జీ9 బొగ్గు కొనుగోలును వెంటనే చేపట్టండి
మహానది, కోల్ ఇండియాతో
చర్చలు జరపండి : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయి ఉత్పత్తికి కావాల్సిన జీ9 బొగ్గు కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు అవసరాలు, సింగరేణి సరఫరా చేస్తున్న బొగ్గు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి జీ 9 బొగ్గు అవసరం కాగా, సింగరేణి లో ఆ తరహా బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవనీ, సమీప భవిష్యత్తులోనూ ఆ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని అధికారులు సీఎంకు వివరించారు. జీ 9 బొగ్గు లభ్యత లేనప్పుడు ఆ సాంకేతికతతో పిట్ హెడ్ (బొగ్గు గనుల పైనే విద్యుత్ కేంద్ర నిర్మాణం) కాకుండా దూరంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎలా నిర్మించారని సీఎం ప్రశ్నించారు.
యాదాద్రి థర్మల్ కేంద్రానికి బొగ్గు సరఫరాతో రాష్ట్రంపై పడే అదనపు భారంపై సీఎం ఆరా తీశారు. నాడు రాజకీయ కారణాలతోనే పిట్ హెడ్ పై కాకుండా దూరంగా నిర్మించారనీ, రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల వరకు అదనపు భారం పడుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో జీ 9 బొగ్గును సింగరేణి సరఫరా చేయలేదని అధికారులు వివరించారు.
తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టికి సీఎం సూచించారు. సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎమ్‌డీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ డి. కృష్ణ భాస్కర్, టీజీఆర్పీడీసీఎల్ సీఎమ్‌డీ ముషారఫ్ అలీ, జెన్కో సీఎమ్‌డీ ఎస్. హరీష్, టీజీఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జితేష్ వి. పాటిల్, టీజీఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ వరుణ్ రెడ్డి, ఎస్సీసీఎల్ డైరెక్టర్ పి.గౌతమ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయి ఉత్పత్తి జరగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



