Homeజాతీయంయూపీలో ఘోర బస్సు ప్రమాదం

యూపీలో ఘోర బస్సు ప్రమాదం

- Advertisement -

ప్రయివేట్‌ స్లీపర్‌ బస్సులో చెలరేగిన మంటలు
9 మంది సజీవదహనం.. మరికొందరికి గాయాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ సీఎం యోగి దిగ్ర్భాంతి

​లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని జేవార్ విమానాశ్రయం సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ప్రయివేట్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బీహార్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న రాజ్ కల్పనా ట్రావెల్స్ బస్సు 50 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి మహోబా వెళ్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో గ్రేటర్‌ ‌నోయిడాలోని జేవార్‌ ‌విమానాశ్రయం సమీపంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ బస్సును కమ్మేసింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఎక్స్‌ప్రెస్‌వే పక్కకు ఆపడంతో కొందరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరికొందరు ప్రాణభయంతో బస్సు నుంచి బయటపడేందుకు కిటికీల నుంచి దూకారు. అయితే తొమ్మిది మంది ప్రయాణికులు మాత్రం బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి.

దట్టమైన పొగతో ప్రయాణికుల ఆందోళన
బస్సులో మంటలు చెలరేగిన సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నట్టు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు తెలిపారు. మంటలు వ్యాపిస్తున్న విషయం గుర్తించేలోపే బస్సు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయిందని చెప్పారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని తెలిపారు. పొగ కారణంగా బస్సు నుంచి బయటకు రావడం కష్టంగా మారిందని, దీనికి తోడు ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సులోంచి బయటకు పరుగులు తీయడంతో తోపులాట జరిగి కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఐదు ఫైరింజన్లతో మంటల అదుపు
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. అయితే అప్పటికే బస్సులోని కొంతమంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారని వెల్లడించారు. ఘటన అనంతరం పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ప్రాథమిక విచారణ ప్రకారం.. బస్సు ఏసీ వ్యవస్థలో ఏర్పడిన నిప్పురవ్వ కారణంగా ఇంజన్ లూబ్రికెంట్ ఆయిల్‌కు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి పూర్తి కారణాలపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదం తర్వాత యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. కాలిపోయిన బస్సును అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు. మృతుల గుర్తింపు, గాయపడిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -