Wednesday, September 23, 2026
E-PAPER
Homeబీజినెస్30 ఏళ్లలోపే సొంతింటి వైపు జెన్‌ Z..

30 ఏళ్లలోపే సొంతింటి వైపు జెన్‌ Z..

- Advertisement -

కోటక్‌ గణాంకాల్లో యువ గృహ రుణగ్రహీతల సంఖ్య 86 శాతం పెరుగుదల

నవతెలంగాణ-హైదరాబాద్: భారత యువతలో సొంతింటి కొనుగోలుపై ఆసక్తి పెరుగుతున్నట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా 25–30 ఏళ్ల వయస్సు గల ‘జెన్‌ Z’ గృహ రుణగ్రహీతల సంఖ్య FY24 నుంచి FY26 మధ్య 86 శాతం పెరిగినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఈ కాలంలో వారి సంఖ్య 1,234 నుంచి 2,290కి చేరింది.

కోటక్‌ వ్యక్తిగత గృహ రుణగ్రహీతల్లో జెన్‌ Z వాటా కూడా 6 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది. అంటే రెండేళ్లలో వారి వాటా 50 శాతం పెరిగింది. ఇదే సమయంలో 30–45 ఏళ్ల వయస్సు గల గృహ రుణగ్రహీతల సంఖ్య 26 శాతం మాత్రమే పెరిగినట్లు బ్యాంక్‌ పేర్కొంది. దీంతో గృహ రుణాల పోర్ట్‌ఫోలియోలో యువ రుణగ్రహీతల వృద్ధి వేగంగా నమోదవుతున్నట్లు తెలిపింది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ హోమ్‌ లోన్స్‌ హెడ్‌ నకుల్‌ సక్సేనా మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే యువత తక్కువ వయస్సులోనే గృహ రుణాల మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. తమ ఆకాంక్షలను ముందుగానే నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో యువ కొనుగోలుదారులు సొంతింటి వైపు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు.

కోవిడ్‌-19 తర్వాత ఇళ్లకు సంబంధించిన ప్రాధాన్యతల్లోనూ మార్పు వచ్చినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఇంట్లో ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో విశాలమైన స్థలం, గోప్యత, సహజ వెలుతురు, నిర్మాణ నాణ్యత, మెరుగైన కమ్యూనిటీ జీవనం వంటి అంశాలకు యువ కొనుగోలుదారులు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది.

అలాగే ఉన్నత విద్య, కెరీర్‌లో ముందుగానే పురోగతి, ఆదాయాల్లో పెరుగుదల వంటి అంశాలు కూడా యువత సొంతింటి లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవడానికి దోహదపడుతున్నాయని తెలిపింది. పెద్దదైన ‘ఫరెవర్‌ హోమ్‌’ కోసం వేచి ఉండటానికి బదులుగా తమ ప్రస్తుత బడ్జెట్‌, జీవిత దశకు అనుగుణంగా తొలి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంది.

జెన్‌ Z యువతకు సొంత ఇల్లు కేవలం నివాస స్థలంగా కాకుండా ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలిక సంపద నిర్మాణానికి ఒక అడుగుగా మారుతోందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. గత తరాలతో పోలిస్తే యువత ముందుగానే గృహ యాజమాన్యం వైపు అడుగులు వేస్తున్నట్లు బ్యాంక్‌ గణాంకాలు సూచిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -