Wednesday, September 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజూరాల.. నీరెలా?

జూరాల.. నీరెలా?

- Advertisement -

డ్యాం వద్ద సాగునీటి సెగ
వార బంధీ అన్నారు…నీటిని నిలిపేశారు
ఆయకట్టుకు నీరందని పరిస్థితి
ఆందోళనలో అన్నదాత

నవతెలంగాణ- మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
​జూరాల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ఉన్నాయి. ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. అయినా ఆయకట్టు పరిధిలో పంటలకు సాగునీటిని అధికారులు విడుదల చేయట్లేదు. కనీసం వారబంధీ పద్దతిలోనైనా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. జూరాలలో సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ ఎల్‌నినో ప్రభావం వల్ల తాగునీటి అవసరాలకు సరిపోవనీ అందుకే పంట పొలాలకు సాగునీటిని వదలడం వీలుకాదని మంత్రి చేసిన ప్రకటన రైతుల్లో ఆందోళన పెంచింది. దీంతో రైతులు రోడ్డెక్కారు.సాగునీటిని విడుదల చేయాలని రాజకీయ పార్టీలు సైతం రైతుల పక్షాన ఆందోళనకు దిగాయి. జూరాల పరిధిలో రబీలో ఎప్పుడైనా చివరి ఆయకట్టుకు సాగునీటి సమస్య ఉంటుంది. అయితే, వర్షాకాలం పంటలకూ సాగు నీరు అందడం లేదు. వర్షాలు లేకపోయినా ఎగువ కర్నాటక నుంచి వరదలు వస్తుండటంతో జూరాలలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని పంటలకు వదిలితే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.

జూరాలలో నీళ్లున్నాయి..
అధికారిక లెక్కల ప్రకారం.. జూరాల రిజర్వాయర్‌ ‌లో 8.05 టీఎంసీల నీటినిల్వ ఉంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 8.15 టీఎంసీలు. ఇప్పటికీ పై నుంచి వరదలు వస్తూనే ఉన్నాయి. జూరాల ఆధారంగా 1.15 లక్షల ఎకరాల్లో వరి, మరో 50 వేల ఎకరాల్లో పత్తి, వేరుశనగ, మిర్చి పంటలను సాగు చేశారు. ప్రతి ఏటా ఖరీఫ్‌‌లో పూర్తిస్థాయి పంట వచ్చేది. రబీలో మాత్రం చివరి ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఏర్పడేవి. ఈ ఏడాది వర్షాకాలం మధ్యలోనే ఎల్ నినో ప్రభావంతో నీటి సమస్య ఏర్పడింది. జూరాల నీటిని సాగునీటికి వదిలితే రాబోయే వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ లో రైతులు పంటలు వేసుకునే ముందే ఎల్ నినో ప్రభావం ఏడాదంతా ఉంటుందని అధికారులకు తెలుసు. రైతులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి అవగాహన కలిపిస్తే వరి సాగు చేసుకునే వారు కాదేమో. విత్తనాలు ఇచ్చి, ఎరువులు సరఫరా చేసి వంద శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు నీళ్లు ఇవ్వలేమంటే ఎక్కడికి పోతామని రైతులు అంటున్నారు.

వార బంధీ.. రైతుల రందీ
జూరాల రిజర్వాయర్ కింద ప్రతి ఏటా యాసంగిలో వార బంధీ ప్రకటిస్తారు. ఈ పద్దతిలో వారానికి ఒకసారి సాగునీటిని వదులుతారు. ఈ విధానం ద్వారా ఆరుతడి పంటలు పండుతాయి. అయితే ఈ ఏడాది ఖరీఫ్ లోనే వారబంధీ అమలు చేసే పరిస్థితులు దాపురించాయి. వరి పైరుకు వారబంధీ పద్దతిలో నీటి తడులు పెడితే దిగుబడులు రావు. పైగా పైర్లు ఎండిపోతాయి. అయితే ఆ వారబంధీ కూడా అమలు చేయడం లేదు. 15 రోజుల క్రితం వారబంధీ పద్ధతిలో నీటిని వదులుతామని చెప్పారు. కానీ ఇప్పటివరకు నీటిని వదలడానికి అధికారులు సిద్ధపడట్లేదు.

​నీటి కోసం రాజకీయ పార్టీల ఆందోళన
జూరాల ఆయకట్టు రైతులకు భరోసా ఇస్తూ సీపీఐ(ఎం), ప్రజాసంఘాలు, బీఆర్‌ఎస్, రైతు సంఘాలు అన్నదాత పక్షాన నిలబడి సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. రెండు రోజుల కిందట రైతులే స్వయంగా జూరాల ఎడమ కాల్వ గేట్లు తెరిచి వీటిని వదిలారు. రైతులకు సీపీఐ(ఎం) వివిధ రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి. అయితే రాత్రికి రాత్రే పోలీసుల రక్షణతో వెళ్లిన అధికారులు తెరిచిన గెట్లను మూసి వేశారు.

​జూరాలను సాగునీటి కోసమే నిర్మించారు : లక్ష్మయ్య, రైతు, నందిమల్ల, వనపర్తి జిల్లా
జూరాలను సాగునీటి కోసమే నిర్మించారు. తాగునీటి కోసం ఇతరత్రా వనరులు ఉపయోగించుకోవాలి. అంతే తప్ప సాగు నీటిని వదిలేసి తాగునీటి కోసమని పంటలకు వదలకపోవడం సరికాదు .

​​ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి : ఆర్డీవో సుబ్రమణ్యం, వనపర్తి
నీటిని కాల్వలకు ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. డివిజన్ బాధ్యులుగా మేము ఇక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. పై నుంచి ఆదేశాలు రాగానే సాగునీరు కిందికి వదులుతాం. దీనిని రైతులు గమనించాలి.

జూరాల నీటి విడుదలకు కర్నాటకతో ‌రాయబారం
బెంగళూరుకు మంత్రులు జూపల్లి, వాకిటి
నారాయణపూర్‌ ‌నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల కోసం కర్నాటకతో రాష్ట్ర ప్రభుత్వం రాయబారం మొదలు పెట్టింది. ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యేందుకు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి లు మంగళవారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఎల్‌‌నినో ప్రభావంతో ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ జిల్లాలోని రైతులు, ప్రజలు సాగు, తాగు నీటికి పడుతున్న ఇబ్బందులను డీకేకు వివరించనున్నారు. రైతుల పంటలను కాపాడేందుకు దశలవారీగా నీటిని విడుదల చేయాలని కర్నాటక సీఎం ను మంత్రుల బృందం కోరనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -