నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ కృతజ్ఞత దినోత్సవం సందర్భంగా స్విగ్గీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో డెలివరీ భాగస్వాముల కోసం ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఇందుకోసం కేర్ ఆసుపత్రులతో స్విగ్గీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వ స్కిల్ హ్యూమన్ కాపిటల్, నాలెడ్జ్ ట్రైనింగ్ కార్యక్రమాల విభాగం కార్యదర్శి హరి చందన దాసరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్, ఇన్‌స్టామార్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది డెలివరీ భాగస్వాములు శిబిరంలో పాల్గొన్నారు.
శిబిరంలో రక్తపోటు, పల్స్, బ్లడ్ షుగర్, బరువు తదితర ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అంతర్గత వైద్య నిపుణుల సంప్రదింపులతో పాటు వైద్యుల సూచన మేరకు ఈసీజీ పరీక్షలు, కంటి, దంత పరీక్షలు చేపట్టారు. బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ (బీసీఏ), పోషకాహార నిపుణుల సలహాలు కూడా అందించారు. కేర్ ఆసుపత్రుల ఔట్‌పేషెంట్ సెంటర్‌కు చెందిన వైద్యులు, శిక్షణ పొందిన నిపుణులు పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హరి చందన దాసరి మాట్లాడుతూ.. నగరాల ఆర్థిక వ్యవస్థలో డెలివరీ భాగస్వాముల పాత్ర కీలకమన్నారు. వారి ఆరోగ్యం, సంక్షేమానికి మద్దతు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించిన స్విగ్గీ కార్యక్రమాన్ని అభినందించారు.
స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్-కార్పొరేట్ వ్యవహారాలు నేహా సింఘ్వి మాట్లాడుతూ.. డెలివరీ భాగస్వాములు స్విగ్గీ వ్యవస్థలో కీలక భాగమన్నారు. వారి ఆరోగ్యం, సంక్షేమానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డెలివరీ భాగస్వాములకు హెల్మెట్లను కూడా పంపిణీ చేశారు.
డెలివరీ భాగస్వాముల ఆర్థిక భద్రత, సంక్షేమం కోసం స్విగ్గీ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. జెరోధా ఫండ్ హౌస్‌తో భాగస్వామ్యం ద్వారా రూ.100 నుంచి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఇన్‌యాప్ సదుపాయం ద్వారా 50 వేలకు పైగా డెలివరీ భాగస్వాములు ప్రయోజనం పొందారని తెలిపింది.



