వాడకంలో లేని రైస్ మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, ఇతర ప్రత్యామ్నాయ స్థలాలను సైతం ముందుగానే సిద్ధం చేయాలని క్ష్రేత్రస్థాయి అధికారులను సివిల్ సప్లయ్ శాఖ అప్రమత్తం చేస్తోంది.
ఫిజికల్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ కీలకమే
మిల్లింగ్ దశలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఒక కొత్త ‘ఫిజికల్ వెరిఫికేషన్ (పీవీ)’ మొబైల్ యాప్‌ను ఉపయోగించనుంది. మండల, జిల్లా స్థాయి అధికారులు ఈ యాప్ ద్వారా ప్రతి వారం రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేయనుంది. రైస్ మిల్లర్లు లేదా కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జిలు తప్పుడు రికార్డులు సృష్టించినా, లెక్కల్లో మోసం చేసినా.. నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను మరింత పక్కాగా చేయడానికి, ధాన్యం తరలించే ప్రతి వాహనానికి కచ్చితంగా జీపీఎస్ (జీపీఎస్-వీఎల్‌టీఎస్) ట్రాకింగ్ సిస్టమ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. దీని వల్ల కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు వెళ్లే దారిలో ధాన్యం ఎక్కడా పక్కదారి పట్టకుండా ట్రాకింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్ని జిల్లాల పౌర సరఫరాల అధికారులు, మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఆ సన్నరకాలకే రూ. 500 బోనస్
ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్‌ఎం 7715 వంటి ఏడు సన్న బియ్యం రకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ రకాలను పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే రైతుల ఖాతాల్లో నేరుగా బోనస్ డబ్బులు జమ చేయనుంది. రైతులు తప్పకుండా అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ కలిగి ఉండటంతోపాటు ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు, ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమను కొలిచే యంత్రాలు, క్లీనర్లు, ధాన్యం ఆరబెట్టే యంత్రాలను ముందుగానే అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.



