గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల
వెంటనే నష్ట పరిహారం చెల్లింపు
రెగ్యులర్ గా జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీల సమావేశాలు :రాష్ట్ర స్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసుల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం–1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, న్యాయస్థానాల్లో విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాస చర్యలను ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు. కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాలు, మొబైల్ కోర్టుల పని తీరుతో పాటు చట్టంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రమంగా ఐదేండ్లలో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, ప్రధానంగా 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదించారు. అక్కడ పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలని వారికి సూచించారు. అందుకు అవసరమైన నిధులను బడ్జెట్ కేటాయింపులతో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్ ద్వారా విడుదల చేయాలన్నారు. అట్రాసిటీ ఘటనల్లో బాధితుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని, వారికి సకాలంలో నష్టపరిహారం, సహాయం, పునరావాసం అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఇటీవల షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే..
పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల పట్టాలు అందించిన ఘనత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీదని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆమె స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వారికి ప్రతి ప్రభుత్వ పథకం, కార్యక్రమంలో తగినంత ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. దళితులు, గిరిజనులను కాంగ్రెస్ సొంత బిడ్డల్లా ఆదరించిందనీ, అందుకే నేటికీ ఇందిరాగాంధీని పల్లెపల్లెనా స్మరించుకుంటున్నారని తెలిపారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 16 శాతం ఉంటే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో 31 శాతం మంది లబ్దిదారులు, ఎస్టీల జనాభా 10 శాతం ఉంటే కేటాయింపుల్లో 17 శాతం ఇండ్లను మంజూరు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు.
3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, వీటితో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు సహా పేద కుటుంబాలకు నాణ్యమైన భోజనం అందుతోందన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తోందన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే పని చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళీ నాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర ఎస్‌సీ కమిషన్ ఛైర్మెన్ బక్కి వెంకటయ్య, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు, ఎస్సీ కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



