Thursday, September 24, 2026
E-PAPER
Homeక్రైమ్రిమ్స్‌ ఘటనలో 
మరో ఇద్దరు శిశువులు మృతి

రిమ్స్‌ ఘటనలో 
మరో ఇద్దరు శిశువులు మృతి

- Advertisement -

ఐదుకు చేరిన మృతుల సంఖ్య
ఆస్పత్రిని సందర్శించిన ప్రముఖులు
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
బీఆర్‌ఎస్‌ రూ.లక్ష ఆర్థిక సహాయం
టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కవిత రూ.50వేల చొప్పున అందజేత
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన


నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌ ఘటనలో ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు శిశువులు ‌పరిస్థితి విషమించి మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. బుధవారం పలువురు ప్రముఖులు ఆస్పత్రిని సందర్శించారు. రిమ్స్‌కు తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత వచ్చారు. మృతి చెందిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు ఆమె రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ముగ్గురు చిన్నారుల కుటుంబాలకు మంగళవారం సాయంత్రమే సాయం అందజేయగా, మిగతా ఇద్దరు చిన్నారుల కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు.

అదేవిధంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌, జోగు రామన్న, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జన్సాన్‌ నాయక్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ తదితరులు రిమ్స్‌‌ను సందర్శించి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పసికందులు మృతి చెందారని ఆరోపించారు. మృతి చెందిన శిశువుల కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తరపున రూ.లక్ష చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న శిశువులకయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, అవసరమైతే హైదరాబాద్‌కు తరలించి అత్యున్నత వైద్యం అందించాలని కోరారు.



​ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన శిశువుల కుటుంబాలకు పరిహారం అందించనున్నట్టు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా బుధవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవసరమైతే చిన్నారులను హైదరాబాద్‌లోని కార్పొరేట్‌, ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. అదేవిధంగా, రిమ్స్‌లో 150 పడకల సామర్థ్యంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఎంసీహెచ్‌ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -