Thursday, September 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅబద్ధాలు...అతిశయోక్తులు

అబద్ధాలు…అతిశయోక్తులు

- Advertisement -

ఐరాస జనరల్‌ అసెంబ్లీలో స్వోత్కర్షతో సాగిన ట్రంప్‌ ప్రసంగం
న్యూయార్క్‌ :
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం చేసిన ప్రసంగం యావత్తూ అబద్ధాలు, అతిశయోక్తులతోనే సాగింది. ముందుగా తయారు చేసుకున్న ప్రసంగ పాఠాన్నే ఆయన చదివి వినిపించారు. ట్రంప్‌ తన ప్రసంగంలో…తనను తాను ఓ శాంతి దూతగా చెప్పుకున్నారు.అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి నప్పటి నుంచి ఎనిమిది యుద్ధాలను ఆపానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంబోడియా-థాయిలాండ్‌, కొసావో-సెర్బియా, రువాండా-డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, భారత్‌-పాకిస్తాన్‌, ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య ఘర్షణలను, గాజా యుద్ధాన్ని ప్రస్తావించారు. ఇజ్రాయిల్‌-ఇరాన్‌ మధ్య గత సంవత్సరం ఘర్షణల్ని నివారిం చానని, ఈజిప్ట్‌-ఇథియోపియా మధ్య యుద్ధం జరగకుండా చూశానని చెప్పారు. అయితే ట్రంప్‌ మాటలలో వాస్తవాల కంటే ‘అతిశయోక్తి’ ఎక్కువగా కన్పించింది.

జరిగిందేమిటి?
ఇథియోపియా డ్యామ్‌ ప్రాజెక్ట్‌ విషయంలో ఈజిప్ట్‌-ఇథియోపియా మధ్య ఉన్నది దౌత్యపరమైన వివాదమే తప్ప యుద్ధం కాదు. అలాగే సెర్బియా-కొసావో మధ్య జరిగింది కూడా యుద్ధం కాదు. ట్రంప్‌ ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో రువాండా-కాంగో మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ పోరు ఆగలేదు. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఇజ్రాయిల్‌ ఇప్పటికీ గాజాపై తరచుగా దాడులు చేస్తూనే ఉంది. గత సంవత్సరం ఇజ్రాయిల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధాన్ని ట్రంప్‌ ఆపినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయిల్‌ సేనలు టెహ్రాన్‌పై దాడులు చేశాయి.

గ్లోబల్‌ వార్మింగ్‌పై…
గ్లోబల్‌ వార్మింగ్‌పై పర్యావరణవేత్తలు చేస్తున్న హెచ్చరికలను ట్రంప్‌ తన ప్రసంగంలో ఎగతాళి చేశారు. ‘భూమి వేడెక్కడం లేదు. చల్లబడుతోంది. అయినా ఎవరూ చనిపోలేదు కాబట్టి గ్లోబల్‌ వార్మింగ్‌ ఇప్పుడు క్లయిమేంట్‌ ఛేంజ్‌గా పునర్జన్మ పొందింది’ అంటూ ఎద్దేవా చేశారు. గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి ట్రంప్‌ చెప్పిన మాటల్లో నాలుగు తప్పులు ఉన్నాయి. మొదటిది… క్లయిమేట్‌ ఛేంజ్‌, గ్లోబల్‌ వార్మింగ్‌ అర్థాలు వేరు. రెండోది… ప్రపంచం వేడెక్కుతోందని అనేక నివేదికలు చెబుతున్నా ఆయన అంగీకరించడం లేదు. మూడోది… వాతావరణం వేడెక్కడం వల్ల ఎవరూ చనిపోలేదని, ఇకపై చనిపోరని ట్రంప్‌ చెబుతున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా కలిగే అనర్థాలతో 2030-2050 మధ్య రెండున్నర లక్షల మరణాలు సంభవిస్తాయి. నాలుగోది… ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా 12 సంవత్సరాలలో మనమంతా చని పోతామని ఎవరో ఎక్కడో చెప్పి ఉండవచ్చు. కానీ నిపుణుల నివేదికలలో ఆ ప్రస్తావనే లేదు.

అమెరికాలో పెట్టుబడులపై…
అమెరికాలో 21 ట్రిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడు లకు హామీలు పొందా మని ట్రంప్‌ తన ప్రసంగంలో చెప్పారు. అయితే అందుకు తగిన ఆధారాలేవీ చూపలేదు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత 11.2 ట్రిలియన్‌ డాలర్ల పెట్టు బడులు వచ్చా యని వైట్‌హౌస్‌ వెబ్‌సైట్‌ చెబుతోంది. ఇది అధ్యక్షుడు చెబుతున్న దాని కంటే చాలా తక్కువ. వైట్‌హౌస్‌ లెక్కలో అమెరికా కంపెనీలతో పాటు విదేశీ సంస్థల హామీలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం అమెరికాకు 232 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని ఫెడరల్‌ డేటా చెబుతోంది.

కొరత లేదు
ఇరాన్‌ యుద్ధాన్ని ట్రంప్‌ సమర్ధించుకున్నారు. అమెరికా వద్ద తగినన్ని ఆయుధ నిల్వలు ఉన్నాయని, కొరతేమీ లేదని, మునుపెన్నడూ లేని స్థాయిలో వాటిని ఉత్పత్తి చేస్తున్నామని ట్రంప్‌ తెలిపారు. అయితే అమెరికా ఆయుధ సంపత్తి తగ్గిపోయిందని రక్షణ శాఖను పర్యవేక్షిస్తున్న ఫెడరల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, నిస్పాక్షిక ఫెడరల్‌ కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ కార్యాలయం గత వారం వేర్వేరు నివేదికలలో స్పష్టం చేశాయి.

వాషింగ్టన్‌ డీసీలో నేరాలపై…
తాను రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక నగరాలలో నేరాలు తగ్గుముఖం పట్టాయని ట్రంప్‌ చెప్పారు. వాషింగ్టన్‌ డీసీలో నేరాలు 87 శాతం తగ్గాయని, దానిని వంద శాతానికి చేరుస్తామని అన్నారు. అయితే 2024తో పోలిస్తే నేరాల సంఖ్య 23 శాతమే తగ్గిందని స్థానిక పోలీసు విభాగం చెబుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ తగ్గుదల 15 శాతం మాత్రమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -