వ్యవసాయ భూముల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్లు
17న మోడీ, షా దిష్టిబొమ్మల దహనం 21 మందిపై ఎఫ్‌ఐఆర్
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఘటన
దానికి వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళన
అదానీకి చెందిన సంస్థపై నాలుగు నెలలుగా పోరాటం
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ పుట్టినరోజున రైతులకు అవమానం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు చేస్తున్న అన్నదాతలపై కేసులు నమోదయ్యాయి. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధిత రైతులు విస్మయం వ్యక్తం చేశారు. ఈనెల 17న మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను కొందరు రైతులు దహనం చేశారు. అయితే ఈ ఘటనపై గుజరాత్‌లోని మోర్బీ జిల్లా జెట్‌పర్ గ్రామానికి చెందిన 21 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే తమ నిరసన మోడీ పుట్టినరోజుకు వ్యతిరేకంగా కాదనీ, వ్యవసాయ భూముల మీదుగా నిర్మిస్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్లు, టవర్లకు వ్యతిరేకంగానే నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్నామని రైతులు చెప్తున్నారు.
జూన్ నుంచి జెట్‌పర్‌తో పాటు చుట్టుపక్కల 35 గ్రామాల రైతులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌కు చెందిన హల్వాడ్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. తమ భూముల వినియోగానికి మరింత పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జులైలో ప్రభుత్వం మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించే కొత్త విధానాన్ని ప్రతిపాదించినా, అన్ని డిమాండ్లు నెరవేరలేదని రైతులు చెప్తున్నారు.
ఈనెల 17న జరిగిన దిష్టిబొమ్మల దహనం అనంతరం మోర్బీ తాలూకా పోలీసులు 18న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 21 మందిలో కొందరు ఘటనాస్థలంలో లేరని రైతు నాయకులు ఆరోపించారు. కాగా ఈ ఉద్యమానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కాంతిభాయ్ అమృతియా సోదరులు కరాభాయ్, భరత్‌భాయ్ మద్దతు ప్రకటించడం గమనార్హం. కరాభాయ్ రైతులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. రైతులపై నమోదైన కేసు వారిని భయపెట్టే ప్రయత్నమని ఆయన ఆరోపించారు.
విద్యుత్ లైన్ల వల్ల పంటలు, చెట్లు, భూమి విలువ దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టవర్ల కోసం భూమి మార్కెట్ విలువ ఆధారంగా అధిక పరిహారం, పంటలు-చెట్ల నష్టానికి ప్రత్యేక పరిహారం, ప్రమాద బీమా, ముందస్తు చెల్లింపులు, ప్రభుత్వ, గౌచర్ భూములకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు నాయకులు స్పష్టం చేశారు.
మోడీ పుట్టినరోజున రైతులపై కేసులు
- Advertisement -
- Advertisement -



