నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యసభ సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. అర్హులైన ఓటర్లను మినహాయించకుండా తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. SIRకి సంబంధించిన పూర్తి ఎలక్ట్రానిక్, పరిపాలనా ఆడిట్ ట్రయల్‌ను న్యాయ, పార్లమెంటరీ పరిశీలన కోసం సంరక్షించాలని కూడా ఆయన సూచించారు.
ఎన్నికల కమిషన్ సమగ్రత, ఎన్నికల పట్టికలు, పౌరుల ఓటు హక్కును కాపాడేందుకు తక్షణ రాజ్యాంగ జోక్యం కోరుతూ, ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక తీవ్ర సమీక్ష (Special Intensive Revision – SIR) చుట్టూ ఉన్న ఆందోళనల నేపథ్యంలో ఈ లేఖ రాశారు.
గత 10 నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కనీసం 14 సార్లు అభ్యంతరాలు నమోదు చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చెబుతోంది. వీటిలో ఫామ్-6లో మార్పులు, ఎన్నికల పట్టిక డేటాబేస్‌పై కేంద్రీకృత నియంత్రణ, ఓటరు నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, అలాగే ఓటర్లను పునరుద్ధరించిన ఆదేశాలపై ఈసీఐ దాఖలు చేసిన అప్పీళ్లు వంటి అంశాలు ఉన్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విషయంపై పెండింగ్‌లో ఉన్న పార్లమెంటరీ విచారణలు రాజ్యాంగం ప్రకారం కొనసాగేలా చూడాలని రాష్ట్రపతిని కోరారు. ఓటు హక్కు, చట్ట పాలనను సమర్థవంతంగా రక్షించే విధంగా సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉండాలని, SIRలో ఏదైనా భాగం చట్టపరమైన అధికారం లేకుండా లేదా తగిన రాజ్యాంగ రక్షణలు లేకుండా జరిగినట్లు తేలితే తగిన న్యాయ పరిహారం కూడా ఉండాలని’ ఎంపీ బ్రిట్టాస్ నొక్కి చెప్పారు.


