ఎన్నికల కమిషనర్ల మధ్య తీవ్ర విభేదాలు?
10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు
‘చట్టవిరుద్ధం’ అంటూ ఫారమ్-6 మార్పుపై ఆగ్రహం
రాజకీయంగా చర్చకు దారి తీస్తున్న తాజా పరిణామం
ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్‌పై రాజకీయ దుమారం కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌లోనే విభేదాలు బయటపడ్డాయి. ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గత పది నెలల్లో కనీసం 14 సార్లు కీలక నిర్ణయాలపై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్త ఓటర్ల నమోదు నుంచి ఓటర్ల పేర్ల తొలగింపు వరకు, ఓటర్ల డేటాబేస్‌పై నియంత్రణ నుంచి బెంగాల్‌లో ఓటర్ల తొలగింపుపై అప్పీళ్ల వరకు ఈ అభ్యంతరాలు ఉన్నట్టు నివేదికలు వివరిస్తున్నాయి.
న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. సర్‌కు సంబంధించిన పలు నిర్ణయాలపై పదేపదే ప్రశ్నలు లేవనెత్తినట్టు బయటపడింది. ముఖ్యంగా ఈ నిర్ణయాలు తమకు తెలియకుండా, తమ అనుమతి లేకుండా తీసుకున్నారనే అభ్యంతరాలను వారు నమోదు చేసినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్త కథనం వెల్లడించింది. కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారమ్-6లో సర్‌కు సంబంధించిన ప్రశ్నలను చేర్చడంపై ఇద్దరు కమిషనర్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త ఓటరు లేదా వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గత సర్ ఓటర్ల జాబితాలో ఉన్నాయా అని ప్రశ్నించేలా ఫారమ్‌ను మార్చారు. ఈ మార్పు చేయాలంటే ఎన్నికల నమోదు నిబంధనలను సవరించాల్సి ఉంటుందని వివేక్ జోషి మేలోనే స్పష్టం చేసినట్టు నివేదిక పేర్కొంది. సుఖ్‌బీర్ సింగ్ సంధు కూడా దీనితో ఏకీభవించారు. అయినప్పటికీ మార్పు అమల్లోకి వచ్చింది. ఆగస్టు 13న సంధు ఈ మార్పును ‘అనధికారికం, చట్టవిరుద్ధం’గా పేర్కొని వెంటనే తొలగించాలని కోరారు.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. కొత్త ఓటరుగా నమోదు కావడానికి చట్టబద్ధంగా ఉన్న ఫారమ్‌లోనే నిబంధనలకు విరుద్ధంగా మార్పులు జరిగాయా? జరిగితే ఎవరి ఆదేశాలతో జరిగాయి? ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత కూడా ఆ మార్పు ఎందుకు కొనసాగింది? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇప్పటికీ ప్రజల ముందుకు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఓటర్ల డేటాపైనా విభేదాలు
ఓటర్ల జాబితా నిర్వహణలో అధికారాల కేంద్రీకరణపైనా ఇద్దరు కమిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల డేటాబేస్‌పై క్రమంగా కేంద్ర స్థాయిలో నియంత్రణ పెరుగుతోందని వివేక్ జోషి హెచ్చరించనట్టు నివేదిక పేర్కొంది. చట్టబద్ధ అధికారులైన రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులకు ఓటర్ల డేటాపై పూర్తి స్థాయి యాక్సెస్ ఉండాలని ఆయన సూచించారు. సుఖ్‌బీర్ సంధు కూడా ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. ఓటర్ల జాబితాను నిర్వహించే సాఫ్ట్‌వేర్‌పై నియంత్రణ ఢిల్లీలో కేంద్రీకృతమైతే.. క్షేత్రస్థాయిలోని ఎన్నికల అధికారుల నిర్ణయాలకు కూడా సాంకేతిక వ్యవస్థ అడ్డంకిగా మారే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు వివరించారు. గోవాలో అర్హత ఉన్న 97 మంది ఓటర్ల విషయంలో అధికారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ సాఫ్ట్‌వేర్‌లో ఆ నిర్ణయాలను నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడినట్టు ఆంగ్ల వార్తా సంస్థ కథనం పేర్కొంది.
క్యాబినెట్ కార్యదర్శి వరకు వెళ్లిన విభేదాలు
ఎన్నికల కమిషన్‌లో విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మరో విషయం స్పష్టం చేస్తోంది. ఓటర్ల డేటాకు సంబంధించిన ఐటీ వ్యవస్థపై పర్యవేక్షణను ప్రభావితం చేసేలా పని విభజనలో మార్పులు జరిగాయని పేర్కొంటూ సంధు, జోషి విడివిడిగా క్యాబినెట్ కార్యదర్శిని సంప్రదించారు. ఈ మార్పులు తమకు తెలియకుండానే జరిగాయని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.
మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
ఈ పరిణామాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు మరింత పదును పెట్టాయి. ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారం కల్పించే చట్టం వచ్చిన తర్వాత ప్రస్తుత కమిషనర్లు నియమితులయ్యారని ప్రతిపక్షాలు గతంలో విమర్శించాయి. తాజా అంతర్గత విభేదాలను చూపిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ ఈ అభ్యంతరాలను ‘సాధారణ అంతర్గత సూచనలు’గా అభివర్ణించింది.
ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రశ్న
ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు సభ్యులు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేయడం కేవలం అంతర్గత పరిపాలనా వ్యవహారంగా ముగిసిపోవాల్సిన అంశం కాదని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఓటు హక్కుకు సంబంధించిన నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? ఓటర్ల డేటాపై ఎవరి నియంత్రణ ఉంది? కొత్త ఓటర్ల నమోదులో ఎలాంటి ప్రమాణాలు అమలు చేస్తున్నారు? ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను తొలగించేందుకు ఎవరు అప్పీళ్లు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు ప్రజలకు స్పష్టమైన సమాధానాలు అవసరమని వారు అంటున్నారు. ఓటర్ల జాబితా విషయంలో చిన్న అనుమానం కూడా ప్రజాస్వామ్యంపై పెద్ద ప్రశ్నగా మారుతుందనీ, అందుకే సర్‌పై రాజకీయ ఆరోపణలకంటే ముందుగా.. ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు సభ్యులు లేవనెత్తిన 14 అభ్యంతరాలకు పూర్తి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోందని సూచిస్తున్నారు.
బెంగాల్‌లో 16.10 లక్షల అప్పీళ్లపై ప్రశ్న
పశ్చిమ బెంగాల్‌లో సర్ సమయంలో మరో కీలక అంశంపైనా సంధు ప్రశ్నలు లేవనెత్తారు. ఓటర్ల జాబితాలో చేర్చిన వారి పేర్లను తొలగించాలని కోరుతూ 16.10 లక్షల అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ అప్పీళ్లను ఎవరు దాఖలు చేశారు? ఎన్నికల కమిషన్ తరఫున వాటిని దాఖలు చేయడానికి ఎవరు అనుమతిచ్చారు? అనే ప్రశ్నలను సంధు అధికారులను అడిగారు. ఈ ప్రక్రియ గురించి తనకు, మరో కమిషనర్ జోషికి, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు సమాచారం లేదని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. బెంగాల్‌లో సర్ కారణంగా పేర్లు తొలగించబడిన 22.21 లక్షల మంది ఓటర్లు తమ పేర్లను తిరిగి చేర్చాలని అప్పీల్ చేసినట్టు ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అదే సమయంలో మరో 16.10 లక్షల అప్పీళ్లు ఇప్పటికే చేర్చిన ఓటర్ల పేర్లను తొలగించాలని కోరుతున్నాయి. ఈ అప్పీళ్లను ఎవరు దాఖలు చేశారన్న ప్రశ్నకు మాత్రం స్పష్టత లేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈసీలోనే ‘సర్’పై తిరుగుబాటు!
- Advertisement -
- Advertisement -



